శనివారం 31 అక్టోబర్ 2020
Hyderabad - Sep 30, 2020 , 07:07:42

సమస్యలను పరిష్కరించండి మంత్రి కేటీఆర్‌ను కోరిన కార్పొరేటర్లు

సమస్యలను పరిష్కరించండి మంత్రి కేటీఆర్‌ను కోరిన కార్పొరేటర్లు

అబిడ్స్‌, సెప్టెంబర్‌ 29 : బలరాంగల్లిలో శిథిలావస్థకు చేరుకున్న భవనాన్ని కూల్చివేసి ఆ స్థలంలో 50 పడకల దవాఖానను ఏర్పాటు చేయాలని మంగళ్‌హాట్‌ కార్పొరేటర్‌ పరమేశ్వరీసింగ్‌ మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును కోరారు. మినిస్టర్‌ క్వార్టర్స్‌లో జరిగిన సమావేశంలో ఆమె మంత్రి కేటీఆర్‌ను కలిసి డివిజన్‌లో పలు అభివృద్ధి పనులను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ మాట్లాడుతూ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములున్నాయని, వాటిలో కుల సంఘాలు, కమ్యూనిటీ హాల్‌ నిర్మించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పనులను పరిష్కరించాలని కోరారు. ఇందిరానగర్‌, గంగాబౌలి, శివలాల్‌నగర్‌, మల్లన్న గుట్ట ప్రాంతాల్లో రెగ్యులరైజేషన్‌ జీవో 58,59 ద్వారా జరిగేలా చూడాలని కోరారు.  ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు మొక్కను బహూకరించారు. 

కార్వాన్‌:   డివిజన్‌లోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ గుడిమల్కాపూర్‌ కార్పొరేటర్‌ బంగారి ప్రకాశ్‌ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. గ్రేటర్‌ కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్‌ నిర్వహించిన సమావేశంలో భాగంగా కార్పొరేటర్‌  ప్రకాశ్‌  హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన డివిజన్‌లోని ప్రజా సమస్యలను తెలుపుతూ వినతి పత్రం అందజేశామని తెలిపారు.  కార్వాన్‌, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లోని దేవాలయ భూముల్లో ఎన్నో ఏండ్లుగా నివాసం ఉంటున్న వారి సమస్యలు పరిష్కారం చేయాల్సిందింగా, నోటరీతో పొందిన భూములను కూడా క్రమబద్ధీకరించాలని కోరినట్లు ఆయన తెలిపారు.