మంగళవారం 26 మే 2020
Hyderabad - May 19, 2020 , 00:11:42

తుదిదశకు ‘కేశవాపూర్‌' భూముల సేకరణ

తుదిదశకు ‘కేశవాపూర్‌' భూముల సేకరణ

  • అసైన్డ్‌ మినహా మిగతా భూములు స్వాధీనం చేసుకున్న అధికారులు 
  • త్వరలోనే జలమండలికి అప్పగింత

మేడ్చల్‌  : హైదరాబాద్‌ మహానగరానికి ప్రతిరోజూ తాగునీరు అందించే కేశవాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంలో కీలక అడుగుపడింది. మేడ్చల్‌ జిల్లా కేశవాపూర్‌లో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన కేశవాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. సోమవారం భూములిచ్చిన రైతులతో కలిసి జిల్లా సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ భూములను పరిశీలించారు. కేశవాపూర్‌, యాకత్‌పురా, అద్రాస్‌పల్లి గ్రామాల్లో మొత్తం 1,503 ఎకరాల విస్తీర్ణంలో ఈ రిజర్వాయర్‌ నిర్మాణం జరుగుతుండగా, ఇందులో ఫారెస్ట్‌ భూములు 928.02 ఎకరాలు, అసైన్డ్‌ భూములు 348.14 ఎకరాలు, ప్రభుత్వ, శిఖం భూము లు 92.37 ఎకరాలు, పట్టా భూములు 132.32 ఎకరాలున్నాయని రెవెన్యూ అధికారులు తెలిపారు.

ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని, పట్టాదారులకు ప్రభుత్వం ప్రకటించిన ఎకరాకు రూ.37లక్షల పరిహారం అందించామని, త్వరలోనే అసైన్డ్‌ భూములకు పరిహారం అందిస్తామని అధికారులు తెలిపారు. భూసేకరణ, భూసర్వే ప్రక్రియ పూర్తయిన వెంటనే జలమండలి వాటర్‌బోర్డు అధికారులకు ఈ భూములను అప్పగించనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. 


logo