e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home హైదరాబాద్‌ జాగ్రత్తగా.. జనంలోకి..!

జాగ్రత్తగా.. జనంలోకి..!

జాగ్రత్తగా.. జనంలోకి..!

గ్రేటర్‌లో కరోనా పాటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వ్యాక్సిన్‌ వచ్చింది.. ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యంతో భౌతికదూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా, శానిటైజర్‌ వాడకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో వైరస్‌ మళ్లీ విస్తరిస్తున్నది. దగ్గరకు వస్తే.. దూరం చేస్తానని మహమ్మారి హెచ్చరిస్తున్నప్పటికీ ప్రజలకు ఏమాత్రం జంక్కూ.. బొంక్కూ.. లేకుండా పోయింది. నిబంధనలు గాలికి వదిలేసి.. యథేచ్ఛగా పార్టీలకు, ఫంక్షన్‌లకు గుంపులుగా హాజరవుతూనే ఉన్నారు. ఇలా ఒక్కరి నుంచి వస్తున్న వైరస్‌ ఇంటిళ్లిపాది విస్తరిస్తున్నది. కనీస నిబంధనలను నగరవాసులు ఎక్కడా పాటించకపోవడంతో మహమ్మారి కోరలుసాచుతూనే ఉన్నది. గడిచిన కొన్ని రోజులుగా వైరస్‌ ప్రబలుతున్న తీరే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ప్రజలంతా కండ్లు తెరిచి కానరాని మహమ్మారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ప్రతిఒక్కరూ టీకాలు వేయించుకోవాలని తెలుపుతున్నారు. కరోనా నియమాలు పాటించకపోవడంతోనే వైరస్‌ వ్యాప్తి చెందుతున్నదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి వ్యాప్తికి మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం, సామూహిక కార్యక్రమాలు నిర్వహించడమే ప్రధాన కారణమంటున్నారు వైద్యనిపుణులు. గత సంవత్సరం ఈ మూడు నియమాలతోనే కరోనాను అదుపులోకి తీసుకురాగలిగిన విషయం తెలిసిందే.
నిర్లక్ష్య ఫలితమే సెకండ్‌ వేవ్‌కు కారణం
లాక్‌డౌన్‌ ఎత్తివేత తరువాత నిబంధనలను ప్రజలు పూర్తిగా మరిచారు. కొందరి నిర్లక్ష్య ఫలితమే సెకండ్‌ వేవ్‌కు కారణంగా చెప్పవచ్చని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. టీకా తీసుకున్నాం కదా అనే ధీమా పనికిరాదని.. వారికి కూడా వైరస్‌ సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. టీకా సురక్షితమే అయినా అది వెంటనే పనిచేయదని, రెండవ డోస్‌ తీసుకున్న 28రోజుల తరువాతనే పూర్తిస్థాయి యాంటిబాడీలు ఉత్పన్నమవుతాయనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని వైద్యనిపుణులు తెలుపుతున్నారు. టీకా 60నుంచి 80శాతమే ప్రొటక్షన్‌ ఇస్తుందని ప్రముఖ ఫార్మకాలజి శాస్త్రవేత్త డాక్టర్‌ రఘురామ్‌రావు స్పష్టం చేశారు.
స్వీయ నిర్బంధం తప్పనిసరి
ఎవరికైన కరోనా లక్షణాలు ఉన్నా.., పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారణ జరిగినా వెంటనే వారు క్వారంటైన్‌లోకి వెళ్లిపోవాలని వైద్యనిపుణులు సూచించారు. ఆర్టీసీ బస్సులు, క్యాబులు, ఆటోలు వంటి పబ్లిక్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌ను ఆశ్రయించవద్దని తెలుపుతున్నారు.
టీకా వేసుకోవడం ఉత్తమం: వైద్యనిపుణులు
అర్హులైన వారందరూ టీకా వేసుకోవడమే ఉత్తమమని గాంధీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు, నిమ్స్‌ పల్మనాలజి విభాగాధిపతి డాక్టర్‌ పరంజ్యోతి, ఉస్మానియా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ సూచించారు. ప్రస్తుతం కరోనాకు సపోర్టింగ్‌ ట్రీట్‌మెంట్‌ మినహా ప్రత్యక్ష చికిత్స లేదని వారు స్పష్టం చేశారు. ప్రజలందరూ టీకా వేసుకోవాలని, లేనిపోని అపోహలకు గురికావదన్నారు.
కుత్బుల్లాపూర్‌లో 43 మందికి..
దుండిగల్‌, మార్చి 26 : కుత్బుల్లాపూర్‌లో 376 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 43మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు.
ఉప్పల్‌లో 19మందికి..
ఉప్పల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 103మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 19మందికి పాజిటివ్‌ వచ్చింది.
హఫీజ్‌పేట్‌లో 11 మందికి..
యూపీహెచ్‌సీ హఫీజ్‌పేట్‌లో 45 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11 మందికి పాజిటివ్‌ వచ్చిందని ఇన్‌చార్జి మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వినయ్‌బాబు తెలిపారు.
సొంతూర్లకు విద్యార్థులు
కొవిడ్‌-19 విస్తరణతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలను, హాస్టళ్లను తాత్కాలికంగా మూసివేయడంతో విద్యార్థులు సొంతూళ్ల బాటపట్టారు. ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపాలిటీల పరిధిలోని వందల హాస్టళ్లు ఖాళీ అయ్యాయి.
రైల్‌లో రాజస్థాన్‌ వెళ్లాలంటే ఆర్‌టీపీసీఆర్‌ తప్పనిసరి..
కరోనా వైరస్‌ మహమ్మారి మరోసారి తీవ్రమవుతున్న నేపథ్యంలో రాజస్థాన్‌ ప్రభుత్వం రైలులో ప్రయాణం చేసి తమ రాష్ట్ర పరిధిలోకి వచ్చే వారు కరోనాకు సంబంధించిన ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయించుకొని, నివేదికను వెంట తీసుకురావాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం గుజరాత్‌, పంజాబ్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, కేరళ రాష్ర్టాల నుంచి వచ్చే ప్రయాణికులు 72 గంటల లోపు చేయించుకున్న కరోనా నెగిటివ్‌ రిపోర్టును తమ వద్ద పెట్టుకొని ప్రయాణం చేయాలని ప్రయాణికులకు సూచించింది.
జీహెచ్‌ఎంసీలో పాక్షిక ఆంక్షలు
నగరంలో రోజురోజుకు పెరుగుతున్న కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చే సందర్శకులపై పాక్షిక ఆంక్షలు విధిస్తున్నట్లు శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. గడిచిన మూడు రోజులుగా జీహెచ్‌ఎంసీలోని పలు విభాగాల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది కచ్చితంగా కొవిడ్‌ నియమ, నిబంధనలు పాటించాలని, భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడం, హ్యాండ్‌వాస్‌ విధిగా చేయాలన్నారు.
‘మై-జీహెచ్‌ఎంసీ’ యాప్‌లో తెలపండి
జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి వచ్చే సందర్శకులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు సందర్శనపై కూడా ఈ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. ఏదైన ఫిర్యాదులు, విజ్ఞాపనలు ఉంటే ‘మై-జీహెచ్‌ఎంసీ’ యాప్‌ ద్వారా చేయాలని, లేదా సందర్శన సమయంలో కార్యాలయ భవనం ప్రవేశద్వారం వద్ద నున్న గ్రీవెన్స్‌ సెల్‌లో దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీలో జరిగే అధికారిక సమాచారాన్ని సీపీఆర్వో ద్వారా పత్రికా ప్రతినిధులకు అందజేస్తామన్నారు. ఈ పాక్షిక ఆంక్షలపై ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జాగ్రత్తగా.. జనంలోకి..!

ట్రెండింగ్‌

Advertisement