ఆదివారం 17 జనవరి 2021
Hyderabad - Nov 26, 2020 , 07:40:12

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి బల్దియాపై నజర్‌

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి బల్దియాపై నజర్‌

  • కమిషనరేట్‌ పరిధిలో 4,979 పోలింగ్‌ స్టేషన్లు
  • 2,789 సమస్యాత్మక కేంద్రాలు గుర్తింపు  
  • 23 కేసులు.. రూ.1.40 కోట్లు సీజ్‌
  • పట్టిష్ట బందోబస్తు : సీపీ అంజనీకుమార్‌

హైదరాబాద్‌ : బల్దియా ఎన్నిక తేదీ దగ్గర పడుతుండటంతో నగరంలో పార్టీల ప్రచారం హోరెత్తుతున్నది. డిసెంబర్‌ 1న జరిగే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు నగర పోలీస్‌ యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 1,632 ప్రాంతాల్లోని 4,979 పోలింగ్‌ కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినయోగించుకోనున్నారు. ప్రశాంత వాతారవరణంలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించేవారిపై చర్యలకు సిద్ధమవుతున్నారు. టెక్నాలజీని ఉపయోగించి ఎన్నికలను పారదర్శంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పకడ్బందీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉండే రౌడీషీటర్లను బైండోవర్‌ చేశామనీ, లైసెన్స్‌ ఆయుధాలను డిపాజిట్‌ చేయించామని సీపీ వివరించారు.  

ఎన్నికలపై సాంకేతిక నిఘా

ఎన్నికల సందర్భంగా సీసీ కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగుతున్నది. పోలింగ్‌ కేంద్రం వద్ద నిబంధనలు అతిక్రమించే వారిపై కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (సీసీసీ) నుంచి నిఘా కొనసాగుతుంది. నాలుగు కెమెరా మౌంటెడ్‌ వాహనాలను కూడా ఉపయోగిస్తున్నారు. డయల్‌ 100కు కాల్స్‌కు వచ్చిన వెంటనే నిర్ణీత సమయంలో ఘటనాస్థలికి  చేరుకునేలా చర్యలు చేపట్టారు. వీటి పని తీరును సీసీసీ నుంచి టెక్నికల్‌ బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. సోషల్‌ మీడియాలో వచ్చే పుకార్లు ఇతరత్రా పోస్టింగులపై నిఘా ఉంటుంది. సామాన్య ప్రజలు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, హాక్‌ ఐ, వాట్సాప్‌ల ద్వారా వ్యక్తిగత ఫిర్యాదులను ఇస్తుంటారు. వీటిని ఎప్పటికప్పుడు స్వీకరిస్తూ వాటిని ఆయా పోలీస్‌స్టేషన్లకు కమిషనరేట్‌ కార్యాలయంలోని టెక్నికల్‌ బృందాలు పంపిస్తుంటాయి.

పాతబస్తీలో ఫ్లాగ్‌ మార్చ్‌

చార్మినార్‌ : గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ పిలుపునిచ్చారు. బుధవారం చార్మినార్‌ వద్ద శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్‌ సిబ్బందితోపాటు పారామిలటరీ బలగాలతో ఫ్లాగ్‌మార్చ్‌ను  ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడు తూ.. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతవరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎవరైనా భయాందోళనలకు గురి చేస్తే డయల్‌ 100కు ఫిర్యాదు చేయాలని సూచించారు. పోలింగ్‌ రోజు దొంగ ఓట్లను నివారించేందుకు సివిల్‌ అధికారులను రంగంలోకి దించుతున్నామని చెప్పారు. అత్యంత సమస్యాత్మక కేంద్రాల వద్ద కేంద్ర పారామిలటరీ బలగాలను మొహరించనున్నట్టు తెలిపారు. ఫ్లాగ్‌మార్చ్‌ చార్మినార్‌ నుంచి బయలుదేరి శాలిబండ, లాల్‌దర్వాజా క్రాస్‌రోడ్డు, మొఘల్‌పుర మీదుగా గుల్జర్‌హౌస్‌ వరకు కొనసాగింది. అదనపు పోలీస్‌ కమిషనర్‌, సంయుక్త కమిషనర్‌ షికాగోయల్‌, డీఎస్‌ చౌహాన్‌, తరుణ్‌జోషి, దక్షిణ మండల ఇంచార్జ్‌ గజరావ్‌ భూపాల్‌ పాల్గొన్నాయి.