సోమవారం 26 అక్టోబర్ 2020
Hyderabad - Jun 22, 2020 , 00:04:51

యువత.. తస్మాత్‌ జాగ్రత్త

యువత.. తస్మాత్‌ జాగ్రత్త

కరోనా దూకుడు పెంచింది. యువత ఇష్టారాజ్యంగా రోడ్లపై సంచరిస్తుండటంతో అదే స్థాయిలో కరోనా సైతం విస్తరిస్తున్నది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో యువతనే ముందు వరుసలో ఉండడమే ఇందుకు నిదర్శనం. ఇందులో మొదటి స్థానంలో 26 నుంచి 30 ఏండ్ల వయస్సు వారు ఉండగా, రెండో స్థానంలో 31-35 ఏండ్ల వయస్సువారు ఉన్నారు. మూడో స్థానంలో 36 నుంచి 40, నాల్గో స్థానంలో 21 నుంచి 25 ఏండ్ల వయసువారు ఉండడం గమనార్హం. అయితే యువత దూకుడు వల్లనే వైరస్‌ విస్తరించడంతో పాటు కుటుంబ సభ్యులకు సోకుందని పలువురు వైద్యనిపుణులు తెలుపుతున్నారు. కరోనా కోరలు చాస్తున్న నేపథ్యంలో యువత మేల్కొని ప్రభుత్వ నిబంధనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. 

అంబర్‌పేటలో ఒక్కరోజే 66 మందికి

అంబర్‌పేట : అంబర్‌పేటలో ఆదివారం ఒక్కరోజే 66 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా మొత్తం 370కి చేరాయి. ఇందులో 30 ఏండ్ల లోపు వారే అధికంగా ఉన్నారు. అంబర్‌పేట డివిజన్‌లోని ప్రేంనగర్‌, పటేల్‌నగర్‌, సీపీఎల్‌ క్వార్టర్స్‌, దుర్గానగర్‌, న్యూపటేల్‌నగర్‌, న్యూప్రేంనగర్‌, బాపూనగర్‌, రఘునాథ్‌నగర్‌ తదితర ప్రాంతాలకు చెందిన 31 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. గోల్నాక డివిజన్‌లోని తిరుమలనగర్‌, తులసీనగర్‌, గోవిందునగర్‌కు చెందిన ఐదుగురికి, నల్లకుంట డివిజన్‌లోని శివంరోడ్డు, న్యూనల్లకుంట, బాయమ్మగల్లీ, చారీలేన్‌లలో 9 మందికి, బాగ్‌అంబర్‌పేట డివిజన్‌లోని తురాబ్‌నగర్‌, కుమ్మర్‌వాడి, బతుకమ్మకుంట ప్రాంతాలకు చెందిన 19 మందికి, కాచిగూడ డివిజన్‌లోని నింబోలిఅడ్డా, నెహ్రూనగర్‌లకు చెందిన ఇద్దరికి కరోనా సోకింది. 

ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌ డివిజన్‌లో 58మందికి .. 26 మంది పోలీసులకు

మెహిదీపట్నం/కార్వాన్‌ : ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌ డివిజన్‌లో 55మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. లంగర్‌హౌస్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 15 కేసులు నమోదు కాగా అందులో ఇద్దరు పోలీసు సిబ్బందికి, ఆసిఫ్‌నగర్‌లో తొమ్మిది కేసులు నమోదు కాగా ముగ్గురు పోలీసులకు, గోల్కొండలో 12 కేసులు నమోదు కాగా నలుగురు పోలీసు సిబ్బందికి, టప్పాచబుత్ర పోలీస్‌స్టేషన్‌లోని ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఓ ఎస్సైకి, 13మంది కానిస్టేబుళ్లకు, హుమాయూన్‌నగర్‌లో ఆరుగురు పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో పాటు స్పెషల్‌ బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. 

బంజారాహిల్స్‌లో 31 మందికి

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒక్కరోజే 31మందికి పాజిటివ్‌ వచ్చింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.12లోని ఎన్‌బీటీనగర్‌లో ఒకే కుటుంబంలోని నలుగురికి, ఫిలింనగర్‌లో కానిస్టేబుల్‌తో సహా కుటుంబంలోని ఐదుగురికి, బంజారాహిల్స్‌ రోడ్‌ నం12లోని ఎమ్మెల్యే కాలనీలో కస్టమ్స్‌ ఉన్నతాధికారికి, బంజారాహిల్స్‌ రోడ్‌ నం12లో ముగ్గురు వ్యాపారులతో సహా మరో ఐదుగురికి, ఫిలింనగర్‌ రోడ్‌ నం.7లో నలుగురికి కరోనా సోకింది. 

సుల్తాన్‌బజార్‌, గౌలిగూడలో 19 మందికి

సుల్తాన్‌బజార్‌ : సుల్తాన్‌బజార్‌ పరిధిలో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు బొగ్గులకుంట పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ దీప్తి పేర్కొన్నారు. ఇసామియాబజార్‌ యూపీహెచ్‌సీ పరిధిలో పది మందికి పాజిటివ్‌ వచ్చినట్లు ఇసామియా బజార్‌ పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ చందన పేర్కొన్నారు. పీహెచ్‌సీలో ఇద్దరు ఆశవర్కర్లకు పాజిటివ్‌ రావడంతో  పీహెచ్‌సీలోని ఏఎన్‌ఎంలతో పాటు ఆశవర్కర్లకు కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు. కాగా గౌలిగూడలో ముగ్గురికి, కందస్వామిలేన్‌లో ఇద్దరికి, గుజరాతిగల్లీలో ఇద్దరికి, కోఠిలో ఒకరికి కరోనా సోకింది.

ఎల్బీనగర్‌లో 17 మందికి.. ముగ్గురు వైద్యులకు

ఎల్బీనగర్‌ : హయత్‌నగర్‌ సర్కిల్‌ నాగోలు డివిజన్‌ లక్ష్మీనర్సింహాస్వామి కాలనీలో ఉంటున్న ఉస్మానియాలో స్టాఫ్‌ నర్సుకి(49), మన్సూరాబాద్‌ జనప్రియకాలనీలో వ్యక్తికి(49), రాక్‌టౌన్‌లోని జేకే అడ్మిన్‌ అపార్ట్‌మెంట్‌లో ఉస్మానియా డాక్టర్‌కు (35), సౌత్‌ ఎండ్‌ పార్కు కాలనీకి చెందిన డబిల్‌పురా పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌కు(50), ఎన్జీఓస్‌ కాలనీలో విద్యార్థికి(20), మన్సూరాబాద్‌  సాయి నెస్ట్‌ అపార్ట్‌మెంట్‌లో రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి (75), మన్సూరాబాద్‌ రాజరాజేశ్వరీనగర్‌లో వృద్ధురాలికి(71) కరోనా సోకింది. సరూర్‌నగర్‌ సర్కిల్‌లోని ఏవీఎస్‌ఆర్‌ బృందావన్‌ ఆపార్ట్‌మెంట్‌లోని మహిళకు(40), కొత్తపేట విజయపురి రెసిడెన్సీలో వ్యక్తికి(39), మహిళకు (36), సరస్వతీనగర్‌లో యువకుడికి(35), కొత్తపేట సౌదామిని అపార్ట్‌మెంట్‌లో వ్యక్తికి (53), పీఅండ్‌టీ కాలనీ ప్రియాంజలి అపార్ట్‌మెంట్‌లో వృద్ధుడికి(67), మారుతీనగర్‌లో వ్యక్తికి(42), సరూర్‌నగర్‌లో వ్యక్తికి(44), తిరుమలహిల్స్‌లో వ్యక్తికి(47), దిల్‌సుఖ్‌నగర్‌లో  వృద్ధుడికి(57) పాజిటివ్‌ వచ్చింది. 

యూసుఫ్‌గూడలో 18 మందికి 

వెంగళరావునగర్‌: జీహెచ్‌ఎంసీ యూసుఫ్‌గూడ సర్కిల్‌-19 పరిధిలో 18 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఉప కమిషనర్‌ రమేశ్‌ తెలిపారు. ఎర్రగడ్డ బస్తీలో వ్యక్తికి(37), మహిళలకు(20), బాబానగర్‌లో మహిళకు(30), ప్రేమ్‌నగర్‌లోని వ్యక్తికి (36), యూసుఫ్‌గూడ బస్తీలో ఇద్దరికి, లక్ష్మీ నర్సింహానగర్‌లో వ్యక్తికి(38), కృష్ణానగర్‌లో విద్యార్థికి(15), శ్రీకృష్ణానగర్‌లో విద్యార్థినికి(11), బోరబండలో ఇద్దరికి, స్వరాజ్‌ నగర్‌లో వ్యక్తికి(45), రాజ్‌ నగర్‌లోని వ్యక్తికి (32), సాయిబాబానగర్‌ బస్తీలో మహిళకు (46), రహ్మత్‌ నగర్‌బస్తీలో  ఇద్దరు మహిళలకు, వినాయకనగర్‌ బస్తీలో వృద్ధుడికి (66),  జవహర్‌నగర్‌ బస్తీలో వ్యక్తికి (50) కరోనా సోకినట్లు డీఎంసీ వివరించారు. 

జియాగూడలో 17 మందికి పాజిటివ్‌, ఒకరు, మృతి

జియాగూడ : జియాగూడ డివిజన్‌ పరిధిలోని ఇందిరానగర్‌, వెంకటేశ్వరనగర్‌, దుర్గానగర్‌, సబ్జిమండి ప్రాంతాలకు చెందిన 17 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో కుల్సుంపురా పోలీసుస్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లకు పాజిటివ్‌ వచ్చింది. బంజావాడి ప్రాంతానికి చెందిన మహిళ కరోనాతో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది.  

కుత్బుల్లాపూర్‌లో ఎనిమిది మందికి..

 • దుండిగల్‌ : కుత్బుల్లాపూర్‌లో ఒక్కరోజే ఎనిమిది మందికి పాజిటివ్‌ రావడంతో మొత్తం కేసుల సంఖ్య 126కి చేరుకుంది. జగద్గిరిగుట్టలో యువకుడికి(25), చింతల్‌ ఇంద్రసింగ్‌నగర్‌లో వృద్ధుడికి(65), జీడిమెట్ల డివిజన్‌ రుక్మిణీఎస్టేట్‌లో మహిళకు(45), జీడిమెట్లలో వ్యక్తికి(48), షాపూర్‌నగర్‌లో వృద్ధురాలికి(60), రాజీవ్‌గాంధీనగర్‌లో మహిళకు(36), వృద్ధుడికి(88), సూరారంలో యువకుడికి(28) పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి తెలిపారు.
 • మన్సూరాబాద్‌ : నాగోల్‌, మన్సూరాబాద్‌ డివిజన్‌ పరిధిలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. సౌత్‌ఎండ్‌ పార్కుకాలనీలో నివాసముంటూ డబీల్‌పురా యూపీహెచ్‌సీలో పనిచేస్తున్న మెడికల్‌ ఆఫీసర్‌కు(50), లక్ష్మీనగర్‌కాలనీ, సాయినెస్ట్‌అపార్ట్‌మెంట్‌లో రిటైర్డ్‌ ప్రభుత్వ టీచర్‌కు(75), రాక్‌టౌన్‌కాలనీ రోడ్డు నం.3లో జేకే అపార్ట్‌మెంట్‌లో నివాసముంటూ ఉస్మానియా దవాఖానలో ప్లాస్టిక్‌ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్‌కు(35), జనప్రియకాలనీకి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి(49), మన్సూరాబాద్‌లో వ్యక్తికి(44), రాజరాజేశ్వరికాలనీలో వృద్ధురాలికి(70) కరోనా పాజిటివ్‌గా తేలింది. 
 • బషీర్‌బాగ్‌ : ముషీరాబాద్‌లో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ముషీరాబాద్‌ డివిజన్‌ మోహన్‌నగర్‌లో భార్యాభర్తలకు, ముషీరాబాద్‌లో విద్యార్థికి(27), ముషీరాబాద్‌ దళిత జాతీయ సంఘం ప్రాంతానికి చెందిన మహిళకు (35), ఇందిరానగర్‌లో వ్యక్తికి (35)కి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు భోలక్‌పూర్‌ యూపీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ కృష్ణమోహన్‌ తెలిపారు. 
 • బాలానగర్‌ : ఓల్డ్‌బోయిన్‌పల్లి మల్లికార్జుననగర్‌లో ఇద్దరు యువకులకు, న్యూ అల్లాపూర్‌లో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఉమ్మడి బాలానగర్‌ మండల వైద్యాధికారి డాక్టర్‌ చందర్‌ తెలిపారు. 
 • బోడుప్పల్‌: బాలాజీహిల్స్‌కాలనీకి చెందిన ఓ వ్యక్తికి(53), మల్లికార్జున్‌నగర్‌కాలనీలో యువకుడికి(25), కేశవ్‌నగర్‌లో వ్యక్తికి(36) పాజిటివ్‌ వచ్చింది.
 • ఘట్‌కేసర్‌: పోచారం మున్సిపాలిటి శివాజీనగర్‌లో యువకుడికి, ఘట్‌కేసర్‌ మండలంలోని వెంకటాద్రి టౌన్‌షిప్‌లో మహిళకు, మాదారం గ్రామంలో యువకుడికి పాజిటివ్‌ వచ్చింది. 
 • రామంతాపూర్‌ : కరోనా సోకడంతో రామంతాపూర్‌ వెంకట్‌రెడ్డినగర్‌కు చెందిన ఓవ్యక్తి మృతి చెందారు. అంతేకాక గణేశ్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి, మరో యువకుడు, వివేక్‌నగర్‌కు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.
 • కార్వాన్‌ : కార్వాన్‌ పన్నీపురా ప్రాంతీయ వైద్యాధికారిణి(ఎస్‌పీహెచ్‌ఓ)తో పాటు ఆమె కూతురుకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. 
 • మేడిపల్లి: బషీర్‌బాగ్‌లో ఉమెన్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తూ  పీర్జాదిగూడలోని ఓం విహార్‌కాలనీలో నివాసముంటున్న ఎస్సైకి(52) కరోనా పాజిటివ్‌ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. 
 • తెలుగుయూనివర్సిటీ : నిలోఫర్‌ దవాఖానలో కరోనా అనుమానిత లక్షణాలతో చికిత్స పొందుతున్న ఇద్దరు గర్భిణులకు ఆదివారం పాజిటివ్‌ వచ్చినట్లు దవాఖాన కో ఆర్డినేటర్‌ చంద్రమోహన్‌ తెలిపారు. నిలోఫర్‌ ఐసోలేషన్‌ వార్డులో ఉన్న మిర్యాలగూడకు చెందిన గర్భిణి (24), నగరంలోని మల్కాజిగిరికి చెందిన మరో గర్భిణి (35)లకు పాజిటివ్‌ రావడంతో వారిని గాంధీ దవాఖానకు చికిత్స నిమిత్తం తరలించినట్లు తెలిపారు.
 • అడ్డగుట్ట: అడ్డగుట్ట సీ సెక్షన్‌ ప్రాంతానికి చెందిన యువతికి(17) కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారం రోజుల కిందట యువతి తల్లికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.
 • శామీర్‌పేట: తూంకుంట మున్సిపాలిటీలో రెండవ కేసు నమోదయ్యింది. తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో నివసించే మహిళలకు(38) పాజిటివ్‌ వచ్చింది. 

మాజీ రాజ్యసభ సభ్యుడికి పాజిటివ్‌

అంబర్‌పేట : ఓ మాజీ రాజ్యసభ సభ్యుడు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయనకు శనివారం పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సైతం పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం వారంతా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అయితే ఇటీవల ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అదే రోజు నుంచి జ్వరంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. 


logo