బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 07, 2020 , 23:58:27

పేదలకు సరుకులు

పేదలకు సరుకులు

  • 10వేల మందికి అందజేస్తామన్న డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌

సికింద్రాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌లో పేదలను ఆదుకునేందుకు డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ సికింద్రాబాద్‌లో చేపట్టిన 10వేల మందికి నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం ప్రారంభించారు. సీతాఫల్‌మండిలోని టీఆర్‌టీ క్వార్టర్స్‌ వద్ద ప్రజలకు 10కిలోల బియ్యం, రెండు కిలోల కందిపప్పు, కిలో చక్కెర, కిలో నూనె, అరకిలో చింతపండుతో కూడిన కిట్‌లను పంపిణీ చేశారు. వీటిని సంచిలో పెట్టి డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ లబ్ధిదారులకు అందజేశారు. 

ముందుగా మంత్రి కేటీఆర్‌ ప్యాకింగ్‌ చేస్తున్న సీతాఫల్‌మండిలోని మల్టీపర్పస్‌ ఫంక్షన్‌హాల్‌ ప్రాంగణాన్ని పరిశీలించారు. నియోజకవర్గంలోని అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సీతాఫల్‌మండి, బౌద్ధనగర్‌ డివిజన్‌లో పంపిణీకి సిద్ధం చేసిన కిట్‌లను మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 10వేల మందికి నిత్యావసర సరకులను పంపిణీ చేయనున్నట్లు డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. 

నియోజకవర్గంలోని ఇంటింటికి వెళ్లి సరుకులను అందజేస్తామని, మరెక్కడా కూడా సరుకులను ఇవ్వడం లేదని తెలిపారు. కొందరు ఫంక్షన్‌హాల్‌ వద్దకు సరుకుల కోసం వస్తున్నారని, ప్రజలు తమ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, తామే ఇండ్ల ముందుకు వచ్చి సరుకులు అందజేస్తామని పద్మారావు గౌడ్‌ వివరించారు.   కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్‌ రవికుమార్‌, కార్పొరేటర్‌ సామల హేమ, టీఆర్‌ఎస్‌ యువ నాయకులు తీగుళ్ల కిశోర్‌గౌడ్‌, తీగుళ్ల రామేశ్వర్‌గౌడ్‌, తీగుళ్ల త్రినేత్ర గౌడ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.   


logo