e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Home హైదరాబాద్‌ మహమ్మారి విజృంభిస్తున్నా మారని జనం

మహమ్మారి విజృంభిస్తున్నా మారని జనం

మహమ్మారి విజృంభిస్తున్నా మారని జనం
 • వైరస్‌ ముప్పు మళ్లీ అదే తప్పు
 • పట్టింపులేకుండా రహదారులపై సంచారం
 • ఆదమరిస్తే అసలుకే ప్రమాదమంటున్న వైద్యులు
 • విపత్తు వేళ మళ్లీ మళ్లీ అవే తప్పులు
 • మాస్క్‌లు లేవు.. భౌతికదూరం ముచ్చటే లేదు
 • ఆదివారం కిటకిటలాడిన ఫిష్‌, మాంసం మార్కెట్లు

అవే తప్పులు..అదే నిర్లక్ష్యం.. ప్రమాదం పొంచివుందని తెలిసినా మారని జనం.. ప్రభుత్వం, వైద్య నిపుణులు ఎంత చెబుతున్నా పెడచెవిన పెడుతుండడంతో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నాయి. కొందరు లక్షణాలు లేకుండా వైరస్‌ బారిన పడుతుండగా, మరికొందరు అస్వస్థతతో ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ఆదివారం కావడంతో ఫిష్‌, మాంసం మార్కెట్లు కిటకిటలాడగా, ఎక్కడా భౌతికదూరం కనిపించలేదు. గుంపులు గుంపులుగా ఇష్టానుసారం తిరిగారు.
అమ్మకందారులు మాస్క్‌లు లేకుండానే యథేచ్ఛగా విక్రయాలు జరిపారు. సమూహంలో ఒక్కరికి వైరస్‌ సోకినావేలాదిమందికి ప్రబలే ప్రమాదం ఉంది.

బాధ్యతగా ఉందాం..

కరోనా వైరస్‌ వ్యాప్తి వేగంగా ఉండడంతో ప్రతిఒక్కరూ బాధ్యతగా ఉండాలి. నాకేం కాదు..వైరస్‌ సోకదన్న నిర్లక్ష్యం వీడాలి. ఇంట్లో ఒక్కరికి సోకినా కుటుంబసభ్యులందరికీ త్వరగా వాపిస్తున్నది. స్వల్ప లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవడంతోపాటు ఇంట్లో ఉండడం శ్రేయస్కరం.
సిటీబ్యూరో, ఏప్రిల్‌ 18(నమస్తే తెలంగాణ): నిర్లక్ష్యం కొంప ముంచుతోంది. కొవిడ్‌ సెకెండ్‌ వేవ్‌ విజృంభిస్తున్నా.. కొంతమంది ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఓ వైపు ప్రభుత్వం, వైద్యాధికారులు జాగ్రత్తలు సూచిస్తున్నా.. పెడ చెవిన పెడుతున్నారు. ఫలితంగా కరోనా పాజిటివ్‌ కేసులు అధికమవుతున్నాయి. ఫిష్‌ మార్కెట్లు, వెజిటబుల్‌ మార్కెట్లలో జనం మాస్క్‌లు లేకుండానే తిరుగుతున్నారు. ఆదివారం ఫిష్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లలో జనం బారులు తీరి కనిపించారు. కనీస భౌతిక దూరం పాటించడం లేదు. అమ్మకందార్లు మాస్క్‌ ధరించకుండానే వ్యాపారం నిర్వహిస్తున్నారు. జరిమానాలు విధిస్తామన్న వారిలో భయం ఉండటం లేదు. అడుగడుగునా కరోనా నిబంధన ఉల్లంఘన జరుగుతోంది. అవసరం ఉంటేనే బయటకు రావాలన్న కనీస బాధ్యత ఉండటం లేదు. గుంపులు, గుంపులుగా వచ్చి వైరస్‌ ప్రబలడానికి కారణమవుతున్నారు. దీంతో ఒక్కరికి కరోనా ఉన్నా.. అది వేలాది మందికి ప్రబలే ప్రమాదం ఉంది. స్వీయ నియంత్రణ పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తే మున్ముందు మరింత బీభత్సకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఒక్కసారి ఆలోచించండి..

అడుగు బయటపెట్టే ముందు ఒక్కసారి ఆలోచించండి.. మీ కుటుంబ ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయనే విషయం మరిచిపోకండి. మీరు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కరోనా కబలించే ప్రమాదం ఉంది. ఏ వస్తువు.. ఏ మనిషి కరోనా వాహకాలుగా ఉన్నారో తెలియని భయానక పరిస్థితి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయినా, కొందరు మాస్క్‌లు లేకుండా బయటకు వస్తున్నారు. భౌతిక దూరం పాటించకుండా యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నారు. ప్రాణాంతకమైన మహమ్మారి విజృంభణతోనైనా జనాల్లో మార్పు రాకపోతే పరిస్థితి చేజారే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత సమయంలో నగరవాసులంతా బాధ్యతగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తలతోనే కరోనా సోకకుండా నిలువరించగలమని అధికారులు చెబుతున్నారు.

స్వీయ భద్రతే.. సామాజిక బాధ్యత

ప్రభుత్వం, వైద్యులు సూచించే నిబంధనలను కొందరు పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరోనా వాహకాలుగా మారుతున్నారు. గతేడాది ఇదే సమాయానికి లాక్‌డౌన్‌ రూపంలో ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతం, ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. కరోనా నియమాలు పాటిస్తే వైరస్‌ను జయించినట్లే. – జమీల్‌ అహ్మద్‌, వైద్యులు

భౌతిక దూరం మిథ్య..చేపల మార్కెట్‌లో కొవిడ్‌ నిబంధన ఉల్లంఘన

ముషీరాబాద్‌, ఏప్రిల్‌ 18: ఆదివారం వస్తే చాలు చేపల మార్కెట్లు, మాంసం దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఇందుకు నిదర్శనం ఆదివారం ముషీరాబాద్‌ చేపల మార్కెట్‌లో కనిపించిన భారీ జన సందోహమే. ముషీరాబాద్‌ చేపల మార్కెట్‌లో సాధారణ రోజుల్లో రద్దీ ఎలా ఉంటుందో.. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం అలాగే ఉంది. వేలాది మంది చేపల ప్రియులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మార్కెట్‌కు వచ్చి భౌతిక దూరం పాటించకుండా చేపల కొనుగోళ్లు చేశారు. కొంత మంది మాస్క్‌లు సైతం ధరించకపోగా, వ్యాపారులు సైతం కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.

బాధ్యతగా ఉందాం..!!

 • వ్యక్తికి వ్యక్తికి మధ్య కనీసం ఆరడుగుల దూరాన్ని పాటించాలి
 • ముఖానికి మాస్కు ధరించకుండా ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లకూడదు.
 • కళ్లను, నోరు, ముక్కును చేతితో తాకకూడదు.
 • సమూహాలుగా గుమిగూడటం మానుకోవాలి.
 • పలకరింపులు అవసరం లేదని గుర్తుంచుకోవాలి. భౌతిక స్పర్శతో కాకుండా దూరంగా నమస్కారం చేస్తే సరిపోతుంది.
 • అసత్య వార్తలను సామాజిక మాధ్యమాలలో పోస్టు చేయకూడదు.
 • కరోనా సమచారాన్ని విశ్వసనీయత కలిగిన వ్యక్తులు, సంస్థల నుంచి తెలుసుకోవాలి.
 • సందేహాలుంటే రాష్ట్ర హెల్ప్‌లైన్‌ 104కు ఫోన్‌ చేయాలి.
 • శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లేకుండా పరిశుభ్రత చర్యలు పాటించాలి.
 • చేతులను శానిటైజర్‌ లేదా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.
 • బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగకూడదు. ఉమ్మి వేయకూడదు.
 • తరచుగా తాకే ప్రదేశాలు, వస్తువులను డిస్‌ ఇన్ఫెక్ట్‌ చేయాలి.
 • అనవసర ప్రయాణాలు మానుకోవాలి.
 • అనారోగ్యంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
 • ఒత్తిడి, ఆత్రుతతో బాధపడేవారు నిపుణుల సలహా తీసుకోవాలి.
Advertisement
మహమ్మారి విజృంభిస్తున్నా మారని జనం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement