e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home హైదరాబాద్‌ గుర్తించడమే అసలైన మందు

గుర్తించడమే అసలైన మందు

గుర్తించడమే అసలైన మందు
  • పోస్ట్‌ కొవిడ్‌లో కండరాలు, రక్తం గడ్డలు కట్టడం లాంటి సమస్యలు
  • ప్రారంభంలో కంటే రెండో దశలోనే ఈ సమస్య ఎక్కువ
  • పలు అధ్యయనాల్లో వెల్లడి
  • సత్వరమే రోగికి శస్త్ర చికిత్స చేయాలి
  • ఎండోవాస్కులర్‌ సర్జన్‌ డాక్టర్‌ దేవేందర్‌సింగ్‌

“కరోనా నుంచి కోలుకున్న కొందరిలో రక్తం గడ్డ కట్టడం, కండరాల్లో గడ్డలు
ఏర్పడటం లాంటి సమస్యలు పీడిస్తున్నాయి. ఇది రోగులను కోలుకోని స్థితికి తీసుకు వెళ్తుందని, ముందే గుర్తిస్తే ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చు.” అని యశోద హాస్పిటల్స్‌ ఎండో వాస్కులర్‌ సీనియర్‌ సర్జన్‌ డాక్టర్‌ దేవేందర్‌సింగ్‌ పేర్కొన్నారు. పోస్ట్‌ కొవిడ్‌ తర్వాత ప్రధానంగా కండరాల్లో గడ్డలు, రక్తం గడ్డ కట్టడం లాంటి సమస్యలను ఎలా గుర్తించాలి.. దాని నుంచి బయటపడేందుకు చికిత్స, ప్రజల్లో నెలకొన్న భయాలపై డాక్టర్‌ దేవేందర్‌సింగ్‌ ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

గడ్డలు ఏర్పడటాన్ని గుర్తించడం ఎలా? వైద్య చికిత్స విధానం ఏంటి?

కరోనా నుంచి కోలుకున్న తర్వాత శరీరంలో గడ్డలు ఏర్పడుతాయి. ఒళ్లంతా నొప్పులు పెడుతుంది. పల్మనరి త్రాంబోఎంబోలిజం, ధమనిలో గడ్డలు ఏర్పడితే రక్త ప్రవాహానికి అంతరాయం కలుగుతుంది. ఊపిరితిత్తుల్లో చేరితే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. మెదడు, గుండెకు సరఫరా అయ్యే రక్తంలో అంతరాయం(క్లాట్‌) ఏర్పడితే స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఉంది. డీ డైమర్‌, ప్లేట్‌లెట్స్‌, ప్రెబ్రినోజెస్‌ వంటి పరీక్షల ద్వారా దీని తీవ్రతను గుర్తించొచ్చు. డయాబెటిస్‌, కిడ్నీ వంటి కోమార్బిడిటీ డిసీజెస్‌ ఉన్న వారిలో ఇతర అవయవాలపై ప్రభావం చూపడం ఖాయం. వెంటనే చికిత్స చేయకపోతే అవయవాల పనితీరు క్షీణిస్తుంది. రక్తపోటు, ఊబకాయం, ధూమపానం, మద్యపానం, మాదక ద్రవ్యాలు తీసుకునే అలవాటు ఉన్నవారితో పాటు దీర్ఘకాలిక వ్యాధులున్న వారిలో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువ. దీనిపై చాలా మంది వైద్యులకు అవగాహన ఉంది. సత్వరమే స్పందించడంతో పాటు శస్త్ర చికిత్సలు చేసి కండరాలు, రక్త నాళాలు, ఇతర అవయవాల్లో ఏర్పడిన గడ్డలను తొలగించి రోగి ప్రాణాలు కాపాడవచ్చు.

గడ్డలు ఏర్పడటానికి గల కారణాలు?

కొవిడ్‌ -19 తీవ్రమైన మంటలు, నొప్పులను కలిగిస్తుంది. వైరస్‌ బారిన పడిన వారిలో రోగనిరోధక శక్తిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీంతో రక్తంలో, కండరాల్లో గడ్డలు ఏర్పడుతాయి. రక్తంపై వైరస్‌ దాడి కూడా ఓ కారణంగా భావించవచ్చు. తద్వారా శరీరంలోని పలు భాగాల్లో రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతుంది. ముందుగా ఓ భాగంలో రక్తం గడ్డకట్టడం.. ఆ తర్వాత శరీరంలోని ఇతర భాగాలకు విస్తరిస్తుందని హార్వర్డ్‌ విశ్వ విద్యాలయం చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. కొవిడ్‌ రోగులకు గడ్డకట్టే ప్రోటీన్‌ ఫ్యాక్టర్‌ ఐదు కంటే తక్కువగా ఉన్నప్పుడు రోగికి ప్రమాదం ఎక్కువ. ఊపిరితిత్తులు, సిరల్లో రక్తం గడ్డకడితే ఆకస్మిక మరణానికి దారితీస్తుంది.

కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఈ ప్రమాదం ఉందా?

కొవిడ్‌ తగ్గిన తర్వాత రోగుల్లో అనేక సమస్యలు బయటపడుతున్నాయి. అందులో కండరాలు, రక్తంలో గడ్డలు ఏర్పడటం అనేవి తీవ్ర సమస్యగా పరిణమిస్తున్నాయి. దీంతో అవయవాలు పని చేయకుండా పోతున్నాయి. గుం డె, మెదడులో స్ట్రోక్‌ ఏర్పడి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక మందిలో ఈ సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మన దగ్గర కూడా కొందరు ఈ ప్రభావంతో మృత్యువాత పడినట్టు నిర్ధారణ అయ్యింది.

మొదటి దశ కరోనాలో ఈ సమస్యలున్నాయా?

మొదటి దశలో ఇలాంటి రోగుల సంఖ్య అరుదుగా కనపడింది. రెండో దశలో రక్తం గడ్డకట్టడం అనేది అనేక మందిలో కనిపించింది. కేవలం రక్తంలోనే కాక ఊపిరితిత్తులు, గుండె, పేగు, కడుపులో కూడా రక్తం గడ్డకట్టింది. వైరస్‌ బారిన పడ్డ వారు.. కోలుకున్న వారు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.

అధిగమించేందుకు ఏం చేయాలి?

ఈ సమస్యను ముందుగా గుర్తిస్తే ప్రమాదం నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. రక్తం గడ్డకడితే అవయవాల పనితీరు మందగిస్తుంది. కండరాలు నీలం రంగులోకి మారిపోతాయి. రోగి ప్రాణాలు కాపాడేందుకు ఆ గడ్డలు తొలగించడమే ఏకైక మార్గం. సకాలంలో శస్త్ర చికిత్స చేయగలిగితే రోగి ప్రాణాలను కాపాడవచ్చు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గుర్తించడమే అసలైన మందు

ట్రెండింగ్‌

Advertisement