e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home హైదరాబాద్‌ అలసత్వంతోనే కరోనా అలజడి

అలసత్వంతోనే కరోనా అలజడి

అలసత్వంతోనే కరోనా అలజడి
  • చేజేతులా వైరస్‌ విస్తరణకు ఆజ్యం పోస్తున్న వైనం
  • వారం రోజుల్లో 2,992 కరోనా కేసులు నమోదు
  • మూడు నెలలతో పోలిస్తే ఆరేడు రెట్లు పెరుగుదల
  • మాస్క్‌, భౌతికదూరం విస్మరణతోనే ముప్పు

మాస్క్‌ పెట్టుకోమన్నందుకు ముగ్గురు యువకులు మూకుమ్మడిగా దాడిచేశారు. రెండురోజుల కిందట మలక్‌పేట ప్రాంతంలో ఓ యువకుడు తనతండ్రికి వ్యాక్సిన్‌ వేయించేందుకు రాగా ఈ ఘటన జరిగింది. దుకాణం వద్ద ఎడం పాటించడం లేదన్నందుకు వినియోగదారుడితో వ్యాపారి వాగ్వాదం.

కరోనా అలజడి వేళ జనం నిర్లక్ష్యం వీడడం లేదు. మాకు రాదులే..నాకేం కాదులేనన్న అతివిశ్వాసం తనతోపాటు ఇతరులకు ప్రాణసంకటంగా మారుతున్నది. మాస్క్‌ లేకుండా జనసమర్థ ప్రాంతాల్లో యథేచ్ఛగా తిరుగుతున్నారు. భౌతికదూరం గురించి పట్టింపే లేదు. కరోనా రెండోదశ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసినా చాలామంది పెడచెవిన పెడుతున్నారు. ఇందుకు గ్రేటర్‌ వ్యాప్తంగా పెరుగుతున్న కేసులే నిదర్శనం. కేవలం వారం రోజుల్లోనే 2992 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం, వైద్య నిపుణులు అనేక జాగ్రత్తలు చెబుతున్నా పట్టించుకోకపోవడం వల్లే చివరకు జరిమానాలు విధించే పరిస్థితి వచ్చింది. మాస్క్‌ లేకుండా తిరుగుతున్న వారిపై పోలీసులు మంగళవారం ఒక్కరోజే 3614 ఈ-పెట్టీ కేసులు నమోదు చేశారు. పరిస్థితి చేజారకముందే అప్రమత్తంగా ఉండడం శ్రేయస్కరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

కరోనా వైరస్‌.. దానికి కాళ్లు లేవు, చేతులు లేవు. అంటే అది ఉన్న దగ్గరి నుంచి కదిలే ప్రసక్తే లేదు. మరి ఈ మహమ్మారి ఎలా విస్తరిస్తుంది?!.. చేజేతులా మన నిర్లక్ష్యమే దాన్ని సర్వంతర్యామిగా తయారు చేస్తున్నాం. ఇందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌లో రోజురోజుకీ పెరుగుతున్న కేసుల సంఖ్యనే ప్రత్యక్ష నిదర్శనం. గత నాలుగు నెలల్లో 6-12 తేదీల మధ్య రికార్డులను పరిశీలిస్తే… మూడు నెలల కిందటి కంటే ఈ నెల ఏకంగా ఆరేడు రెట్ల మేర కేసులు పెరిగాయి. పొరుగున ఉన్న మహారాష్ట్ర ఒక ప్రధాన కారణమైనప్పటికీ… ముప్పును గుర్తించిన వెంటనే అప్రమత్తం కావాల్సిన జనం.. కనీస నిబంధనల్ని సైతం తుంగలో తొక్కుతుండటంతో కరోనా వైరస్‌ మరింత రెచ్చిపోయేందుకు ఆజ్యం పోసినట్లవుతుంది. ఒకవైపు ప్రభుత్వం… వైద్య నిపుణులు… జాగ్రత్తలు చెబుతున్నా.. అనేక మంది పెడచెవిన పెడుతున్నారు. చివరకు పోలీసులు జరిమానాలు విధిస్తున్నా.. కొందరిలో మాత్రం మార్పు రాకపోవడమంటే ముప్పును ఆహ్వానించడం తప్ప.. మరొకటి కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిర్లక్ష్యం పెరిగేకొద్దీ గ్రేటర్‌లో కరోనా కేసుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. మొదటి వేవ్‌ తగ్గుముఖం పట్టిన తర్వాత… రెండో వేవ్‌ ఘంటికలు మోగిన ఆదిలోనే జనం మేల్కొంటే బాగుండేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం… అందునా భారీ సమూహాన్ని నిరోధించడమనేది అత్యంత కీలకాంశాలు. అయితే పొరుగున ఉన్న మహారాష్ట్రలో గత రెండు, మూడు నెలలుగా కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతున్న దరిమిలా.. ఇక్కడ ప్రభుత్వం, వైద్య నిపుణులు జనాన్ని అప్రమత్తం చేశారు. కనీస జాగ్రత్తలు పాటించాల్సిందిగా సూచించారు. కానీ చాలామంది వాటిని నిర్లక్ష్యం చేస్తుండటంతో వైరస్‌ వ్యాప్తి అనేది వేగంగా కొనసాగుతుంది. గత మూడు నెలల్లో కేసుల సంఖ్య కంటే ఈ నెల ఇప్పటికే నమోదైన కేసులు భారీగా ఉన్నాయి. రోజుకు 3-4 వందల మధ్య కేసులు నమోదవుతున్నా… ఇంకా చాలా మంది కనీస నిబంధనల్ని విస్మరిస్తున్నారు.

ఎవరికి వారు బాధ్యతగా…

మహమ్మారి పొంచి ఉన్నందున ఎవరికి వారు బాధ్యతగా వ్యవహరిస్తే కరోనా వ్యాప్తి కట్టడి సులువు. కానీ ఇదేదో ప్రభుత్వ కార్యం అన్నట్లుగా చాలామంది ఇప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బయట తిరుగుతున్న సమయంలోనూ కనీసం మాస్కు ధరించకుండా వైరస్‌ వాహకాలుగా మారుతున్నారని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరకు పోలీసులు రంగంలోకి దిగి… మాస్కు ధరించని వారికి జరిమానా విధించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు గ్రేటర్‌ పరిధిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ నెల 5 నుంచి 11 వరకు మొత్తం 3,214 కేసులు నమోదు కాగా , 12న 2,264 కేసులు, 13వ తేదీన 3,614 .. మొత్తం ఇప్పటివరకు 9,092 కేసులు నమోదు చేసి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు.

ఇక భౌతిక దూరాన్ని పాటించకుండా ఉంటున్న వారిపైనా పోలీసులు సీసీ కెమెరాల ద్వారా దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా పరిస్థితి చేజారిపోకముందే జనం అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎవరికి వారు కనీస నిబంధనలు పాటిస్తే పొంచి ఉన్న ముప్పును పారదోలవచ్చని సూచిస్తున్నారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలో పరిస్థితి చేజారిపోవడం వల్ల లాక్‌డౌన్‌ పెట్టాలని యోచించే దుస్థితి వచ్చిందని ఉదహరిస్తున్నారు.

నిబంధనలు గాలికి…

  • కొందరు కనీస నిబంధనల్ని విస్మరించడం వెనక ప్రధానంగా పలు అంశాలు ఉన్నట్లుగా వైద్య నిపుణులు చెబుతున్నారు.
  • వ్యాక్సిన్‌ వచ్చినందున ఇక వైరస్‌కు భయపడాల్సిన అవసరంలేదనే అపోహ కొంతమందిలో ఉంది. దీంతో టీకా వేసుకున్న తర్వాత మాస్కు ధరించకపోవడం, భౌతిక దూరాన్ని విస్మరిస్తూ పరోక్షంగా వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
  • మరికొందరు… ఇప్పటికే తమకు కరోనా వచ్చిపోయినందున, ఇక ఏం కాదులే అన్న నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కనీసం మాస్కు కూడా ధరించడం లేదు.
  • మరోవైపు గత ఏడాది మొదటి వేవ్‌లో శానిటైజేషన్‌పై అత్యంత శ్రద్ధ చూపిన వారు.. సెకండ్‌ వేవ్‌ సమయంలో మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రధానంగా సమూహాలు ఎక్కువగా ఉండే, ఎక్కువ మంది రాకపోకలు సాగించే వాణిజ్య ప్రాంతాలు, దుకాణాల్లో శానిటైజేషన్‌ అమలుపై నిర్లక్ష్యం వహిస్తున్నారు.
  • ఇక… 45 ఏండ్ల పైబడిన వారు చాలామంది ఇప్పటికీ వ్యాక్సినేషన్‌ చేయించుకోవడం లేదు. ఎలాగూ నడుస్తుంది కదా! అనే ధోరణితో వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటున్నారు. కానీ దీని వల్ల వైరస్‌ వ్యాప్తిని నిరోధించవచ్చనే విషయాన్ని మాత్రం విస్మరిస్తున్నారు.
Advertisement
అలసత్వంతోనే కరోనా అలజడి
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement