శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Hyderabad - Feb 23, 2021 , 06:27:45

కొవిడ్‌పై కట్టడి.. సడలించకండి

కొవిడ్‌పై కట్టడి.. సడలించకండి

  • కొవిడ్‌ నిబంధనలు మరిచిన జనం
  • కానరాని మాస్కులు, భౌతిక దూరం
  • విజృంభిస్తున్న బి117 రకం కొత్త స్ట్రైయిన్‌
  • రోగి శరీరంలో రెండు వారాల పాటు తిష్ట
  • యువతపైనే ఎక్కువగా పంజా విసురుతున్న వైరస్‌
  • మార్చి, ఏప్రిల్‌లో కేసులు పెరిగే అవకాశం
  • యువతా.. తస్మాత్‌ జాగ్రత్త

అమ్మో మార్చి.. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ఆ నెల మళ్లీ రానే వచ్చేసింది. సరిగ్గా ఏడాది కిందట ఇదే సమయంలో మాయదారి మహమ్మారి విస్తరణ మొదలై రక్తసంబంధాలను కూడా దరిచేరని పరిస్థితి తీసుకువచ్చింది. ఆ రోజులు మరువక ముందే అప్పుడే మళ్లీ మార్చి నెల రానే వచ్చింది. వైరస్‌ను కూడా వెంటనే తీసుకువస్తున్నది. గడిచిన ఆరు మాసాలుగా తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన వైరస్‌ మళ్లీ నాటి రోజులను గుర్తుచేస్తున్నది. గత ఏడాది మార్చి నెలలో విజృంభించిన మహమ్మారి.. ఈ సారి కూడా మళ్లీ భయపెడుతున్నది. లాక్‌డౌన్‌ సడలింపు నుంచి క్రమక్రమంగా ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిపోయింది. కొవిడ్‌ నిబంధనలు గాలికి వదిలేశారు. మాస్కులు, భౌతిక దూరం, కనీస జాగ్రత్తలు పాటించకుండా విచ్చలవిడిగా సంచరిస్తున్నారు. పాతపద్ధతిలోనే చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. అయితే అవకాశం కోసం నీడలా పొంచిఉన్న వైరస్‌ ప్రజల నిర్లక్ష్యంపై గురిపెట్టి మళ్లీ పంజావిసిరే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే పక్కరాష్ర్టాల్లో యూకే స్ట్రైయిన్‌ వైరస్‌ విజృంభిస్తున్నది. ఇది యువతపైనే ఎక్కువ ప్రభావం చూపుతున్నది. స్వీయ నియంత్రణనే శ్రీరామ రక్షగా భావించి.. యువత తస్మాత్‌ జాగ్రత్త.

సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : అమ్మో మళ్లీ మార్చి నెల వచ్చేస్తున్నది. సరిగ్గా ఏడాది కిందట అంటే మార్చి నెలలోనే దేశంతో పాటు రాష్ట్రంలో కరోనా కలకలం మొదలైంది. మార్చి 22న రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైంది. అనంతరం లాక్‌డౌన్‌తో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలను మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా కరోనా వైరస్‌ మళ్లీ భయపెడుతున్నది. పొరుగు రాష్ర్టాల్లో కేసులు పెరుగుతుండటం, అందులో ‘బి117’రకానికి చెందిన యూకే స్ట్రైయిన్‌ వైరస్‌ విజృంభన అధికంగా ఉండటంతో తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముందస్తుగా అప్రమత్తమైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మన వద్ద కూడా మొన్నటి కంటే కేసుల సంఖ్య నెమ్మదిగా పైకి ఎగబాకుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రానున్న మార్చి, ఏప్రిల్‌ నాటికి కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు లేకపోలేదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ తదితర రాష్ర్టాల్లో కేసులు పెరుగుతుండటంతో సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వైద్యాధికారులతో సమావేశమయ్యారు. కరోనా నోడల్‌ కేంద్రమైన గాంధీ దవాఖానతో పాటు గచ్చిబౌలిలోని టిమ్స్‌, కింగ్‌కోఠి దవాఖానలలో ముందస్తు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అనుమానితులు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. 

రెండు వారాలపాటు తిష్టవేస్తున్న కొత్త వైరస్‌

కరోనాలో మ్యుటేషన్‌ చెందిన ‘బి117’ రకం యూకే స్ట్రైయిన్‌ ఎక్కువగా యువతపై ప్రభావం చూపుతున్నట్లు నమోదవుతున్న కేసుల ద్వారా తెలుస్తున్నది. దీనికి ప్రధాన కారణం యువత కొంత నిర్లక్ష్యంతో ఎక్కువగా బయట తిరగడం, ప్రయాణాలు చేయడం ఒక కారణంగా చెప్పవచ్చు. అయితే రోగనిరోధక శక్తి అధికంగా ఉన్నప్పటికీ యువతపై యూకే స్ట్రైయిన్‌ తీవ్ర ప్రభావం చూపుతున్నది. మన వద్ద కూడా కేసులు సంఖ్య స్వల్పంగా పెరగడం మొదలైనట్లు తెలుస్తున్నది. రానున్న మార్చి, ఏప్రిల్‌ నాటికి కేసుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. ప్రారంభంలో వచ్చిన వైరస్‌ కంటే ప్రస్తుతం వస్తున్న యూకే స్ట్రైయిన్‌ ఎక్కువ కాలం రోగి శరీరంలో ఉంటుంది. పాత వైరస్‌ వారం రోజుల పాటు ఉంటే బి117 వేరియంట్‌కు చెందిన వైరస్‌ కనీసం రెండు వారాలపాటు రోగి శరీరంలో తిష్ట వేయడం ఆందోళన కలిగిస్తున్నది. దీని వల్ల రోగి బాగా వీక్‌ అయిపోవడంతో పాటు సకాలంలో సరైన చికిత్స తీసుకోకపోతే ప్రమాదం లేకపోలేదు. పాత వేరియంట్‌కి, కొత్త వేరియంట్‌కి సంబంధించిన లక్షణాలు ఒకటే. కాని తీవ్రతనే అధికం. కొత్త వేరియంట్‌ వైరస్‌ వ్యాప్తి కూడా వేగంగా జరుగుతుంది. దక్షిణాఫ్రిక, బ్రెజిల్‌ వేరియంట్స్‌ ఇంకా సివియర్‌గా ఉంటున్నాయి. మన దగ్గర ఇప్పటివరకు కేసులు నమోదు కాలేదు.- డాక్టర్‌ పరంజ్యోతి, పల్మనాలజి విభాగాధిపతి, నిమ్స్‌ దవాఖాన

‘కరోనా’ కాషన్‌ నిబంధనలు పాటించకుంటే మోగనున్న అలారం

కొవిడ్‌ నిబంధనలు పాటించకుంటే అలారం మొగనున్నది. అలాంటి సాంకేతిక పరికరాన్ని మాస్కు రూపంలో రూపొందించారు.. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ పరిశోధన (ఐఐఎస్‌ఈఆర్‌) భోపాల్‌ శాస్త్రవేత్తలు. దానికి క్రౌడ్‌ మాస్కుగా పేరు పెట్టారు. వివరాల్లోకి వెళితే.. ఐఐఎస్‌ఈఆర్‌ భోపాల్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ విభాగానికి చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పీబీ సుజిత్‌ నేతృత్వంలో అదే డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రొఫెసర్‌ మిత్రడిప్‌ భట్టాచారి, శాంతను టెండుల్కర్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన వెంకటేశ్వర్‌రావు, బీఎస్‌ఎంఎస్‌ విద్యార్థి కాశీ కలిసి క్రౌడ్‌ అండ్‌ మాస్కును ఆవిష్కరించారు. ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌ (ఏఐ)- మెషిన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. హెచ్‌డీ కెమెరాను అమర్చిన ఈ పరికరానికి మైక్రోచిప్‌ కంప్యూటర్‌ను అనుసంధానించారు. ఈ పరికరంలోని కెమెరా తన చుట్టూ ఉన్న పరిసరాలను, వ్యక్తులను స్కాన్‌ చేస్తుంది. నిబంధనలు పాటించని వారినే కాదు, ఆ పరిసర ప్రాంతంలో ఉన్నవారిని కూడా అప్రమత్తం చేస్తుంది. దీనిని ఐఐఎస్‌ఈఆర్‌ భోపాల్‌ క్యాంపస్‌లో ఇప్పటికే ఏర్పాటు చేసి పరీక్షించగా అది విజయంతంగా పనిచేస్తుండటం విశేషం.

  • ప్రైవేటు ఆరోగ్య కార్యకర్తలకు సెకండ్‌ డోస్‌ షురూ
  • గ్రేటర్‌లో మొదటి రోజు 8546మందికి వ్యాక్సినేషన్‌

సిటీబ్యూరో, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ): గ్రేటర్‌లో ప్రభుత్వ వైద్య రంగంలోని ఆరోగ్య కార్యకర్తలకు రెండవ డోస్‌ వ్యాక్సినేషన్‌ ముగిసింది. ప్రైవేటు హెల్త్‌కేర్‌ వర్కర్లకు సోమవారం నుంచి సెకండ్‌ డోస్‌ టీకాను ప్రారంభించారు. గ్రేటర్‌ వ్యాప్తంగా 97వేల మంది హెల్త్‌కేర్‌ వర్కర్లు ప్రైవేటు రంగంలో ఉండగా వారిలో 50వేల మందికిపైగా మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. వీరందరికీ ఈనెల 22నుంచి రెండవ డోస్‌ టీకాను ప్రారంభించినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. సోమవారం గ్రేటర్‌ వ్యాప్తంగా 8546మంది ప్రైవేటు హెల్త్‌కేర్‌ వర్కర్లకు టీకా ఇవ్వగా అందులో హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 5441మంది, మేడ్చల్‌ జిల్లా పరిధిలో 2190 మంది, రంగారెడ్డి జిల్లా పరిధిలో 915మంది హెల్త్‌కేర్‌ వర్కర్లు రెండవ డోస్‌ తీసుకున్నారు.

VIDEOS

logo