మంగళవారం 07 జూలై 2020
Hyderabad - Jun 06, 2020 , 00:29:59

హైదరాబాద్‌లో రోజురోజుకూ కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి

 హైదరాబాద్‌లో రోజురోజుకూ కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి

కరోనా మహమ్మారి రోజురోజుకూ కోరలు చాస్తున్నది. కంటికి కనిపించని ఈ వైరస్‌ చాపకింది నీరులా విస్తరిస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. ఎక్కడికైనా వెళ్లాలన్నా, ఎవరితోనైనా మాట్లాడాలన్నా, ఏమి కొనాలన్నా.., తినాలన్నా.. అనుమానంతో అపసోపాలు పడుతున్నారు. ఇటీవల వైద్యులకు, పోలీసులకు అధికంగా వైరస్‌ సోకుతుండటంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే మరింత అప్రమత్తత అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. 

హైదరాబాద్  : గ్రేటర్‌లో కరోనా తీవ్రత కొనసాగుతున్నది. మొన్నటి వరకు రెండంకెల్లో నమోదైన కేసుల సంఖ్య గత మూడు రోజులుగా మూడంకెలకు చేరుకున్నది. తాజాగా శుక్రవారం 116 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో సాధారణ ప్రజలతో పాటు పోలీసులు, వైద్యులు, జర్నలిస్టులు కరోనా బాధితుల జాబితాలో చేరుతున్నారు. కరోనా కట్టడిలో ఈ మూడు వర్గాలు మొదటి నుంచి అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. గాంధీ దవాఖానలో 28 మంది వైద్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఎవరికీ కరోనా లేనట్లు ఫలితాలు వచ్చాయి. దీంతో ఆ వైద్యులంతా ఊపిరి పిల్చుకున్నారు. ప్రజలు వ్యక్తిగతమైన భద్రత చర్యలు పాటిస్తూ, భౌతిక దూరం పాటిస్తుండటంతోనే కరోనా దరిచేరకుండా ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు.

ఎల్బీనగర్‌లో ఇద్దరు డాక్టర్లకు, ఓ ఇన్‌స్పెక్టర్‌కు

ఎల్బీనగర్‌ : ఎల్బీనగర్‌, సరూర్‌నగర్‌ సర్కిళ్లలో మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నగరంలోని పేట్లబుర్జు మెటర్నిటీ దవాఖానలో విధులు నిర్వహించే డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌ రాగా ఆయన ద్వారా రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌లోని కమ్యూనికేషన్‌ వింగ్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే ఆయన సతీమణికి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. పేట్లబుర్జు దవాఖానలో పనిచేసే మరో మహిళా డాక్టర్‌కు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. సరూర్‌నగర్‌ సర్కిల్‌ చైతన్యపురి డివిజన్‌ విద్యుత్‌నగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో నివాసముండే మహిళా డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆమె భర్త గాంధీ దవాఖానలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 

అంబర్‌పేటలో ఏడుగురికి

అంబర్‌పేట : అంబర్‌పేటలో శుక్రవారం ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాచిగూడ మాపిల్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటూ బంజారాహిల్స్‌లోని ఓ దవాఖానలో రేడియోలాజిస్ట్‌గా పనిచేస్తున్న ఓ డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. కాచిగూడ కృష్ణానగర్‌కు చెందిన ఓ మహిళ కరోనాతో ఇటీవల మరణించింది. ఆమె భర్త, ఇద్దరు పిల్లలకు కూడా కరోనా సోకింది. గోల్నాక నెహ్రూనగర్‌లో ఉండే ఓ మహిళ(54)కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఓయూ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తూ బాగ్‌అంబర్‌పేట మల్లిఖార్జుననగర్‌లో ఉంటున్న కానిస్టేబుల్‌కు, కాచిగూడ లింగంపల్లికి చెందిన మరో వ్యక్తికి కరోనా సోకింది. 

ఫీవర్‌లో 45 కరోనా అనుమానిత కేసులు..

నల్లకుంటలోని ఫీవర్‌ దవాఖానలో శుక్రవారం 45 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఇందులో 9 మంది జర్నలిస్టులు ఉన్నారు. మిగతా వారంత నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అనుమానంతో వచ్చారు. వీరందరికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

నిలోఫర్‌లో ఇద్దరు గర్భిణులకు..

తెలుగుయూనివర్సిటీ : నిలోఫర్‌ దవాఖానలో కరోనా అనుమానిత లక్షణాలతో ఐసోలేషన్‌ వార్డులో 48మంది చికిత్స పొందుతున్నారని దవాఖాన కో ఆర్డినేటర్‌ చంద్రమోహన్‌ తెలిపారు. కాగా గురువారం రాత్రి కుత్బుల్లాపూర్‌ సుభాష్‌నగర్‌కు చెందిన ఓ గర్భిణి(27), నాంపల్లి ఆగాపురాకు చెందిన గర్భిణి(29)కి కరోనా పాజిటివ్‌ వచ్చింది. 

కానిస్టేబుళ్లకు కరోనా..

  • మెహిదీపట్నం: ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌ వచ్చింది.
  • రామంతాపూర్‌ : రామంతాపూర్‌ శ్రీనివాసపురంలో నివాసముండే కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. 

బంజారాహిల్స్‌ రోడ్‌ నం.12లో ఇద్దరికి.. 

బంజారాహిల్స్‌ : క్యాన్సర్‌ చికిత్స కోసం బంజారాహిల్స్‌ రోడ్‌ నం.12లోని ఓ ప్రైవేటు దవాఖానకు వచ్చిన రోగికి కరోనా సోకింది. విశాఖపట్నం ప్రాంతానికి చెందిన వృద్ధుడికి(70) గత నెల 22న సర్జరీ నిర్వహించారు. ఇటీవల పరీక్షలు జరిపించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. 

ఎన్‌బీటీనగర్‌లో యువకుడికి ..

బంజారాహిల్స్‌ రోడ్‌ నం 12లోని రేషమ్‌బాగ్‌ బస్తీలో నివాసముంటున్న యువకుడు(32)కి కింగ్‌కోఠి దవాఖానలో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది.

బండ్లగూడలో ఆరు కేసులు

మన్సూరాబాద్‌ : గాంధీ దవాఖానలో వైద్యురాలిగా పనిచేస్తున్న నాగోల్‌ డివిజన్‌, బండ్లగూడ పరిధి పద్మావతికాలనీకి చెందిన మహిళా డాక్టర్‌ (28)కు పాజిటివ్‌గా తేలింది.  

లక్షణాలు లేకపోవడంతో హోంక్వారంటైన్‌

ఈనెల 2న ముంబై నుంచి నగరానికి వచ్చిన బండ్లగూడ, ఫతుల్లాగూడ సర్వే నం.58కి చెందిన ఐదుగురు కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్‌గా వచ్చింది. వీరు ముంబై నుంచివచ్చి కింగ్‌కోఠి దవాఖానకు వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్‌గా తేలినప్పటికీ.. ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో హోం క్వారంటైన్‌ చేశారు.

మారేడ్‌పల్లిలో వైద్యురాలికి, వైద్యుడి తండ్రికి..

మారేడ్‌పల్లి : మహేంద్రాహిల్స్‌లో ఓ వైద్యురాలికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు పికెట్‌ డిస్పెన్సరీ డాక్టర్‌ మీనా వెల్లడించారు. పంజాగుట్టలోని నిమ్స్‌లో కార్డియాలజిస్టుగా పనిచేస్తున్న వైద్యురాలికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా మారేడ్‌పల్లిలోని ఓ ప్రైవేటు దవాఖాన వైద్యుడి తండ్రికి(91) పాజిటివ్‌ వచ్చినట్లు అడ్డగుట్ట మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మాధురి తెలిపారు.

వనస్థలిపురంలో వైద్యురాలికి..

వనస్థలిపురం : పాత నగరంలోని పేట్ల బుర్జు దవాఖానలో విధులు నిర్వహిస్తూ వనస్థలిపురం ఎన్జీవోస్‌కాలనీలో నివాసముండే ఓ వైద్యురాలు(22)కి కరోనా పాజిటివ్‌ వచ్చింది.  

మెహిదీపట్నం : నిమ్స్‌ దవాఖానలో కాంట్రాక్టు పద్ధతిలో వార్డు బాయ్‌గా పనిచేస్తూ.. లంగర్‌హౌస్‌ అంబేద్కర్‌నగర్‌లో నివాసముండే ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అతడి భార్య, ముగ్గురు పిల్లలను హోంక్వారంటైన్‌లో ఉంచారు.

సెక్రటేరియట్‌ ఉద్యోగికి

బడంగ్‌పేట : మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని జిల్లెలగూడ శ్రీనగర్‌కాలనీలో నివాసముంటున్న ఓ మహిళకు, బడంగ్‌పేట లోకాయుక్త కాలనీలో నివాసముంటున్న మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చిన్నట్లు వైద్యాధికారి నర్సింగ్‌రావు తెలిపారు. లోకాయుక్తకాలనీలో నివాసముంటున్న వ్యక్తి సెక్రటేరియట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. 

కుత్బుల్లాపూర్‌లో మరో నాలుగు..

దుండిగల్‌ : న్యూషాపూర్‌నగర్‌కు చెందిన ఓ యువకుడికి(30) కరోనా సోకిందని మండల వైద్యాధికారులు తెలిపారు. సదరు వ్యక్తి నగరంలోని ఓ పేరుమోసిన వైద్యశాలలో పనిచేస్తున్నట్లు తెలిపారు. గాజులరామారంలోని శుభం రెసిడెన్సీలో నివాసముంటున్న వ్యక్తి(53), జగద్గిరిగుట్ట సంజయ్‌పురికాలనీకి చెందిన వృద్ధురాలు(60), రోడామేస్త్రీనగర్‌కు చెందిన వ్యక్తి(50)కి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు.logo