శుక్రవారం 27 నవంబర్ 2020
Hyderabad - Oct 27, 2020 , 08:00:20

అవినీతిపై పెదవి విప్పరా!

అవినీతిపై పెదవి విప్పరా!

కంటోన్మెంట్‌ : ‘అవినీతి నిర్మూలనే లక్ష్యంగా పారదర్శకమైన పాలన అందిస్తామంటూ మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్న బోర్డు ఉన్నతాధికారులు కిందస్థాయిలో జరుగుతున్న అవినీతిపై మాత్రం పెదవి విప్పడం లేదు. మరోవైపు ఉన్నతాధికారులు నిత్యం  ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరించాలి అంటూ తరచూ ఆదేశాలు జారీచేస్తున్నా కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో అవి అమలుకు నోచుకోవడం లేదు. కొంతమంది మాజీ నేతల అండతో  కొందరు అధికారుల అక్రమాలు ఆగడం లేదు. ప్రధానంగా కంటోన్మెంట్‌ బోర్డులోని ఇంజినీరింగ్‌ విభాగం అధికారుల్లో మార్పు రావడం లేదు. 

యథేచ్ఛగా అక్రమాలు.. ఈ విభాగంలోని కొంతమంది ఉద్యోగులు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ‘మామూళ్లు’ తీసుకుని.. భవన నిర్మాణాలకు అనధికారికంగా పచ్చజెండా ఊపుతున్నారు. బోర్డు  పరిధిలో ఏ ప్రాంతంలో పునాది పడినా... ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు వెంటనే అక్కడ వాలిపోతున్నారు. నిర్మాణదారులకు సవాలక్ష ప్రశ్నలు వేసి.. చివరకు నిర్మాణ సామగ్రి, పనిముట్లను తమతో తీసుకెళ్లిపోతున్నారు. ఇదంతా అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు అధికారులు చేసే ప్రయత్నాలు అనుకుంటే తప్పులో కాలేసినట్లే. 

  బోర్డు ఆదాయానికి గండి.. పనులను అడ్డుకుంటే.. ఎలాగైనా నిర్మాణదారులు తమ కార్యాలయానికి వస్తారనే ఎత్తుగడలో భాగమే ఇదంతా. నిర్మాణదారులు బోర్డు  కార్యాలయానికి వెళితే... అక్కడ బేరసారాలు కుదుర్చుకుని నిర్మాణాలకు అనధికారికంగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేస్తున్నారు. దీంతో కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి.  బోర్డు ఆదాయానికి గండి పడుతోంది. సిబ్బంది జేబులు నిండుతున్నాయి. 

ప్రభుత్వ స్థలాలు, చెరువులను సైతం ఆక్రమణ..

అధికారుల అండతో భూ కబ్జాదారులు ప్రభుత్వ స్థలాలు, చెరువులను సైతం ఆక్రమించి.. అక్రమ కట్టడాలు సాగిస్తున్నారు. అనుమతి లేకుండా బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. అయినా అధికారులు.. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేస్తున్న దాఖలాలు లేవు. ఎప్పుడో... ఎవరో ఫిర్యాదు చేస్తేనే కదులుతున్నారు. ఇందులో భాగంగా గత వారం మారేడ్‌పల్లి, తిరుమలగిరి, బోయిన్‌పల్లి ప్రాంతాల్లోని పలువురు ఫిర్యాదు చేస్తేనే గురువారం అక్రమ కట్టడాల కూల్చివేత అంటూ పత్రికా ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. అయితే పలు ప్రాంతాల్లోని కాలనీల్లో సుమారు 50 వరకు బహుళ అంతస్తుల నిర్మాణాలు సాగుతున్నాయి. కానీ ఇవేవీ అధికారులకు కనిపించడంలేదంటే.. భవన నిర్మాణదారులతో లోపాయికారీ ఒప్పందాలే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

తూతూ మంత్రంగా కూల్చివేతలు.. 

బోర్డు  పరిధిలో 50కిపైగా అక్రమ కట్టడాలను అధికారులు ఇటీవల గుర్తించినట్లు తెలుస్తోంది.  ఆ భవనాలను కూల్చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం.  ఈ మేరకు అధికారులు ఒకటి, రెండు భవనాలు మొక్కుబడిగా కూలగొట్టారు. మిగిలినవి వదిలేశారు. ఈ వ్యవహారంలోనూ ఇంజినీరింగ్‌ విభాగంలో కొందరు.. అక్రమ నిర్మాణదారుల నుంచి భారీగానే వసూలు చేసినట్టు సమాచారం. ఈ విభాగంలో గతంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు అధికారులే మళ్లీ చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. పలువురు మాజీ బోర్డు ఉపాధ్యక్షుల  ఆశీస్సులతో అక్రమ నిర్మాణాలకు పచ్చజెండా ఊపుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. బహుళ అంతస్తులు నిర్మించే బిల్డర్లతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకొని ఇంజినీరింగ్‌ విభాగం నుంచి అనధికారికంగా అనుమతులు ఇచ్చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

రూ.లక్ష  నుంచి రూ.5లక్షల వరకు.. 

ఎక్కడైనా ప్రభుత్వ స్థలంలో ఇంటి నిర్మాణం జరిగితే.. అక్కడకు వెళ్లి, భవనం స్థాయి, అంచనా వ్యయం బట్టి రూ.లక్ష  నుంచి రూ.5లక్షల వరకు దండుకొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బహుళ అంతస్తుల భవనాలకు అనుమతి లేకపోతే లక్ష నుంచి రెండు లక్షలు వరకు ముట్టజెప్పాల్సిందే. అధికారి వసూలు చేసిన ఈ మొత్తంలో సదరు నేతలకు వాటాలు ఇస్తున్నట్టు తెలిసింది. ఇటీవల బోర్డు  పరిధిలోని అక్రమ నిర్మాణదారుల నుంచి కోట్లాది రూపాయలు పోగేసుకున్నట్లు ఉన్నతస్థాయి అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఇప్పటికైనా అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై సీబీఐతోవిచారణ జరిపించి బాధ్యులపై చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం

కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ నిరంతరం చేపడతాం. ఇంజినీరింగ్‌ విభాగంలో అవినీతికి ఆస్కారం లేదు. ఒకవేళ అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా అనుమతులు లేకుండా ఉన్న భవనాలను కూల్చివేయడం జరుగుతుంది. ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు.  ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు అవినీతికి పాల్పడినట్లు రుజువైతే కఠిన చర్యలకు వెనుకాడం.  - బి.అజిత్‌రెడ్డి, సీఈవో, కంటోన్మెంట్‌ బోర్డు