e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home హైదరాబాద్‌ కరోనా చికిత్సపై.. బాధితురాలికి అనుమానం..

కరోనా చికిత్సపై.. బాధితురాలికి అనుమానం..

  • రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌లు అమ్ముకున్నారని ఆరోపణ..
  • భర్త మృతికి దవాఖాన నిర్వాహకులే కారణమని ఫిర్యాదు..
  • సన్‌రైజ్‌ దవాఖాన ఇద్దరు వైద్యులు, డైరెక్టర్లపై కేసు

సిటీబ్యూరో, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ): ఓ ప్రైవేటు దవాఖాన అందించిన చికిత్సపై బాధితురాలు అనుమానం వ్యక్తం చేస్తూ చేసిన ఫిర్యాదుపై మీర్‌పేట్‌ పోలీసులు ఇద్దరు వైద్యులతో పాటు దవాఖాన నిర్వాహకులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన వివరాలు.. సరూర్‌నగర్‌ కొత్తపేట హూడా కాంప్లెక్స్‌ రమా అపార్ట్‌మెంట్‌కు చెందిన పొసం సైదులు గౌడ్‌ ఏప్రిల్‌ 26న కరోనాతో హస్తినాపురంలోని సన్‌రైజ్‌ దవాఖానలో చేరాడు. అయితే, దవాఖానలో చేరే సమయంలో యాజమాన్యం ఇన్సూరెన్స్‌ కార్డును అంగీకరించలేదు. దీంతో కుటుంబ సభ్యులు నగదును పెట్టి సైదులు గౌడ్‌ను చేర్పించారు. సైదులు గౌడ్‌కు అత్యవసర వైద్య సేవలు అందించాలని, రోజు వారీగా, దఫ దఫాలు. రూ. 4.80 లక్షలు దవాఖాన యాజమాన్యం తీసుకుంది. ఇది కాకుండా బ్లాక్‌లో ఆరు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను తెప్పించారు.

ఒక ఇంజక్షన్‌కు రూ.30 వేలు తీసుకున్నారు. ప్లాస్మా కోసం కూడా డబ్బులు తీసుకున్నారు. ఈ విధంగా చికిత్సను అందించిన వైద్యులు ఎప్పటికప్పుడు సైదులు గౌడ్‌ కోలుకుంటాడని భరోసాను ఇచ్చారు. చివరకు సైదులు మే 8న మృతి చెందాడు. అయితే, ఇన్సూరెన్స్‌ డబ్బు కోసం కేసు షీటును అడిగినప్పుడు దవాఖాన నిర్వాహకులు లక్ష రూపాయలు కడితేనే ఇస్తామని ఒత్తిడి తెచ్చారు. అడిగినంత డబ్బు ఇచ్చి కేసు షీటును తీసుకున్నారు. ఆ కేసు షీటుపై తెలిసిన పలువురు వైద్యుల అభిప్రాయాలను తీసుకున్నారు. సైదులు గౌడ్‌ కోసం తెచ్చిన ఆరు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లలో కేవలం మూడింటిని మాత్రమే వాడారని, మిగతా మూడింటిని అమ్ముకున్నారని గుర్తించారు. అదే విధంగా చికిత్సకు సంబంధించిన మందులను కూడా సరిగా వాడలేదని, వాడని మందులకు కూడా బిల్లు వేశారని తెలుసుకున్నారు.

- Advertisement -

సన్‌రైజ్‌ దవాఖాన వైద్యులు, నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే తన భర్త సైదులు గౌడ్‌ మృతి చెందాడని పేర్కొంటూ భార్య విజయలక్ష్మి గతనెల 30న మీర్‌పేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మీర్‌పేట్‌ పోలీసులు సన్‌రైజ్‌ దవాఖాన వైద్యులు పవన్‌కుమార్‌ రెడ్డి, రఘుదీప్‌, దవాఖాన ఇన్‌చార్జి సంజీవరెడ్డి, మేనేజర్‌ శ్రీధర్‌రెడ్డి, డైరెక్టర్లు వెంకటరామా ధని రెడ్డి, మనోహర్‌రెడ్డి, శిల్పా రెడ్డిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ ఫిర్యాదుపై సన్‌రైజ్‌ దవాఖాన నుంచి కేసు షీటును సేకరించిన పోలీసులు, వాటిని జిల్లా వైద్యాధికారికి పంపనున్నారు. బాధితుల ఆరోపణల నేపథ్యంలో చికిత్సకు సరైన మందులు వాడారా.. లేదా.. వంటి అంశాలపై రిపోర్టు ఇవ్వాలని మీర్‌పేట్‌ పోలీసులు కోరనున్నారు. ఆ రిపోర్టు ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని దర్యాప్తు అధికారి ఉదయ్‌ భాస్కర్‌ తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana