మంగళవారం 02 మార్చి 2021
Hyderabad - Jan 17, 2021 , 06:00:30

టీకా ఇచ్చి అభయం కల్పించి..

టీకా ఇచ్చి అభయం కల్పించి..

కరోనా టీకా రానే వచ్చింది. శనివారం నగరవ్యాప్తంగా అధికారులు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. తొలిరోజు గ్రేటర్‌ పరిధిలోని 33 కేంద్రాల్లో కరోనా టీకా పంపిణీ కార్యక్రమం సజావుగా సాగింది. గాంధీతో పాటు వివిధ కేంద్రాల్లో తొలి టీకాను పారిశుధ్య కార్మికులతో పాటు వైద్య సిబ్బందికి వేశారు. అయితే కరోనా టీకా తీసుకున్న సిబ్బందికి వైద్యాధికారులు ధైర్యం చెప్పారు. ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని అభయమిచ్చారు. 

సూరజ్‌భాన్‌ దవాఖానలో.. 

చార్మినార్ : శాలిబండలోని సూరజ్‌భాన్‌ బేలా ప్రసూతీ దవాఖానలో కరోనా వ్యాక్సినేషన్‌ను సూపరింటెండెంట్‌ ఉమాదేవి ప్రారంభించారు. మొదటి టీకాను  పారిశుధ్య సిబ్బందికి వేశారు. మొత్తం 72 మంది సిబ్బందికి టీకాను వేసి అరగంట సేపు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఎలాంటి దుష్పలితాలు తలెత్తకుండా అన్ని పరీక్షలు జరిపిన తర్వాతే టీకాను వేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని సూపరింటెండెంట్‌ ఉమాదేవి అన్నారు.  

నిర్భయంగా వేసుకోవచ్చు..

నేరేడ్‌మెట్ : కరోనా టీకా ఎంతో సురక్షితమైనదని.. నిర్భయంగా వేసుకోవచ్చని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. నేరేడ్‌మెట్‌ డివిజన్‌లోని ప్రాథమిక వైద్యశాలలో కరోనా టీకా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజల్లోని భయం పోగొట్టేందుకే తొలి టీకాను వైద్య సిబ్బంది తీసుకుంటున్నారన్నారు. ఇదిలో ఉంటే తొలి టీకా వైద్యురాలు రెడ్డి కుమారి వేసుకున్నారు.

పాల్‌దాస్‌ దవాఖానలో.. 

బేగంపేట,  : సనత్‌నగర్‌ నియోజకవర్గం రాంగోపాల్‌పేట డివిజన్‌లోని పాల్‌దాస్‌ వైద్యశాలలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను సికింద్రాబాద్‌ తహసీల్దార్‌ బాలశంకర్‌, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్‌ శ్రీకళ ప్రారంభించారు. మొదటి టీకాను బేగంపేట డివిజన్‌ శ్యాంలాల్‌ ప్రాంతానికి చెందిన ఆశ వర్కర్‌ పద్మకు అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ మెడికల్‌ ఆఫసర్‌ డాక్టర్‌ లక్ష్మీ టీకా వేశారు. 

వనస్థలిపురం ఏరియా దవాఖానలో.. 

 వనస్థలిపురం : వనస్థలిపురంలో ఏరియా దవాఖానలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ హరీశ్‌ ప్రారంభించారు. మొదటి వ్యాక్సిన్‌ను దవాఖానలో పని చేస్తున్న హెడ్‌ నర్సు మస్తాన్‌ బీకి ఇచ్చారు.  అనంతరం అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ను తీసుకోవాలన్నారు. 

ఎర్రగడ్డ ఛాతీ దవాఖానలో.. 

వెంగళరావునగర్‌, : ఎర్రగడ్డలోని ఛాతీ దవాఖానలో నిర్వహించిన కరోనా వ్యాక్సినేషన్‌ను జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ప్రారంభించారు. తొలి టీకాను ఛాతీ దవాఖాన సూపరింటెండెంట్‌ మహబూబ్‌ఖాన్‌ వేయించుకున్నారు. మొత్తం వైద్యశాలలో 520 మంది వైద్య సిబ్బంది ఉండగా తొలి రోజు 30 మందికి వేశారు. అనంతరం ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ కరోనా వ్యాప్తి సమయంలో ప్రాణాలకు తెగించి పోరాడిన ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు తొలి టీకా వేయడం శుభపరిణామమన్నారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన కరోనా టీకా ఎంతో సురక్షితమైందన్నారు.  

ఆమన్‌నగర్‌ యూపీహెచ్‌సీలో.. 

చార్మినార్‌,  : ఆమన్‌నగర్‌ యూపీహెచ్‌సీలో నిర్వహించిన కరోనా వ్యాక్సినేషన్‌ను యాకత్‌పుర ఎమ్మెల్యే సయ్యద్‌ అహమద్‌ పాషాఖాద్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అపోహలు లేకుండా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ పాల్గొనాలన్నారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలో పని చేసే సిబ్బందితో పాటు అంగన్‌వాడీ కార్యకర్తలు మొత్తం 72 మందికి టీకా వేశారు.

నార్సింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో.. 

 మణికొండ,  : రంగారెడ్డి జిల్లా నార్సింగి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కరోనా వ్యాక్సినేషన్‌ను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. దవాఖానలో పని చేస్తున్న ఏఎన్‌ఎం జయమ్మకు తొలి టీకా వేశారు. అంతేకాక మొత్తం 30 మంది ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ, ఆశ వర్కర్లకు టీకాలు వేసి అరగంట పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అనంతరం మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ, ఆశ, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారని గుర్తు చేశారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే టి. ప్రకాశ్‌గౌడ్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌, అడిషనల్‌ కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ డి.రేఖ, బండ్లగూడ కార్పొరేషన్‌ మేయర్‌ మహేందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

అనుమానం అవసరం లేదు.. 

 శామీర్‌పేట/కుత్బుల్లాపూర్‌, : కొవిడ్‌ వ్యాక్సిన్‌పై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట, సూరారం డివిజన్‌లోని షాపూర్‌ నగర్‌ పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కరోనా వ్యాక్సినేషన్‌ను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరికి వ్యాక్సిన్‌ అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వివేకానంద్‌, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, అడిషనల్‌ కలెక్టర్‌ రాజు పాల్గొన్నారు.  

నాంపల్లి ఏరియా దవాఖానలో.. 

 జియాగూడ, : నాంపల్లి ఏరియా ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌ మెరాజ్‌ హుస్సేన్‌ ప్రారంభించారు. దవాఖానలో సేవలందించే ఆరోగ్య సిబ్బంది, స్టాఫ్‌ నర్సులు, ఆశ వర్కర్లు, సెక్యూరిటీ సిబ్బందికి టీకాలు వేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు చెందాల్సిన అవసరం  లేదన్నారు.

కొండాపూర్‌,లో

 శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధి కొండాపూర్‌ జిల్లా దవాఖానలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దశరథ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలి రోజు 30 మందికి టీకా వేశారు. ఇదిలా ఉంటే సోమవారం నుంచి  మెడికోవర్‌, ఏఐజీ, కేర్‌, కాంటినెంటల్‌ దవాఖానల్లో వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానున్నది.   

బాలానగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో.. 

  బాలానగర్‌,  : వినాయకనగర్‌లోని బాలానగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. మొదటి టీకాను బాలానగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ వ్యాధి డిపార్ట్‌మెంట్‌లో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న మేకల మోహన్‌దాస్‌కు వేశారు. మరో 30 మంది సిబ్బందికీ టీకా వేశారు. అనంతరం ఎమ్మెల్యే మాధవరం మాట్లాడుతూ  అతి తక్కువ సమయంలో కరోనా నియంత్రణకు టీకా రావడం అభినందనీయమన్నారు.

ఉస్మానియా వైద్యశాలలో.. 

సుల్తాన్‌ బజార్ : ఉస్మానియాతో పాటు కింగ్‌కోఠి జిల్లా వైద్యశాల, కోఠి ఈఎన్‌టీ దవాఖానల్లో కరోనా వ్యాక్సినేషన్‌ను గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రారంభించారు. మొదటి రోజు ఉస్మానియా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌,  కోఠి ఈఎన్‌టీ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌, కింగ్‌కోఠి జిల్లా దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజేంద్రనాథ్‌లు టీకా తీసుకున్నారు. అంతేకాక మరో 30 మంది వైద్య సిబ్బందికి టీకా వేశారు. 

వైద్యుల సేవలు అభినందనీయం.. 

లాక్‌డౌన్‌ సమయంలో ఉస్మానియ వైద్యులు చేసిన సేవలు అభినందనీయమని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. శనివారం ఉస్మానియాలోని కరోనా వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌, నాంపల్లి తహసీల్దార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వ్యాక్సిన్‌ ఇస్తున్న తీరును అడిగి తెసుకున్నారు. 

VIDEOS

logo