e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home హైదరాబాద్‌ నెగెటివ్‌ వచ్చినా బీ.. కేర్‌ఫుల్‌

నెగెటివ్‌ వచ్చినా బీ.. కేర్‌ఫుల్‌

నెగెటివ్‌ వచ్చినా బీ.. కేర్‌ఫుల్‌
 • పెరిగిన వైరస్‌ తీవ్రత కాలం
 • నాడు 1-2 వారాలు.. నేడు 2-4 వారాలు
 • లక్షణాల్లోనూ సరికొత్త మార్పులు
 • పెరిగిన లాంగ్‌ కొవిడ్‌ ఎఫెక్ట్‌ గడువు
 • వైరస్‌ మ్యుటేషనే ప్రధాన కారణం
 • దీర్ఘకాలిక వ్యాధులు, నిర్లక్ష్యమే కారణం
 • కోలుకున్నా.. జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు

హైదరాబాద్‌, సిటీబ్యూరో, మే 19(నమస్తే తెలంగాణ): కరోనా వైరస్‌ తరచూ రూపుమార్చుకుంటున్నది. దీంతో వ్యాధి లక్షణాలు, శరీరంపై తీవ్రత, రోగకాలం.. ఇలా అన్నీ ఎప్పటికప్పుడు మారుతున్నాయి. మొదటి వేవ్‌లో కనిపించిన లక్షణాలు ఇప్పుడు పెద్దగా కనిపించకుండానే బాధితులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. కిడ్నీ, రక్త సంబంధ సమస్యలు ఎదురై కొందరు తక్కువ సమయంలోనే ప్రాణాపాయ స్థితికి చేరుతున్నారు. మొదటి వేవ్‌లో 1 నుంచి 2 వారాలు మాత్రమే శరీరంలో వ్యాధి ప్రభావం కనిపించగా, ఇప్పుడు 2 నుంచి 4 వారాల పాటు సతాయిస్తున్నది. వైరస్‌ నుంచి కోలుకున్న తర్వాత (లాంగ్‌ కొవిడ్‌) కూడా దీర్ఘకాలిక ఇబ్బందులు తలెత్తుతున్నట్టు స్పష్టమవుతున్నది. మొదట్లో మైల్డ్‌, మోడరేట్‌, సీరియస్‌ పరిస్థితులు ఎదురుకాగా, ఇప్పుడు నేరుగా మోడరేట్‌, సీరియస్‌ పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇందుకు మహారాష్ట్ర వేరియంట్‌ ప్రధాన కారణమైతే.. చేతులారా చేస్తున్న తప్పులు కూడా వైరస్‌ విజృంభణకు దోహదమవుతున్నదని వైద్యనిపుణులు చెబుతున్నారు.

రెండు వేవ్‌లకు చాలా తేడాలు

మొదటి వేవ్‌లో కరోనా వచ్చినవాళ్లకు, ఇప్పుడు వైరస్‌సోకినవారికి చాలా తేడా కనిపిస్తున్నది. గతేడాది కరోనా విజృంభించిన సమయంలో బాధితుల్లో ఒకేరకమైన లక్షణాలు కనిపించేవి. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒంటి నొప్పులు వంటివి ఉండేవి. వీటిని గుర్తించి వెంటనే కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకుంటే అసలు విషయం బయటపడేది. సెకండ్‌ వేవ్‌లో అలా లేదు. ఒకేరకమైన లక్షణాలు కనిపించకుండానే శరీరంపై వైరస్‌ దాడి పూర్తిచేస్తున్నది. సాధారణంగా వైరస్‌ శరీరంలో ప్రవేశించి నాటి నుంచి తీవ్ర ప్రభావం చూపే వరకు నాలుగు దశలు ఉంటాయి. ఇవి ఇంక్యుబేషన్‌, వైరీమియా, ఎర్లీ లంగ్‌, లేట్‌ లంగ్‌. సాధారణంగా ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ 5 రోజులు ఉంటే, సెకండ్‌ వేవ్‌లో 3 రోజులకు, వైరీమియా 7 నుంచి 5 రోజులకు తగ్గింది. దీంతో వైరస్‌ సోకినప్పటికీ లక్షణాలు గుర్తించే లోపు నేరుగా మూడో దశకు వెళ్లిపోతున్నది. సాధారణంగా కనిపించే లక్షణాలు సెకండ్‌ వేవ్‌లో కనిపించడం లేదు. కిడ్నీపై ప్రభావం మొదలైన దశ అంటే ఎర్లీ లంగ్‌, లేట్‌ లంగ్‌లో అసలు విషయం బయట పడుతున్నది. అందుకే రెండో వేవ్‌ వైరస్‌ను ముందుగా గుర్తించేందుకు.. ఇప్పుడు ర్యాట్‌, ఆర్టీపీసీఆర్‌ పరీక్షల కంటే సీటీ స్కాన్‌పై వైద్యులు ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం పరీక్షల కంటే కూడా చికిత్సకు ప్రాధాన్యం ఇస్తున్నది. ట్రీట్‌మెంట్‌ ఫస్ట్‌ విధానంతో ముందస్తు వైద్యం అందిస్తూ.. ప్రాణాపాయస్థితికి చేరుకోకుండా చర్యలు తీసుకుంటున్నది.

ఆక్సిజన్‌ లెవల్స్‌ చెక్‌ చేస్తుండాలి..

సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ ప్రభావం చాలా భిన్నంగా ఉంటున్నది. ఊపిరితిత్తులు పూర్తిగా ఇన్‌ఫెక్ట్‌ అయినప్పటికీ లక్షణాలు త్వరగా బయట పడటంలేదు. అవి ఒక్కసారిగా విఫలమయ్యేసరికి రోగి అకస్మాత్తుగా చనిపోతున్నాడు. మరికొందరు 14 రోజుల ఐసొలేషన్‌ తరువాత ప్రాణాలు కోల్పోతున్నారు. ఊపిరితిత్తులు, గుండె, మెదడుకు చెందిన రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడమే ఇందుకు కారణం. ఇది ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో జరుగుతున్నది. దీనిని నివారించేందుకు ముందు నుంచి అప్రమత్తంగా ఉండాలి. ఐసొలేషన్‌ సమయంలో, కోలుకున్న తర్వాత ఆక్సిజన్‌ స్థాయిలను చెక్‌ చేసుకుంటూ.. ఉండాలి. ఆక్సీమీటర్‌ అందుబాటులో లేకుంటే.. ఊపిరి విడుదల చేసి 30 సెకండ్లపాటు అలాగే ఉండేందుకు ప్రయత్నించాలి. కనీసం 20 సెకండ్లపాటు ఉండలేకపోతున్నామంటే ఆక్సిజన్‌ స్థాయి తక్కువగా ఉన్నదని అర్థం. వెంటనే వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్‌ కిరణ్‌ మాదాల, క్రిటికల్‌ కేర్‌ నిపుణుడు, నిజామాబాద్‌ ప్రభుత్వ దవాఖాన

బ్లడ్‌ థిన్నర్స్‌ వాడాలి..

కరోనా రోగుల్లో చాలా మందికి గుండె, మెదడు, ఊపిరితిత్తులకు సంబంధించిన రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతున్నది. అలా జరిగినప్పుడు ఆక్సిజన్‌ స్థాయిలు ఒక్కసారిగా పడిపోతాయి. గుండె, మెదడు వంటి ప్రధాన అవయవాలకు రక్తసరఫరా ఆగిపోయి విఫలమవుతాయి. దీంతో రోగి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. వైరస్‌ వచ్చిన 14 రోజుల తరువాత కూడా కనీసం మూడు వారాలు బ్లడ్‌ థిన్నర్‌ మందులు (రక్తం పలుచన చేసేవి) వాడాలి. దీనివల్ల రక్తం గడ్డకట్టకుండా రక్షించుకోవచ్చు. బీపీ, షుగర్‌ ఉన్నవారు, వృద్ధులు ముందు జాగ్రత్తగా సంబంధిత మందులు వాడాలి. దీంతో గుండెపోటు, ఆక్సిజన్‌ పడిపోవడం వంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. స్టెరాయిడ్స్‌ను వైద్యుల సూచనల మేరకే వాడాలి. ఐసొలేషన్‌ తరువాత కూడా జాగ్రత్తగా ఉండాలి.- డాక్టర్‌ పరంజ్యోతి, పల్మనాలజి విభాగాధిపతి నిమ్స్‌ దవాఖాన

అనారోగ్యానికి దారి తీస్తున్న అంశాలు..

 • మైల్డ్‌గా లక్షణాలు ఉన్నప్పుడు లెక్క చేయడం లేదు. సివియర్‌గా లక్షణాలు వచ్చినప్పుడు అప్రమత్తమవుతున్నారు. దవాఖానకు వెళ్లే సమయానికి క్లిష్టంగా మారతున్నది.
 • నిర్ధారణ పరీక్షల పేరిట కాలయాపన చేయడం. పాజిటివ్‌ రిపోర్టు వచ్చే వరకు చికిత్స ప్రారంభించకపోవడం.
 • ఇష్టానుసారంగా స్టెరాయిడ్స్‌ వాడుతున్నారు. సీరియస్‌, హాస్పిటలైజ్డ్‌ కేసుల్లోనే స్టెరాయిడ్స్‌ వినియోగించాలి. దీని అతి వినియోగం వల్లే బ్లాక్‌ ఫంగస్‌ వ్యాప్తి చెందుతున్నది.
 • సాధారణ లక్షణాలు ఉండి ఇంట్లో చికిత్స పొందుతున్నవారు నిత్యం అప్రమత్తంగా ఉండటం లేదు. నిజానికి లక్షణాల్లో తేడా కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. వారి సూచన మేరకు మందులు వాడాలి.
 • ఆక్సిజన్‌ శాతం పట్టించుకోవడం లేదు. ఐసొలేషన్‌లో ఉన్నవారు ఆక్సిజన్‌ స్థాయిని ప్రతి 6 గంటలకు ఒకసారి చెక్‌ చేసుకోవాలి. 94 శాతం కంటే తక్కువ ఉంటే వైద్యులను సంప్రదించాలి. దీర్ఘకాలిక రోగులు బ్లడ్‌ షుగర్‌, బీపీ లెవల్స్‌ని చెక్‌చేసుకోవాలి.
 • మోడరేట్‌ లక్షణాలున్నవారిని పడకల కోసం నచ్చిన దవాఖానలో బెడ్‌ కోసం తిప్పడం కంటే, సమీపంలోని ప్రభుత్వ దవాఖానలో చేర్పించాలి. దీని వల్ల సకాలంలో వైద్యం అందుతుంది.
 • కొవిడ్‌ తగ్గిన తర్వాత కూడా మాస్కులు ధరించాలి. భౌతికదూరం, శుభ్రత పాటించాలి. ఇబ్బంది అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

సెకండ్‌ వేవ్‌ దీర్ఘకాలిక సమస్యలు

 • గుండె సంబంధిత- రక్తం గడ్డకట్టడం
 • శ్వాస సంబంధిత- ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌
 • చర్మ సంబంధిత- దద్దుర్లు
 • మెదడు- రుచి, వాసన కోల్పోవడం, నిద్ర పట్టకపోవడం
 • సైకియాట్రిక్‌- మానసిక ఒత్తిడి, ఆత్రుత
 • ఈఎన్‌టీ సంబంధ- బ్లాక్‌ ఫంగస్‌, కండ్లు ఎర్రబడటం

మరణాలు ఎందుకు ఎక్కువంటే..

కరోనా రోగుల్లో హఠన్మరణాలకు రక్తం గడ్డకట్టడమే ప్రధాన కారణమంటున్నారు వైద్యనిపుణులు. ఫస్ట్‌ వేవ్‌ కంటే సెకండ్‌ వేవ్‌ మరణాల్లో 30 శాతం కంటే ఎక్కువ ఐసొలేషన్‌ పీరియడ్‌ తర్వాతే జరుగుతున్నట్టు మెడికల్‌ రికార్డుల ద్వారా తెలుస్తున్నది. పాజిటివ్‌ వచ్చి, 14 రోజులు ఐసొలేషన్‌ సమయం పూర్తిచేసుకొని పూర్తిగా కోలుకున్న తర్వాత కొందరు దీర్ఘకాలిక రోగులకు అకస్మాత్తుగా ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోతున్నాయి. మరికొందరికి గుండెపోటు వచ్చి మరణిస్తున్నారు. ఈ పరిణామాలకు రోగుల్లోని రక్తనాళాలల్లో రక్తం గడ్డకట్టడమే కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితులు ఎక్కువ శాతం 30 నుంచి 50 ఏండ్ల లోపువారిలో కనిపిస్తున్నాయని అంటున్నారు. వైరస్‌ ఊపిరితిత్తులతో పాటు గుండె, కాలేయం, కిడ్నీలు, మెదడు తదితర ప్రధాన అవయవాలపై ప్రభావం చూపుతున్నదని, వైరస్‌ సోకిన తర్వాత ఇన్‌ఫెక్షన్‌ ప్రభావంతో ఈ అవయవాలు దెబ్బతిని ఐసొలేషన్‌ సమయం అనంతరం లక్షణాలు బయట పడుతున్నట్టు పేర్కొంటున్నారు.

మహారాష్ట్ర వేరియంట్‌ ప్రధాన కారణం..

ప్రస్తుతం మహారాష్ట్ర వేరియంట్‌ 1, 2, 3లో రెండో రకం…తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. యూకే, సౌతాఫ్రికా, బ్రెజిల్‌ వేరియంట్ల కంటే 2వ రకం గుబులు పుట్టిస్తున్నది. మహారాష్ట్ర వేరియంట్‌ ఇతర దేశాల్లోనూ ప్రభావం చూపుతున్నది. అందుకే ఎక్కువగా కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. మహారాష్ట్ర వేరియంట్‌పై లాన్‌సెట్‌ జరిపిన పరిశోధన ప్రకారం.. వైరస్‌ లోడ్‌ అధికంగా ఉండటంతో పాటు ఊపిరితిత్తులను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నది. అందుకే వయస్సుతో సంబంధం లేకుండా యువతకు సైతం సోకుతున్నది. రోగనిరోధకశక్తి ఉన్నా.. వ్యాక్సిన్లు తీసుకున్నా.. వైరస్‌ బారిన పడుతున్నారు. ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో ఎక్కువకాలం చికిత్స అందించాల్సి వస్తున్నది. డిసెంబర్‌లో ఇంత తీవ్రత ఉండేది కాదు. ఇదే విషయం లాన్‌సెట్‌ ప్రచురించింది. మొదటి వేవ్‌లో రెండు వారాల్లోనే రికవరీ అయ్యేవారు. దవాఖానలో పెద్దగా చేరే పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మొదటి వేవ్‌లో మైల్డ్‌, మోడరేట్‌, సివియర్‌ స్థితులు ఉండగా, ఇప్పుడు నేరుగా మోడరేట్‌, సివియర్‌ దశలకు చేరడం, వైరస్‌ నుంచి కోలుకున్నప్పటికీ లాంగ్‌ కొవిడ్‌ ఎఫెక్ట్‌ తీవ్రంగా ఉండటం గమనించవచ్చు. గతంలోనూ లాంగ్‌ కొవిడ్‌లో అలసట, ఒంటి నొప్పులు ఉండేవి. ఇప్పుడు ఊపిరితిత్తులు, గుండె సమస్యలతో పాటు కొందరిలో బ్లాక్‌ ఫంగస్‌ సమస్యలు తలెత్తుతున్నాయి.

ఎవరికి ఎక్కువ ప్రమాదం అంటే..

సెకండ్‌ వేవ్‌ కరోనా దీర్ఘకాలిక రోగులకు శాపంగా మారుతున్నది. వైరస్‌ను గుర్తించడంలో ఆలస్యం చేయడం, సకాలంలో చికిత్స అందకపోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. బీపీ, మధుమేహం, క్యాన్సర్‌, కిడ్నీ, కాలేయ సమస్యలతోపాటు వృద్ధులకు పోస్ట్‌ కొవిడ్‌ ప్రమాదం ఇతరుల కంటే ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వీరిలోనే ఎక్కువగా గుండెపోటు రావడం, ఆక్సిజన్‌ స్థాయిలు ఒక్కసారిగా పడిపోవడం వంటివి సంభవిస్తున్నాయని అంటున్నారు. గుండె, మెదడు, ఊపిరితిత్తులకు సంబంధించిన రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడమే ప్రధాన కారణమని పేర్కొంటున్నారు. అందుకే వైరస్‌ సోకినప్పటి నుంచి కోలుకున్న రెండు, మూడు నెలలపాటు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. డయాబెటిస్‌తో బాధపడే కొందరిలో చికిత్స కోసం స్టెరాయిడ్స్‌ ఉపయోగించడం వల్ల బ్లాక్‌ ఫంగస్‌ సమస్య తలెత్తుతున్నట్టు చెప్పారు. రోగనిరోధకశక్తి తగ్గిపోవడం, ఆక్సిజన్‌ థెరపీలో సరైన నిబంధనలు పాటించకపోవడం వల్ల ఫంగస్‌ విస్తరిస్తున్నట్టు పేర్కొంటున్నారు. కొవిడ్‌ నుంచి కోలుకున్నవారు మాస్కులు ధరించడం, డయాబెటిస్‌ వ్యాధిని అదుపులో ఉంచుకోవడం వల్ల బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడకుండా రక్షించుకోవచ్చని సూచిస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నెగెటివ్‌ వచ్చినా బీ.. కేర్‌ఫుల్‌

ట్రెండింగ్‌

Advertisement