e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home హైదరాబాద్‌ మొదలైంది టీకా.. కదిలారు చకచకా..

మొదలైంది టీకా.. కదిలారు చకచకా..

మొదలైంది టీకా.. కదిలారు చకచకా..
  • సూపర్‌ స్ప్రెడర్లకు టీకాలు షురూ
  • తొలిరోజు 21,666 మంది సద్వినియోగం
  • 44 ఏండ్లలోపు 15,963 మంది,
  • 45 ఏండ్లు పైబడినవారు 5703 మంది
  • ముందే టోకెన్ల జారీతో తప్పిన రద్దీ
  • ప్రభుత్వానికి నిత్య సేవకుల కృతజ్ఞతలు
  • టీకా కేంద్రాలను పరిశీలించిన సీఎస్‌, మంత్రులు, ప్రజాప్రతినిధులు

కరోనా కట్టడి కోసం నిత్య సేవకులకు (సూపర్‌ స్ప్రెడర్స్‌) టీకాలు వేసే కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. తొలిరోజు జీహెచ్‌ఎంసీ పరిధిలో 21,666 మందికి తొలిడోసు కింద కొవిషీల్డ్‌ టీకాలు వేశారు. ముందుగానే గుర్తించిన వారికి ఒకరోజు ముందుగానే టోకెన్లు అందజేసి.. సర్కిళ్ల వారీగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 వరకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రేటర్‌ పరిధిలోని పలు కేంద్రాలను మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి, సబితాఇంద్రారెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు. ఇక గోషామహల్‌లో అనర్హులకు టోకెన్లు ఇచ్చిన డీసీ,ఏఎంఓహోచ్‌కు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశాల మేరకు బల్దియాకమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ మెమోలు జారీ చేశారు.

సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తికి అధిక అవకాశమున్న నిత్య సేవకుల (సూపర్‌ స్ప్రెడర్లు)కు టీకాలు వేసే ప్రక్రియ శుక్రవారం జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా ప్రారంభమైంది. పక్కా ఏర్పాట్లు చేయడం, ముందే వాహకులకు టోకెన్లు జారీ చేయడంతో తొలిరోజు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతమైంది. టోకెన్లు తీసుకున్న వారు వరుస క్రమంలో టీకాలు వేసుకొని మురిసిపోయారు. కరోనా నుంచి తమను రక్షించేందుకు ప్రభుత్వం టీకాలు ఇవ్వడంపై కృతజ్ఞతలు తెలిపారు. మొదటిరోజు జీహెచ్‌ఎంసీ పరిధిలో 21,666 మందికి టీకాలు వేశారు. నిత్య సేవకులుగా గుర్తించిన వివిధ రంగాలకు చెందిన వారికి వ్యాక్సిన్‌ వేసేందుకు 30 సర్కిళ్లలో విస్తృత ఏర్పాట్లు చేశారు. అయితే 30 వేల మందికి టోకెన్లు జారీ చేయగా 21,666 మంది సద్వియోగం చేసుకున్నారు. అనారోగ్యం, ఉపాధి, వివిధ కారణాలతో మిగతావారు టీకాకు దూరంగా ఉండిపోయారు.

అనర్హులకు టోకెన్లా..?

అనర్హులకు టోకెన్లు జారీ చేయడంపై ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోషామహల్‌ సర్కిల్‌లోని రెడ్‌రోజ్‌ వ్యాక్సిన్‌ సెంటర్‌ను ఆయన పరిశీలించగా అనర్హులకు టోకెన్లు ఇచ్చినట్లు గుర్తించారు.ఇందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించగా..డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాస్‌, ఏఎంవోహెచ్‌ ఉమా గౌరీలకు మెమో జారీ చేశారు. అంతకుముందు ఖైరతాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లోని కేంద్రాన్ని సీఎస్‌ పరిశీలించారు.

కేంద్రాలను పరిశీలించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు

గ్రేటర్‌వ్యాప్తంగా చేపట్టిన స్పెషల్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను ప్రజాప్రతినిధులు పర్యవేక్షించారు. మంత్రులు తలసాని, మల్లారెడ్డి, సబితారెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌, మేయర్‌ గద్వాల విజయలక్ష్మీ, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ పలు కేంద్రాలను పరిశీలించారు. మేయర్‌ గద్వాల విజయలక్ష్మి బంజారాహిల్స్‌, సనత్‌నగర్‌, ఖైరతాబాద్‌ పరిధిలోని కేంద్రాలను పర్యవేక్షించారు. డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతారెడ్డి సికింద్రాబాద్‌ సర్కిల్‌లోని పలు కేంద్రాలను సందర్శించారు. ఎమ్మెల్సీలు శంభీపూర్‌ రాజు, కుర్మయగారి నవీన్‌కుమార్‌, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద, ప్రకాష్‌గౌడ్‌, గూడెం మహిపాల్‌రెడ్డి, పాషాఖాద్రి, దానం నాగేందర్‌, మాగంటి గోపినాథ్‌, పలువురు కార్పొరేటర్లు తమ పరిధిలోని వ్యాక్సిన్‌ కేంద్రాలను పరిశీలించారు.

వీధి వ్యాపారులను గుర్తించారు

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి. వీధి వ్యాపారులను గుర్తించి.. వారి కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది. 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ వేయడం ఎంతో హర్షించదగినది. అర్హులంతా టీకాలు వేయించుకొని ప్రభుత్వానికి సహకరించాలి.- అంజలి, కూరగాయల విక్రయదారు, మహేంద్రాహిల్స్‌

సీఎంకు రుణపడి ఉంటాం..

ప్రజలతో మమేకమై ఉండే పలువృత్తుల వారిని గుర్తించి వారికి టీకాలు వేయడం హర్షణీయం. కరోనా వచ్చి చాలామంది రేషన్‌ డీలర్లు కష్టాల్లో పడ్డారు. నెలలో 20 రోజులపాటు ప్రజలకు నిత్యావసర సరుకులు ఇస్తుంటాం. అలాంటి రేషన్‌ డీలర్లకు టీకాలు వేయిస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.- బి.కృష్ణ, రేషన్‌డీలర్‌, నేరేడ్‌మెట్‌

టీకానే.. శ్రీరామరక్ష

కరోనా సోకకుండా టీకానే మనల్ని కాపాడుతుంది. సూపర్‌ స్ప్రెడర్స్‌కు వ్యాక్సిన్‌ వేయడం మంచి నిర్ణయం. ఈ విషయంలో ఎవరూ వెనకడుగు వేయకుండా టీకాలు వేయించుకోవాలి. రోజుకూలీ చేసుకునే మాలాంటి వారిని గుర్తించి ఉచితంగా వ్యాక్సిన్‌ వేయించడం వల్ల మా కుటుంబాలను కూడా కాపాడిన వాళ్లవుతున్నారు. – రామారావు, భవన నిర్మాణ మేస్త్రీ

సొంతూరికి వెళ్లాలనుకున్నా..

కరోనాతో నగరాన్ని వదిలి సొంతూరికి వెళుదామని అనుకున్నా. ప్రభుత్వం వ్యాక్సిన్‌ వేయించి ఆదుకుంటుందని అనుకోలేదు. మాలాంటి వారి కోసం ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయం. వ్యాక్సిన్‌ వేయడంతో ఇక్కడే ఉండి పనులు చేసుకుంటా. -కుమారస్వామి, పెయింటర్‌, పార్శిగుట్ట

టీకాలియ్యడం సంతోషం

పొద్దున లేచినప్పటి నుంచి మేం జనాల్లో తిరుగుతుంటాం. ఎంతోమంది ఆటోలో రాకపోకలు సాగిస్తారు. మా నుంచి వారికి, వారి నుంచి మాకు కరోనా సోకే ప్రమాదముంది. నాలాంటి ఆటోవాళ్లను గుర్తించి టీకా ఇయ్యడం సంతోషం. వ్యాక్సిన్‌ వేసుకున్న. ఇంతమంచి నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. మల్లేశ్‌, ఆటోడ్రైవర్‌, మియాపూర్‌

రిస్క్‌ తప్పింది..

వాహనంలో ఇంధనం కోసం పెట్రోలుబంకుకు రాక తప్పదు. ఈ స్వల్ప సమయంలోనే ఎవరికి పాజిటివ్‌ ఉన్నా మరొకరు రిస్క్‌లో పడతారు. రాష్ట్ర ప్రభుత్వం రిస్క్‌ జాబ్‌ ఉండే వారిని ప్రత్యేకంగా గుర్తించి టీకాలు వేయడం మంచి పరిణామం. టీకా వేయించుకోవడంతో రిస్క్‌ తప్పింది. -ఆర్‌.మౌనిక, ఐవోసీ ఫిల్లింగ్‌స్టేషన్‌, నాచారం

గొప్ప అవకాశం

కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో సూపర్‌ స్ప్రెడర్లుగా గుర్తించి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్‌ చేస్తుండడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. ఇప్పటివరకు వ్యాక్సిన్‌ తీసుకునేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్‌ వేయడం కొండంత ధైర్యం కలిగింది. -అశోక్‌వర్మ, కిరాణ దుకాణదారు, దీప్తిశ్రీనగర్‌

అందరూ వినియోగించుకోవాలి

సూపర్‌ స్ప్రెడర్స్‌గా చిరు వ్యాపారులు, పండ్లు, కూరగాయలు విక్రయించేవారు, గ్యాస్‌ బాయ్‌లు, రేషన్‌డీలర్లను ప్రత్యేకంగా గుర్తించడం విశేషం. దుకాణం వద్దకే వచ్చి సిబ్బంది టోకెన్‌ ఇచ్చిండ్రు. వ్యాక్సిన్‌ వేయించుకోవడం ద్వారా వైరస్‌ను తరిమికొట్టవచ్చు. ప్రత్యేక కేంద్రంలో వసతులు బాగున్నాయి. -మహేశ్వరి, చిరువ్యాపారి, మాధవపురి

టీకా వేయడం సంతోషకరం

విధి నిర్వహణలో పెట్రోల్‌బంక్‌,గ్యాస్‌ ఏజెన్సీలలో పనిచేసే తమను సూపర్‌ స్ప్రెడర్స్‌గా గుర్తించి ప్రభుత్వం టీకాలు వేయడం సంతోషకరం. ఇప్పటివరకు టీకా ఎప్పుడు, ఎక్కడ వేయించుకోవాలో తెలియక భయాందోళనకు గురయ్యాను. టీకా వేయించుకున్నా. ఈ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌, వైద్య సిబ్బందికి ధన్యవాదాలు.- ఉదయం కుమార్‌రెడ్డి, పెట్రోల్‌బంక్‌ సిబ్బంది

ప్రభుత్వానికి రుణపడి ఉంటాం

సూపర్‌ స్ప్రెడర్లుగా రేషన్‌డీలర్లను గుర్తించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. ఎంతోమంది రేషన్‌ డీలర్లు, వారి కుటుంబ సభ్యులు కరోనాతో మృత్యువాతపడ్డారు. ప్రభుత్వ నిర్ణయంతో వేలాదిమంది రేషన్‌ డీలర్ల కుటుంబాలు సురక్షితంగా ఉంటాయి. – ప్రవీణ్‌కుమార్‌, రేషన్‌ డీలర్‌

ఏర్పాట్లు బాగున్నాయి..

టీకా వేయించుకోవాలని కొద్దిరోజుల నుంచి ఆరాటపడుతున్నా. జీహెచ్‌ఎంసీ సిబ్బంది షాపు వద్దకు వచ్చి వ్యాక్సిన్‌ వేయించుకోవాలంటూ కూపన్‌ ఇచ్చారు. క్షౌరవృత్తిదారులు ఎంతటి జాగ్రత్తలు తీసుకుంటున్నా సమస్యలు తలెత్తుతున్నాయి. టీకా కేంద్రంలో ఏర్పాట్లు బాగున్నాయి.-పరమేశ్‌, హెయిర్‌ కటింగ్‌ సెలూన్‌, బేగంపేట

సులభంగా వేయించుకున్నా..

కరోనా ఎక్కువగా విస్తరించే వర్గాలను గుర్తించి వారికి త్వరితగతిన వ్యాక్సినేషన్‌ చేయించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు భేష్‌. జీహెచ్‌ఎంసీ సిబ్బంది మా దగ్గరకు వచ్చి వ్యాక్సిన్‌ వేయించుకోమని టోకెన్‌ ఇచ్చారు. ఇంత సులభంగా వ్యాక్సిన్‌ వేయించుకుంటానని ఊహించలేదు. -వెంకటేశ్‌, కార్పెంటర్‌, సనత్‌నగర్‌

ఎంతోమందికి మేలు

వ్యాక్సిన్‌ దొరుకుతుందా అని ఎంతోమందిని అడిగినా ప్రయోజనం లేకపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సార్‌ చొరవతో సూపర్‌ స్ప్రెడర్లకు వ్యాక్సిన్‌ వేసుకునే వెసులుబాటు కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా చిన్నాచితక పనులు చేసుకునే వారికి ఈ డ్రైవ్‌ ఎంతో మేలు చేస్తుంది. -శ్రీరాంరెడ్డి, ప్రైవేట్‌ టీచర్‌

కేసీఆర్‌ సల్లగుండాలే..

మేం బాగుండాలని సీఎం కేసీఆర్‌ సారు గుర్తించి టీకాలు ఇవ్వడం సంతోషంగా ఉన్నది. మాకు వ్యాక్సిన్‌ వేయించేందుకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయడం గొప్ప విషయం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పది నిమిషాల్లోనే వ్యాక్సిన్‌ వేశారు. పేదల కోసం పరితపించే సీఎం కేసీఆర్‌ సార్‌ సల్లగుండాలె.- వేణు, నలగండ్ల కూరగాయల మార్కెట్‌

ముప్పు తప్పుతుంది..

మద్యం దుకాణంలో పనిచేస్తున్నా. ఎంతోమంది దుకాణానికి వచ్చిపోతుంటారు. వారిద్వారా కరోనా వస్తుందని భయపడిన. వ్యాపారులు, రోజువారి పనులు చేసుకునే వారి కోసం వ్యాక్సినేషన్‌ చేపట్టడం వల్ల ఎంతోమందికి మంచి జరుగుతుంది. వ్యాక్సిన్‌ వేసుకోవడంతో ఎంతో ధైర్యం వచ్చింది. – తిరుమలేశ్‌, వైన్‌షాపు సిబ్బంది, ఖాజాగూడ

ఇబ్బంది లేకుండా టీకా తీసుకున్నా

టీకా ఎప్పుడు వేసుకుంటామో తెల్వక ఇన్నాళ్లు తీవ్ర మనోవేదనతో ఉన్నాము. సీఎం కేసీఆర్‌ మాలాంటి వారిని గుర్తించి కరోనా వైరస్‌ నుంచి కాపాడేందుకు ప్రత్యేకంగా టీకాలు వేసినందుకు రుణపడి ఉంటాం. ప్రత్యేక కేంద్రంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా టీకా వేసుకున్నా. -కిరణ్‌, విత్తనాల కంపెనీ ఉద్యోగి, మేడ్చల్‌

వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూశాం

వ్యాక్సిన్‌ వేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. మెహిదీపట్నం ఎల్‌ఐసీ కాలనీలో ఉంటున్న తమ వద్దకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది వచ్చి టోకెన్లు ఇచ్చిండ్రు. కరోనా అంతానికి ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలి. -రాజ్యలక్ష్మి, బట్టల దుకాణం

టీకాతో ఆందోళన దూరం

పెట్రోల్‌బంకులకు నిత్యం వందలాదిమంది వస్తుంటారు. వారిలో పాజిటివ్‌ ఎవరో, నెగెటివ్‌ ఎవరో తెలియదు. వారి నుంచి డబ్బులు తీసుకోవడం, ఇస్తుంటాం. వృత్తిరీత్యా కరోనా రిస్కును ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఇప్పుడు మాకు ధైర్యం వచ్చింది. థ్యాంక్స్‌ సీఎం కేసీఆర్‌ సార్‌. -కన్నయ్య, పెట్రోల్‌బంకు ఉద్యోగి,ఉప్పల్‌

ఆనందంగా ఉంది

కరోనా ఎక్కడ వస్తుందోనని భయపడుతున్న సమయంలో ప్రభుత్వం మాలాంటోళ్లకు టీకాలు ఇవ్వడం ఆనందంగా ఉన్నది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఇలాంటి అవకాశాన్ని ఇంటికి వచ్చి కల్పించారు. వ్యాక్సిన్‌ వేసుకున్నా. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సిబ్బంది టీకా వేశారు.-రమణ, వాచ్‌మన్‌

టోకెన్‌ ఉంటేనే అనుమతి

వాహకులను ముందుగానే గుర్తించి టోకెన్లు జారీ చేస్తున్నామని, టోకెన్‌ లేనివారిని టీకా కేంద్రంలోకి అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. గ్రేటర్‌వ్యాప్తంగా రోజూ 30 వేల మందికి టీకాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని, మరో 9 రోజులపాటు స్పెషల్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ఉంటుందని చెప్పారు. అనవసరంగా వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్దకు వచ్చి ఇబ్బందులకు గురికావొద్దని సూచించారు.

టోకెన్లు ఇచ్చిండ్రు..

దుకాణాల వారికి, వీధి వ్యాపారులకు వ్యాక్సిన్‌ వేయడం చాలా బాగుంది. టీకాల కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలి. అర్హులైన వారిని గుర్తించి వ్యాక్సిన్‌ వేస్తే ప్రయోజనం ఉంటుంది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఇంటింటికి వచ్చి టోకెన్లు ఇచ్చిండ్రు. దీనివల్ల రద్దీ ఉండకుండా ఉంటుంది. -మహ్మద్‌ ఎజాజ్‌, వ్యాపారి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మొదలైంది టీకా.. కదిలారు చకచకా..

ట్రెండింగ్‌

Advertisement