శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Hyderabad - Jan 18, 2021 , 05:36:17

వారానికి 4 రోజులే.. కరోనా టీకా

వారానికి 4 రోజులే.. కరోనా టీకా

  • లబ్ధిదారులకు ఒకటి, రెండు రోజుల ముందే టైమ్‌స్లాట్‌ మెస్సేజ్‌
  • 10 నిమిషాలు ముందే కేంద్రానికి రావాలి
  • వైద్య, ఆరోగ్యశాఖ

ప్రాణాలకు భరోసాగా నిలిచిన కరోనా టీకా వారంలో నాలుగు రోజులు మాత్రమే ఇవ్వనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. మిగిలిన మూడు రోజుల్లో రెండు రోజులు రొటీన్‌ వ్యాక్సిన్‌లు అంటే చిన్నపిల్లలకు ఇచ్చే టీకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా సెలవు దినమైన ఆదివారంతో పాటు ఇతర పబ్లిక్‌ హాలిడేస్‌లలో కరోనా వ్యాక్సినేషన్‌ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. తొలిరోజు ఈనెల 16న (శనివారం) కరోనా టీకాను ప్రారంభించిన విషయం తెలిసిందే. సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో మాత్రమే వ్యాక్సినేషన్‌ ఇవ్వనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. బుధ, శని వారాల్లో రొటీన్‌ వ్యాక్సిన్‌లు అంటే చిన్నారులకు ఇచ్చే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆదివారంతో పాటు ఇతర సెలవు దినాల్లో ఎలాంటి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలు ఉండవన్నారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తమ ప్రణాళికను రూపొందించుకున్నట్లు తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌ డేస్‌లలోనే లబ్ధిదారుల సెల్‌ఫోన్‌లకు టైమ్‌ స్లాట్‌కు సంబంధించిన మెస్సేజ్‌లు పంపడం జరుగుతుందని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. మెసేజ్‌లో పేర్కొన్న తేదీన నిర్ణీత సమయానికి 10నిమిషాల ముందు మెసేజ్‌లో తెలిపిన టీకా కేంద్రానికి లబ్ధిదారులు రావాల్సి ఉంటుందని అధికారులు సూచించారు. లబ్ధిదారులు అయోమయానికి గురికావద్దని, షెడ్యూల్‌ ప్రకారం ఒకటి రెండు రోజుల ముందుగానే మెసేజ్‌లు పంపడం జరుగుతుందని మెసేజ్‌ వచ్చిన వారు మాత్రమే టీకా కేంద్రాలకు రావాలని స్పష్టం చేశారు. టీకా తీసుకున్న తరువాత ఏదైన సమస్యలు తలెత్తితే వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ఆశ్రయించాల్సిందిగా సూచించారు. టీకా తీసుకున్న 48గంటల తరువాత తలెత్తే అనారోగ్య సమస్యలకు టీకాతో సంబంధం దాదాపుగా ఉండబోదని వైద్యాధికారులు తెలిపారు.

టీకా కేంద్రాలు పెంపు

గ్రేటర్‌లో కరోనా టీకా కేంద్రాల సంఖ్యను క్రమంగా పెంచుతున్నారు. తొలిరోజు 33కేంద్రాల్లో మాత్రమే టీకా పంపిణీ చేసిన అధికారులు సోమవారం నుంచి ఆ సంఖ్యను 111కు పెంచుతూ గ్రేటర్‌ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఈ క్రమంలో సోమవారం నుంచి కొత్తగా మరో 78కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాకుండా లబ్ధిదారుల సంఖ్యను సైతం 30నుంచి 50కి పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. సోమవారం నుంచి ప్రతి కేంద్రంలో 50మందికి కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. గ్రేటర్‌ వ్యాప్తంగా మొత్తం 260కరోనా టీకా కేంద్రాలను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ప్రతి సెంటర్‌లో రోజుకు 100మందికి టీకా వేసే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే  టీకా కేంద్రాల సంఖ్యతో పాటు లబ్ధిదారుల సంఖ్యను కూడా క్రమంగా పెంచనున్నట్లు అధికారులు ఇదివరకే తెలిపారు. రెండవ విడతలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టీకా వేయనున్నారు. ఈ విడత నుంచి అన్ని కేంద్రాలను అందుబాటులోకి తేవడంతో పాటు లబ్ధిదారుల సంఖ్యను కూడా రోజుకు 100కు పెంచనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

  • హైదరాబాద్‌ పరిధిలో తొలిరోజు 33 కేంద్రాల్లో 30మందికి చొప్పున టీకా వేయగా సోమవారం నుంచి 42కేంద్రాల్లో 50మందికి చొప్పున వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. 
  • మేడ్చల్‌ జిల్లాలో 11కేంద్రాల్లో టీకా ప్రారంభమవ్వగా ఈ సంఖ్యను 20కి పెంచారు. ప్రతి కేంద్రంలో 50మందికి వ్యాక్సినేషన్‌ ఇవ్వనున్నారు. 
  • రంగారెడ్డి జిల్లా పరిధిలో 9కేంద్రాలుండగా సోమవారం నుంచి ఈ సంఖ్యను 16కు పెంచారు. ప్రతి సెంటర్‌లో 50మందికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు.

VIDEOS

logo