శనివారం 23 జనవరి 2021
Hyderabad - Dec 05, 2020 , 02:31:49

కౌంటింగ్‌.. ప్రశాంతం

 కౌంటింగ్‌.. ప్రశాంతం

జంగంమెట్‌ డివిజన్‌ ఓట్ల లెక్కింపులో స్వల్ప ఉద్రిక్తం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల లెక్కింపు ఒకటి రెండు చోట్ల మినహా మిగతా ప్రాంతా ల్లో ప్రశాంత వాతావరణంలో ముగిసింది. కొన్ని చోట్ల ఓట్ల లెక్కింపు హోరా హోరీగా సాగింది. నువ్వా.. నేనా? అం టూ సాగడంతో అన్ని పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. పాతబస్తీలోని అరోరా కాలేజీ కేంద్రంలో జరిగిన లెక్కింపులో బీజీపీ, ఎంఎంఐ మధ్య ఘర్షణలు తలెత్తాయి. దీంతో జంగంమెట్‌, ఉప్పుగూడ ఫలితాల్లో జాప్యం ఏర్పడింది. జంగంమెట్‌ ఫలితాల్లో ఎంఐఎం ఆందోళనకు దిగింది. బీజీపీ కార్యకర్తలపై దాడి చేయడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో కొంత సేపు కౌంటింగ్‌ను ఆపేశారు. కౌంటింగ్‌ జరగకుండా ఎంఐఎం అడ్డుకోవడంతో లెక్కింపు కౌంటర్‌ వద్ద పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఉన్నతాధికారులు ఈ విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. దాంతో రాత్రి జంగంమెట్‌ డివిజన్‌ ఓట్ల లెక్కింపు కొనసాగింది. ఇదిలాఉండగా.. నగరంలోని మిగతా కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కౌంటింగ్‌ ప్రశాంతంగా  ముగిసింది. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

 రాచకొండ పరిధిలో ..

 రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది. 30 డివిజన్‌లకు సంబంధించి ఆరు కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. ఈ కేంద్రాల వద్ద మూడంచల భద్రతను సీపీ మహేశ్‌ భగవత్‌ ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీగా సిబ్బందిని మొహరించారు. రౌండ్‌ థి క్లాక్‌, సీసీ కెమెరాల సర్వేలెన్స్‌తో పాటు టెక్నాలజీ సహాయంతో అనుమానాస్పద ప్రాంతాలను నిత్యం పోలీసులు వీక్షించారు. ఈ విధంగా ఎలాంటి అ వాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికలు, బ్యాలెట్‌ బాక్సులు భద్రపర్చిన స్ట్రాంగ్‌ రూంల వద్ద, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయడంతో అంతా ప్రశాంతంగా ముగిసింది. భద్రతను సమర్థవంతంగా నిర్వహించిన అన్ని స్థాయిల అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించారు. 

సైబరాబాద్‌ పరిధిలో..

మణికొండ :   సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో  ఎన్నికల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది. రాజేంద్రనగర్‌ సర్కిల్‌లోని ఐదు డివిజన్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియను సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌..  శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. గెలిచిన అభ్యర్థులు ఎలాంటి ర్యాలీలు చేపట్టేందుకు వీలు లేదని, 48 గంటల పాటు ఊరేగింపుల ను సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో నిషేధించామని సీపీ తెలిపారు. సోషల్‌ మీడియాలో అనవసర కామెంట్లను పో స్టు చేయవద్దన్నారు. ఎన్నికలకు సంబంధించి... రిటర్నింగ్‌ అధికారులు ధ్రువీకరించిన తర్వాతనే ప్రకటనలు చేసుకోవాలన్నారు. 7 వేల మంది పోలీసు సిబ్బందితో  బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు చేపట్టామన్నారు.  కార్యక్రమంలో ఏసీపీ భా స్కర్‌, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.


logo