శనివారం 06 జూన్ 2020
Hyderabad - May 21, 2020 , 00:04:02

కరోనా వైద్యం పేరిట వృద్ధుడికి టోకరా

కరోనా వైద్యం పేరిట వృద్ధుడికి టోకరా

హైదరాబాద్ : అత్యవసర పరిస్థితుల్లో ఫస్ట్‌ ఎయిడ్‌ చికిత్సనందిస్తూ రోగులకు అండగా నిలవాల్సిన ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులు నిబంధనలను తుం గలో తొక్కుతున్నారు. వైద్యమోమహాప్రభో అంటూ ఆశ్రయించే రోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందినకాడికి దండుకుంటున్నారు. కరోనా లాంటి మహమ్మారి విజృంభిస్తున్న పరిస్థితుల్లోనూ ఆర్‌ఎంపీ వైద్యులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈకోవకు చెందిన ఓ సంఘటన శేరిలింగంపల్లి పాపిరెడ్డికాలనీలో తాజాగా వెలుగులోకొచ్చింది. ముం బై నుంచి 60ఏండ్ల వృద్ధుడు పాపిరెడ్డికాలనీలో నివసించే కొడుకుల వద్దకు 10 రోజుల కిందట  వచ్చాడు. 

అయితే వారంరోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతూ స్థానికంగా ఉండే  ఆర్‌ఎంపీ వైద్యుడిని సంప్రదించాడు. ఆ వైద్యు డు పరీక్షించి నాలుగైదు రోజులు దవాఖానకు తిప్పించుకుంటున్నాడు. ఇదే సమయంలో ఆశవర్కర్లు ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ముంబై నుంచి వచ్చిన వృద్ధుడి వివరాలను సేకరించి అతడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అతడికి కరోనా లక్షణాలు ఉండడంతో కొవిడ్‌ బృందానికి సమాచారం అందించి ప్రభుత్వాసుపత్రికి 3 రోజుల క్రితం తరలించారు. పరీక్షల అనంతరం మంగళవారం రాత్రి వృద్ధుడికి పాజిటివ్‌గా నిర్ధారణకావడంతో అసలు విషయం బయటపడింది. దీంతో వృద్ధుడికి వైద్యసేవలు అందించిన ఆర్‌ఎంపీ డాక్టర్‌ను క్లోజ్డ్‌ కాంటాక్ట్‌గా గుర్తించారు. అయితే ఆ ఆర్‌ఎంపీ పరారీలో ఉండడంతో అతడి కోసం కొవిడ్‌ బృందం గాలిస్తున్నది.  

ఆల్విన్‌కాలనీలో ఓ వ్యక్తికి...

కేపీహెచ్‌బీకాలనీ: ఆల్విన్‌కాలనీలో ఓ వృద్ధుడికి పాజిటివ్‌ వచ్చింది. ఉషాముళ్లపూడి మార్గంలోని శ్రీహరి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న అడ్వకేట్‌ పూర్ణచందర్‌రావు(75) కొద్దిరోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతూ.. ఓ ప్రైవే ట్‌ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. అయితే అతడికి కరోనా లక్షణాలు కనిపించడంతో కూకట్‌పల్లి సర్కిల్‌ అధికారులు దవాఖానకు తరలించగా పాజిటివ్‌ వచ్చింది. కరోనా సోకిన వ్యక్తి ఇంట్లో పనిచేసే పనిమనిషి, కారు డ్రైవర్‌ను పరీక్షల నిమిత్తం క్వారంటైన్‌కు తరలించినట్లు కూకట్‌పల్లి జడ్సీ మమత, డీసీ ప్రశాంతి, ఏఎంహెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

నటరాజ్‌నగర్‌లో వ్యాపారికి...

మెహిదీపట్నం: కార్వాన్‌ నియోజకవర్గం టప్పాచబుత్ర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నటరాజ్‌నగర్‌లో నివసించే వస్ర్తాల వ్యాపారికి  బుధవారం పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఛాతీ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. అతడి కుటుంబసభ్యులను హోంక్వారంటైన్‌లో ఉంచినట్లు చెప్పారు.

అలిజాపూర్‌లో 19మంది క్వారంటైన్‌...

మణికొండ : అలిజాపూర్‌కాలనీలో ఆరుగురికి కరోనా సోకినట్లు వైద్యాధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా బుధవారం అదేకాలనీలో ఒకే కుటుంబానికి చెందిన మరో 19మందిని క్వారంటైన్‌కు తరలించారు.

కార్వాన్‌లో ఎనిమిది మందికి పాజిటివ్‌

అబిడ్స్‌ : కార్వాన్‌ యూసుఫ్‌నగర్‌లో ఒకే ఇంట్లో ఉం టున్న ఎనిమిదిమందికి పాజిటివ్‌ వచ్చింది. పాతబస్తీ నయాపూల్‌ వద్ద ట్రావెల్స్‌ వ్యాపారం చేసే ఈ వ్యాపారి ఇటీవల మార్కెట్లు తిరగడం వల్ల కరోనా సోకిందని అధికారులకు తెలిపారు. దీంతో అతడి కుటుంబసభ్యులు ఎనిమిదిమందికి బుధవారం పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అలాగే గ్రేటర్‌లో బుధవారం 15 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  



logo