సోమవారం 06 జూలై 2020
Hyderabad - Jun 03, 2020 , 01:37:02

పంజా విసురుతున్న కరోనా

పంజా విసురుతున్న కరోనా

 నగరంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 70 కేసులు నమోదయ్యాయి. ఉస్మానియా మెడికల్‌ కళాశాల పరిధిలో వివిధ విభాగాలకు చెందిన 15మంది పీజీ వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.నల్లకుంట ఫీవర్‌ దవాఖానలో 27 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఇందులో 16 కేసులు కేవలం అంబర్‌పేట పోలీస్‌ లైన్‌ నుంచే వచ్చాయి. అదేవిధంగా భోలక్‌పూర్‌ పరిధిలోని పద్మశాలి కాలనీకి చెందిన 82 ఏండ్ల వృద్ధుడు కరోనాతో గాంధీలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

  • సుల్తాన్‌బజార్‌: ఉస్మానియా మెడికల్‌ కళాశాల పరిధిలోని వివిధ విభాగాలకు చెందిన 15 మంది పీజీ వైద్య విద్యార్థులకు మంగళవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇందులో 10మంది డే స్కాలర్‌ పీజీ వైద్య విద్యార్థులు కాగా, ఒకరు ఉస్మానియా వైద్య కళాశాల హాస్టల్‌ విద్యార్థిని. వీరితో పాటు ప్లేట్ల బుర్జు ప్రసూతి దవాఖానకు చెందిన నలుగురు పీజీ వైద్య విద్యార్థినులు సైతం ఉన్నారు. 
  • దుండిగల్‌: గాజులరామారం సర్కిల్‌ పరిధిలోని సుభాష్‌చంద్రబోస్‌నగర్‌కు చెందిన 66 ఏండ్ల ఓ వృద్ధురాలుకు, చింతల్‌వాణీనగర్‌కు చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. అలాగే జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని  శివనగర్‌లోని ఓ ఇంట్లో తల్లీకొడుక్కి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారిని చికిత్స నిమిత్తం మంగళవారం గాంధీ దవాఖానకు తరలించారు.
  • గౌతంనగర్‌: రామాంజనేయనగర్‌లోని ఓ గృహిణికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఆమెను చికిత్స నిమిత్తం గాంధీకి తరలించారు. కుటుంబ సభ్యులను అధికారులు హోంక్వారంటైన్‌ చేశారు.  
  • అంబర్‌పేట: అంబర్‌పేటలో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒకరు ఇంజినీరింగ్‌ విద్యార్థి కాగా, తురాబ్‌         నగర్‌,చెన్నారెడ్డినగర్‌లో కిరాణా దుకాణాల నిర్వాహకులు ఇద్దరికి కరోనా సోకింది. వీరిని చికిత్స నిమిత్తం గాంధీకి తరలించారు. 
  • నల్లకుంటలోని ఫీవర్‌ దవాఖానలో 27 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఇందులో 11 నగరంలోని పలు ప్రాంతాల నుంచి రాగా, 16 కేసులు కేవలం అంబర్‌పేట పోలీస్‌ లైన్‌ నుంచే వచ్చాయి. వీరందరికీ డాక్టర్లు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
  • శంషాబాద్‌ : పట్టణ పరిధిలోని రాళ్లగూడ పరిధిలో రాజస్థాన్‌కు చెందిన ఓ యువకుడు కరోనా లక్షణాలు ఉండడంతో హోం క్వారంటైన్‌ చేశారు.  
  • బషీర్‌బాగ్‌: భోలక్‌పూర్‌ డివిజన్‌లోని పద్మశాలికాలనీకి చెందిన  82ఏండ్ల వృద్ధుడు  కరోనాతో గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.  
  • నేరేడ్‌మెట్‌ : ఓల్డ్‌సఫిల్‌గూడకు  చెందిన ఓ వ్యక్తి అఫ్జల్‌గంజ్‌లో ప్రైవేట్‌  ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి జ్వరం రావడంతో వైద్య పరీక్షలు చేయగా కరోనా పాటిజివ్‌ అని తేలింది. దీంతో అతడిని గాంధీ దవాఖానకు తరలించారు. అధికారులు అతడి కుటుంబ సభ్యుల రక్త నమూనాలు సేకరించారు.


logo