గురువారం 13 ఆగస్టు 2020
Hyderabad - Jul 31, 2020 , 23:37:09

కరోనాను జయించి.. ప్లాస్మా దానం

కరోనాను జయించి.. ప్లాస్మా దానం

పాజిటివ్‌ రాగానే.. కండ్లల్లో నీళ్లు తిరిగాయి

గాంధీ దవాఖాన దేవాలయం..

డాక్టర్లు మరో జన్మను ప్రసాదించారు

ప్లాస్మాతో.. ప్రాణదానం చేయాలి

కరోనాను జయించిన రాజ్‌కుమార్‌

వినాయక్‌నగర్‌ : కరోనా పాజిటివ్‌ అని తెలువగానే ఆందోళనకు గురయ్యా. గాంధీ దవాఖానకు వెళ్లగా నా చుట్టూ అంతా కరోనా బాధితులే కనిపిస్తున్నారు. అది చూసిన నాకు.. జీవితం అంతా చీకటిమయంగా అనిపించింది. నా భార్య, ఏడాదిన్నర బాబు గుర్తుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నా..  ఏం చేయాలో అర్థం కాక.. ఏడుస్తున్న నాకు డాక్టర్లు, నర్సులు ఏమీ కాదని ధైర్యం చెప్పారు. ఆ సమయంలో వైద్యులు దేవుళ్లుగా కనిపించారు. దవాఖానలో చికిత్సతో పాటు భోజనం ఇతర సౌకర్యాలు బాగున్నాయి. 14 రోజుల అనంతరం నెగెటివ్‌ రావడంతో ఇంటికి చేరుకున్నా. పూర్తిగా కోలుకున్నాక.. గాంధీ దవాఖానకు వెళ్లి ప్లాస్మా డొనేట్‌ చేశానని చెప్పారు రాజ్‌కుమార్‌.

ఇంటివద్దే పోలీసులు  టెంట్‌ వేశారు

నేరేడ్‌మెట్‌ న్యూ విద్యానగర్‌లో ఉంటున్నా. నేనో ప్రైవేటు ఉద్యోగిని. నాకు భార్య, 18నెలల బాబు ఉన్నాడు. ఏప్రిల్‌ 22న జలుబు, వాసన తెలియక పోవడంతో మల్కాజిగిరిలోని జిల్లా దవాఖానకు వెళ్లగా పరీక్షించి వైద్యులు అనుమానంతో కింగ్‌కోఠి దవాఖానకు వెళ్లాలని సూచించారు. అక్కడికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో చికిత్స నిమిత్తం నేరుగా గాంధీదవాఖానకు చేరాను. నా భార్య, బాబు, అమ్మను 108లో దవాఖానకు తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటీవ్‌ అని తేలింది. దీంతో ఊపిరి పీల్చుకున్నా. సర్కిల్‌ అధికారులు ఇంటివద్దకు చేరుకుని పరిసరాలను శానిటైజ్‌ చేశారు. ఇంటికి సమీపంలోనే పోలీసులు టెంటువేసుకుని 14రోజుల పాటు మా కుటుంబానికి ధైర్యాన్ని నింపారు. 

ప్లాస్మా దానం చేయండి..

కరోనాను జయించిన ప్రతి ఒక్కరూ ప్లాస్మా డొనేట్‌ చేసేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. ప్లాస్మా డొనేట్‌ చేయడం ద్వారా మరొకరికి ప్రాణదానం చేసినవారమవుతామని అన్నారు. 

కరోనా పాజిటివ్‌ కేసులు

అల్వాల్‌ సర్కిల్‌లో 72మందికి, బాలాపూర్‌, సరూర్‌నగర్‌లో 67మందికి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో 51మందికి పాజిటివ్‌ వచ్చింది. అదేవిధంగా యూసుఫ్‌గూడ సర్కిల్‌లో 45 మందికి, ఉప్పల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 43మందికి, మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ దవాఖానలో 32మందికి, మేడ్చల్‌ పట్టణంలో 21మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. కాప్రా సర్కిల్‌లో 20మందికి కరోనా సోకింది. కవాడిగూడ డీబీఆర్‌ మిల్స్‌, గగన్‌మహల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 11మందికి, తుకారాంగేట్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 10మందికి, చింతల్‌బస్తీ పీహెచ్‌సీ పరిధిలో 10, అహ్మద్‌నగర్‌ డివిజన్‌లో 8, అఫ్జల్‌సాగర్‌ పీహెచ్‌సీ పరిధిలో 4 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ముషీరాబాద్‌, భోలక్‌పూర్‌ యూపీహెచ్‌సీల పరిధిలో  9మందికి పాజిటివ్‌ వచ్చింది.


logo