గురువారం 22 అక్టోబర్ 2020
Hyderabad - Aug 07, 2020 , 23:58:30

28 వేలకే కరోనా వైద్యం

28 వేలకే కరోనా వైద్యం

జైన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు వైద్యసేవలు

24 గంటలు అందుబాటులో.. డాక్టర్లు, సిబ్బంది, అంబులెన్స్‌ 

వారం రోజుల పాటు పూర్తిస్థాయి చికిత్స

ఆక్సిజన్‌ సహా అన్నిసదుపాయాలతో.. బేగంపేటలో ఏర్పాటు

వంద పడకల సామర్ధ్యం.. గదికి ఇద్దరే..

అత్యవసరమైతే పెద్దాసుపత్రికి తరలింపు

గతంలోనూ రూ.300లకే డయాలసిస్‌ సేవలు

సిటీబ్యూరో-నమస్తే తెలంగాణ:

రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులను ఆసరాగా చేసుకుని కొన్ని కార్పొరేట్‌ దవాఖానలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ రోగులను నిలువు దోపిడీచేస్తున్న తరుణంలో జైన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ కరోనా రోగులకు వైద్యసేవలు అందించేందుకు ముందుకువచ్చింది. పలు కార్పొరేట్‌ దవాఖానలు రోజుకు రూ.30వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తుండగా జైన్‌ ఇంటర్నేషనల్‌ స్వచ్ఛంద సంస్థ  మాత్రం కేవలం 28వేల రూపాయలతో వారం రోజుల పాటు కొవిడ్‌ రోగులకు పూర్తిస్థాయి చికిత్స అందించేందుకు ముందుకు వచ్చింది.  దాతల సహాయ సహకారాలతో పనిచేస్తున్న ఈ సంస్థ వైద్యరంగంలో ప్రత్యేక సేవలందిస్తున్నది. గతంలో కూడా కేవలం రూ.300కే డయాలసిస్‌ పేరుతో సికింద్రాబాద్‌లో డయాలసిస్‌ కేంద్రాన్ని ప్రారంభించి ఎంతో మంది నిరుపేద కిడ్నీ రోగులకు అండగా నిలిచింది. ప్రస్తుత కరోనా విపత్కర కాలంలో దేశ వ్యాప్తంగా 15 కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేసిన జైన్‌ ఇంటర్నేషనల్‌ స్వచ్ఛంద సంస్థ 16వ కేంద్రాన్ని బేగంపేటలోని చిరాగ్‌ఫోర్ట్‌లోని మానస సరోవర్‌ హోటల్‌లో  రెండు రోజుల కిందట ఏర్పాటు చేసింది. 100 పడకల సామర్థ్యంలో గదికి ఇద్దరు చొప్పున రోగులకు చికిత్స అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

వారం రోజులకు రూ.28వేలు

వారం రోజుకు కేవలం రూ.28వేలు చెల్లిస్తే భోజనం, రూమ్‌, మందులు, ఆక్సిజన్‌, వైద్యుల ఫీజు తదితర అన్ని రకాల సేవలను అందించనున్నట్లు సంస్థ తెలిపింది. వెంటిలెటర్‌ అందుబాటులో ఉండదు. వెంటిలెటర్‌ అవసరమున్న రోగులను అక్కడ చేర్చుకోరు. వెంటిలెటర్‌ అవసరమున్న రోగులను మాసబ్‌ట్యాంక్‌లోని మహవీర్‌ దవాఖానలో చేర్పిస్తారు. అక్కడ కూడా తక్కువ ఖర్చుతోనే వైద్యసేవలు అందించనున్నట్లు జైన్‌ ఇంటర్నేషనల్‌ స్వచ్ఛంద సంస్థ తెలిపింది. ఇక ప్రత్యేక గది కావాలనుకునే వారు అదనంగా రూ.7వేలు చెల్లించాలి. అంటే వారం రోజులకు గాను రూ.35వేలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కరోనా నిర్ధారణ జరిగిన వారికి మాత్రమే అంటే పాజిటివ్‌ రోగులకే అక్కడ చికిత్స అందిస్తారు. అనుమానితులకు చికిత్స ఇవ్వరు. 

24/7 వైద్యసేవలు

ఈ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో 24గంటలు వైద్యసిబ్బంది రోగులకు అందుబాటులో ఉంటారు. ఆరుగురు వైద్యనిపుణులు, నర్సింగ్‌ సిబ్బంది, పారామెడికల్‌, పారిశుధ్యం తదితర సిబ్బంది అందుబాటులో ఉన్నట్లు సంస్థ వివరించింది. అత్యవసర పరిస్థితులు ఎదురైతే రోగులను పెద్ద దవాఖానకు తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్‌ను సైతం అందుబాటులో ఉంచినట్లు వివరించారు. 

రోగుల సహాయార్ధం 9121155500, 9121255500, 9121355500 హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటు చేశారు.


logo