ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 11, 2020 , 00:44:27

కరోనా అని తేలగానే భయపడ్డా

కరోనా అని తేలగానే భయపడ్డా

గాంధీలో డాక్టర్లు బాగా చూసుకున్నారు 

కరోనాను జయించిన 

రామంతాపూర్‌ వాసి ప్రభాకర్‌ 

‘నా జీవితంలో ఇలాంటి రోగాన్ని ఎప్పుడూ చూడలేదు. నాకు పాజిటివ్‌ అని తేలిన రోజే పక్కనే ఉన్న కన్యకాపరమేశ్వరీ ఆలయంలో పని చేస్తున్న ఉద్యోగి చనిపోయిండు. కరోనా వచ్చిన వృద్ధులు చాలా మంది చనిపోతున్నారని న్యూస్‌ పేపర్లలో చదివిన. ఇక నా పని కూడా అంతే అనుకున్నా’ అని రామంతాపూర్‌ వెంకట్‌రెడ్డినగర్‌లో నివాసముంటున్న మహంకాళీ ప్రభాకర్‌ అన్నారు. 73 ఏండ్ల వయసులో కరోనాను జయించిన ఆయన ‘నమస్తే తెలంగాణ’కు తన అనుభవాలు వివరించారు. 

ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా.. 

రామంతాపూర్‌లోని సాయిబాబా గుడిలో చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నా. ప్రతిరోజు డ్యూటీ చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా. మాస్కు ధరించి ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసుకున్నా.  గురుపౌర్ణమి రోజు రోడ్డు మీదికి వచ్చి స్వామి నైవేద్యానికి పండ్లు తీసుకొని గుడికి పోయా. కుర్చీలో కూర్చొని అట్లనే పడిపోయా. గుడి పూజారులు చూసి పైకి లేపారు. రామంతాపూర్‌ ప్రభుత్వ హోమియో వైద్యశాలలకు తీసుకు వెళ్లి కరోనా టెస్ట్‌ చేయించారు. పాజిటివ్‌ వచ్చింది. వెంటనే గుడి చైర్మన్‌కు విషయం చెప్పి ప్రైవేట్‌ వైద్యశాలకు తీసుకుపోయారు. అక్కడ రెండు రోజులు ఉన్నా.. 

లక్ష రూపాయలు అవుతాయన్నారు..

నన్ను అడ్మిట్‌ చేసుకున్న ప్రైవేట్‌ వైద్యశాల సిబ్బంది లక్ష రూపాయల బిల్లు అవుతుందని చెప్పారు. వెంటనే నా కుమారుడు వచ్చి గాంధీకి తీసుకుపోయిండు. అక్కడ డాక్టర్లు పది రోజులు చికిత్స అందించారు. సమయానికి వేడి వేడి భోజనం, వేడినీళ్లు ఇచ్చారు. భరోసా కల్పించారు. నా కొడుకు, ఇద్దరు బిడ్డలు ఎంతో భయపడ్డారు. నాయిన మేం ఉన్నామని ధైర్యం చెప్పారు.10 రోజుల తర్వాత ఆరోగ్యం కుదుటపడింది. ఇక బతుకుతానని భరోసా వచ్చింది. నేను గాంధీ నుంచి డిశ్చార్జి కాగానే నా బిడ్డల ఆనందానికి అంతులేదు. 

ప్రతిరోజు డాక్టర్లు, దేవుడికి దండం పెట్టుకున్నా.. 

గాంధీకి పోతే ప్రాణం పోతదన్నారు. కానీ అక్కడ చేరినంక అర్థం అయ్యింది. బయట అందరు అనుకున్నట్లు ఏం లేదు. నాకు డాక్టర్లు మంచిగానే చికిత్స చేశారు. ప్రతి రోజు డాక్టర్లు, దేవుడికి దండం పెట్టా. పదిరోజుల తర్వాత తిరిగి పరీక్ష చేస్తే నెగెటివ్‌ వచ్చింది. వెంటనే ఇంటికి పంపారు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. మళ్లీ డ్యూటీకి పోతున్నా. నాకు కరోనా అని తేలగానే కొన్ని ప్రైవేట్‌ వైద్యశాల వారు ఫోన్లు చేసి మా వైద్యశాలలో చేరమని కోరారు. మంచి సౌకర్యాలు ఉన్నాయన్నారు. ఇది నమ్మి చేరినా రెండు రోజులకు మించి ఉండలేకపోయా. వెంటనే గాంధీలో చేరానని ప్రభాకర్‌ అన్నారు.


logo