ఆదివారం 24 జనవరి 2021
Hyderabad - Dec 04, 2020 , 03:27:07

3 లోపే తీర్పు

3 లోపే తీర్పు

 • నేడు బల్దియా ఎన్నికల ఓట్ల లెక్కింపు 
 • మధ్యాహ్నానికి వెలువడనున్న జీహెచ్‌ఎంసీ ఫలితాలు
 • ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ 
 • తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌
 • తొలి రౌండ్‌ ఫలితాలు 12 కల్లా
 • రెండో రౌండ్‌ 2.00
 • మూడో  రౌండ్‌ 3.00
 • రౌండ్‌కు 14,000 ఓట్ల లెక్కింపు 
 • పోటీలో 1122 అభ్యర్థులు 
 • ‘కారు’కు అనుకూలంగా ఎగ్జిట్‌ పోల్స్‌ 
 • ఫుల్‌ జోష్‌లో గులాబీ శ్రేణులు

బల్దియా పోరు చివరి అంకానికి చేరుకున్నది. మహా సంగ్రామంలో విజేతలెవరో తేల్చే రోజు వచ్చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం జరుగనున్నది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానున్నది. సర్కిళ్ల వారీగా 30 చోట్ల  కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఒక్కో రౌండ్‌కు 14000 ఓట్లు లెక్కించనున్నారు. కొవిడ్‌ నిబంధనలకు లోబడి ప్రక్రియ సాగనున్నది. మధ్యాహ్నం మూడుకల్లా పూర్తి ఫలితాలు వెల్లడికానున్నాయి. కాగా, గెలుపు ఓటములపై ఎవరి అంచనాలు వారికి ఉంటే.. ఫలితాలకు ఒకరోజు ముందే వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌లో బల్దియాపై ఎగిరేది గులాబీ జెండానే అని  తేలడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఫుల్‌ జోష్‌లో ఉన్నాయి. మొత్తం ఓటర్లు 74,67,256 పోలైనవి 34,50,331 డివిజన్లు 150, 150 వార్డుల్లో 1122 మంది అభ్యర్థుల పోటీ మూడో పాలకవర్గాన్ని ఎన్నుకోనున్న 34.50లక్షల మంది ఓటర్లు

సిటీబ్యూరో, హైదరాబాద్‌ : నేడు గ్రేటర్‌ తీర్పు రానుంది. దేశ వ్యాప్తంగా ఉత్కంఠతను రేపుతున్న హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ మహా నగర మూడో పాలకవర్గం ఎన్నికల కౌంటింగ్‌ శుక్రవారం ఉదయం మొదలుకానుంది. 150 డివిజన్లు, 74.04 లక్షల మంది ఓటర్లతో ఉన్న ఈ మహానగర కార్పొరేషన్‌ ఎన్నికల్ని ప్రతి పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. పోలింగ్‌ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రేటర్‌ వ్యాప్తంగా 9,101 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం రోజు పోలింగ్‌ ప్రశాంతంగా ముగియడంతో పాటు గ్రేటర్‌ చరిత్రలో అత్యధిక పోలింగ్‌ శాతం నమోదైంది. 150 డివిజన్ల బరిలో 1122 మంది అభ్యర్థులు నిలవగా, బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకున్న 34,50,331 మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. కాగా శుక్రవారం నిర్వహించే కౌంటింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేసేందుకు ఎన్నికల సంఘంతోపాటు జీహెచ్‌ఎంసీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రేటర్‌వ్యాప్తంగా 30 కౌంటింగ్‌ కేంద్రాల్లో 150 లెక్కింపు హాళ్లను ఏర్పాటు చేశారు. ఉదయం ఎనిమిది గంటలకు లెక్కింపు మొదలుకానుంది.

లెక్కింపుప్రక్రియ

 1. లెక్కింపు కేంద్రంలో14 టేబుళ్లనుఏర్పాటు చేశారు.
 2. మొదట పోస్టల్‌బ్యాలెట్ల లెక్కిస్తారు.
 3. బ్యాలెట్‌ బాక్స్‌లనుతెరిచి పది -పది చొప్పున బ్యాలెట్లను కట్టలుగా కడతారు.
 4. మొదటి రౌండ్‌ఓట్ల లెక్కింపుచేపడతారు.
 5. ఒక్కో టేబుల్‌కు100 కట్టల చొప్పున, మొత్తం1000బ్యాలెట్లు ఇస్తారు.
 6. 14 టేబుళ్లకు 14000 ఓట్లు ఇస్తారు.
 7. టేబుళ్లవారీగాఆయా పార్టీలకు పోలైన ఓట్లను లెక్కిస్తారు.
 8. మొదటి రౌండ్‌లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రకటిస్తారు.
 9. రెండో రౌండ్‌లో 14 టేబుళ్లకు 100 కట్టల చొప్పున 14000ఓట్లు ఇస్తారు.
 10. రెండో రౌండ్‌ ఫలితాలు ప్రకటిస్తారు.
 11. 28వేలకు పైగా ఓట్లు పోలైన డివిజన్ల రిజల్ట్‌ మూడో రౌండ్‌లో ప్రకటిస్తారు.

ఫలితాల ప్రకటన ఇలా..

 • ఉదయం ఏడు గంటలకు పోస్టల్‌ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు ప్రారంభం
 • మొదటి గంటలో పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి
 • అనంతరం రెండు గంటల్లో బ్యాలెట్‌ కట్టలు కట్టడం పూర్తవుతుంది
 • ఉదయం పది గంటలకు బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు షురూ
 • రెండు గంటల్లోగా మొదటి రౌండ్‌, తదుపరి రెండు గంటల్లో రెండో రౌండ్‌ లెక్కింపు పూర్తి
 • ఇబ్బందులు తలెత్తకుంటే మధ్యాహ్నం మూడు గంటల్లోపు తుది ఫలితం వెల్లడి


logo