e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, April 11, 2021
Advertisement
Home హైదరాబాద్‌ ఇలవైకుంఠపురిలో..

ఇలవైకుంఠపురిలో..

ఇలవైకుంఠపురిలో..

అద్భుత దివ్యక్షేత్రంగా, వెయ్యేండ్లు వర్ధిల్లేలా పునర్‌నిర్మితమవుతున్న యాదాద్రి పంచనారసింహుడి ఆలయ పనుల పురోగతిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం పరిశీలించారు. తొలుత స్వామివారిని దర్శించుకున్న అనంతరం అధికారులతో కలిసి అడుగడగున ఉట్టిపడుతున్న కృష్ణశిల సంపదను వీక్షించి పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. యాదాద్రి గుడి అన్నింటికన్నా మెరుగ్గా ఉండాలన్న సీఎం..దేశంలోని విభిన్న ఆలయాలను పరిశీలించి రావాలని సూచించారు. లక్షల సంఖ్యలో విచ్చేసే భక్తులకు సకల వసతులు కల్పించాలని, యాదగిరీశుడి సన్నిధికి చేరుకోగానే వైకుంఠంలో అడుగిడిన అనుభూతి కలుగాలన్నారు. క్యూకాంప్లెక్స్‌ల్లో వేచి ఉండే భక్తులకు దేవదేవుడి శ్లోకాలు, భక్తిగీతాలు శ్రావ్యంగా వినిపించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 

యాదాద్రీశుడి ఖ్యాతి, విశిష్టతను ఖండాంతరాలకు చాటి చెప్పేలా సాగుతున్న యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్‌ గురువారం పరిశీలించారు. తొలుత బాలాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం..ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. మాడవీధులు, బాహ్య అంతర ప్రాకారాలు, సాలహారాలలో విగ్రహాల అమరికలు… ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, స్థపతులు, ఆర్కిటెక్ట్‌లు, అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులు ఆధ్యాత్మిక క్షేత్రంలోకి వచ్చిన అనుభూతి కలిగేలా నిర్మాణాలకు తుది మెరుగులు దిద్దాలని, దేశంలోని ఆలయాలకు ఆదర్శంగా యాదాద్రి నిలవాలని ఆకాంక్షించారు. భక్తులకు సకల వసతులు కల్పించాలని, విద్యుద్దీపాలకాంతులతో దేవాలయం దేదీప్యమానంగా వెలిగిపోయేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. యాదాద్రిలో సీఎం పర్యటన ఆరు గంటల పాటు సాగింది. 

యాదాద్రి భువనగిరి : ఇల వైకుంఠపురిగా అవతరించనున్న యాదాద్రి దివ్య క్షేత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం దర్శించుకున్నారు. పనులు పూర్తై ముహూర్తం కోసం ఎదురుచూస్తున్న వేళ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. హైదరాబాద్‌ నుంచి హెలిక్యాప్టర్‌ ద్వారా బయలుదేరిన సీఎం కేసీఆర్‌ మధ్యాహ్నం 12.08 గంటలకు యాదాద్రికి చేరుకున్నారు. బాలాలయంలో సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ పూజలు చేసిన అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పనులపైన ప్రధానంగా దృష్టి సారించినఆయన ఆ పనులు ఎప్పటిలోపుగా పూర్తి అవుతాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని ద్వారక కంపెనీలో ప్రత్యేకంగా తయారు చేసిన బంగారు వర్ణపు క్యూలైన్లను పరిశీలించి స్థపతులకు పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవ మండపం పక్క నుంచి తూర్పు పంచతల రాజగోపురం నుంచి లోపలికి వెళ్లే క్యూలెన్ల ను నిర్మాణాలను పరిశీలించి, భక్తులకు సౌకర్యంగా ఉండేలా విశాలంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధానాలయం పునర్నిర్మాణ పనులు పూర్తి అయ్యి తుది మెరుగులు దిద్దుకుంటున్న తరుణంలో మే నెలలో ఆలయాన్ని ప్రారంభించే అవకాశం ఉందని సీఎం కేసీఆర్‌ సంకేతాలిచ్చారు.

సూచనలు.. సలహాలు

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల పురోగతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ అసంపూర్తిగా ఉన్న పనుల గురించి ఆరా తీశారు. అవి ఎన్ని రోజుల్లో పూర్తవుతాయనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కళా ఖండాలను అత్యద్భుతంగా తీర్చిదిద్దేక్రమంలో హడావుడి వద్దని సూచించారు. తుది మెరుగులకు మరింత వన్నెలద్దేందుకు వివిధ దేశాలల్లోని ఆలయాలను సందర్శించాలని సూచించారు.  నిర్మాణం పూర్తికావచ్చిన ఈవో కార్యాలయం, స్వామివారి పల్లకి గద్దె, అద్దాల మండపం పనులను చూసి మెచ్చుకున్నారు. అద్దాల మండపాన్ని అద్భుతంగా ప్రత్యేకత చాటుకునేలా తీర్చిదిద్దాలన్నారు. చైనాలో 7 కిలోమీటర్ల దూరం లైట్లతో నిర్మించిన మాల్‌ను ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సందర్శించి రావాలని అధికారులను సీఎం సూచించారు. యాదాద్రి గెస్ట్‌హౌస్‌ లిప్టులు ఇంకా పూర్తికాకపోవడం పట్ల ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే పనుల్లో వేగం పెంచాలని అధికారులను సుతిమెత్తగా మందలించారు.

పచ్చదనం ఉట్టిపడేలా…

స్వచ్ఛత పరిశుభ్రత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. దేశంలోనే ఇతర దేవాలయాలకు యాదాద్రిని ఆదర్శంగా నిలపాలన్నారు. యాదాద్రి కొండ చుట్టూ మొక్కలను నాటడంతోపాటు సంరక్షించేందుకు కావాల్సిన ఉద్యోగులను నియమించుకోవాలని అధికారులకు తెలిపారు. యాదాద్రి పునఃప్రారంభం అనంతరం వేలాది భక్తులు యాదాద్రికి వస్తారని, వారు సేద తీరేందుకు చక్కటి పూల మొక్కలు, ఇతర మొక్కలను నాటాలన్నారు. 

ఆరు గంటల పాటు..

సుమారు గంటపాటు ప్రధానాలయం ప్రాంగణంలోనే సీఎం కేసీఆర్‌ గడిపారు. విష్ణు పుష్కరిణి, శివాలయంతో పాటు స్వామివారి మెట్లనిర్మాణం, రింగురోడ్డు, కొండకింద నిర్మిస్తున్న విష్ణుపుష్కరిణి, బస్టాండ్‌, వీవీఐపీ విడిది కోసం నిర్మిస్తున్న ప్రెసిడెన్సియల్‌ సూట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. యాదాద్రిలో సుమారు 6 గంటలకుపైగా సీఎం పర్యటన సాగగా… ఆలయ ప్రాంగణంతో పాటు ఆలయ చుట్టు పక్కల అనుబంధంగా జరుగుతున్న పనుల పురోగతిని క్షుణ్ణంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ పునః నిర్మాణ పనులు దాదాపుగా పూర్తికావచ్చిన నేపథ్యంలో.. తుదిమెరుగులపైనే ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని అధికారులకు సూచించారు. ఆలయం చుట్టూ ప్రహరీకి మరింత శోభను ఇచ్చేలా, ప్రాచీన చిత్రకళ ఉట్టిపడేలా అలంకృత రూపంతో ఉండేలా, బ్రాస్‌ మెటల్‌తో సుందరంగా తయారు చేయాలన్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దూరం నుంచి దర్శించిన భక్తులకు భక్తిభావన ఉట్టిపడేలా దీపాలంకరణ ఉండాలన్నారు. కనుచూపు మేర ఎక్కడ చూసినా అద్భుతంగా తీర్చిదిద్దాలని సూచించారు. 

స్వామివారి అభిషేకం ప్రత్యక్షంగా కనబడేలా..

మూల విరాట్టుకు అభిషేకం చేసే సందర్భంలో పూజ కార్యక్రమాలు భక్తులకు స్పష్టంగా కనిపించేలాగా ప్రధాన ద్వారం వద్ద అడ్డంకులు లేకుండా చూడాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. గర్భగుడి ముందు ధ్వజస్తంభం, హనుమాన్‌ విగ్రహం, తంజావూరు పెయింటింగ్‌లను పరిశీలించారు. బంగారు తాపడం, పలు దేవతామూర్తుల ప్రతిమలను పరిశీలించారు. ఆండాళ్‌ ఆళ్వార్‌ అమ్మవారి గుడిని, పరకామణిని పరిశీలించారు. మూలవిరాట్టు దైవ దర్శనాంతరమే క్షేత్రపాలకుని దర్శనం  ఆనవాయితీగా వస్తుందని, దాన్నే కొనసాగాలని చెప్పారు.

పూజారులు, సిబ్బందికి ఇండ్లు.. 

యాదాద్రి పరిసర ప్రాంతాల్లో పూజారులతో సహా, ఆలయ సిబ్బంది నివసించేందుకు అనువైన ఇండ్ల నిర్మించాలని అధికారులను ఆదేశించారు. శిల్పులకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. విశ్రాంత బ్రాహ్మణ పెద్దలు, తమ భుక్తిని వెళ్లదీసుకునేలా, దయగల భక్తుల నుంచి కానుకలను స్వీకరించి, వారీ జీవన భృతిని కొనసాగించేలా ఇక్కడ కూడా మండపం నిర్మాణ ఏర్పాటు చేయాలన్నారు. అందుకోసం పూరీ ఆలయాన్ని సందర్శించాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ సూచించారు. శివాలయాన్ని సందర్శించిన కేసీఆర్‌, రుత్విక్కుల కోసం మండపం బాగా కట్టారని కితాబునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంట రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, ఆర్‌ అండ్‌ బీ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, ఈఎన్సీలు రవీందర్‌రావు, గణపతిరెడ్డి, , వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఆలయ అనువంశికధర్మకర్త బి. నరసింహమూర్తి, ఈవో గీత, ఆర్కిటెక్ట్‌ ఆనంద్‌సాయి, స్థపతి డాక్టర్‌ ఆనందాచార్యుల వేలు, వాస్తు సలహాదారుడు సుద్దాల సుధాకర్‌ తేజ, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఎరుకల సుధ, ఆలేరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

సౌకర్యవంతంగా క్యూలైన్లు ఉండేలా…

యాదాద్రీశుడిని దర్శించుకునే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా క్యూలైన్లను తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. అవసరమైనంత ఎత్తులో విశాలంగా క్యూలైన్ల దారిని నిర్మించాలన్నారు. క్యూ కాంప్లెక్స్‌లో భక్తులకు ఆహ్లాదంగా ఉండేలా శ్లోకాలు, భక్తిగీతాలు శ్రావ్యంగా వినిపించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. మెట్లదారి నుంచి వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించాలని, భక్తులు నేరుగా క్యూలైన్‌ కాంప్లెక్స్‌ చేరేలా నిర్మాణాలుండాలని అన్నారు.

రోడ్డు బాధితులకు వరాల జల్లులు.. 

యాదాద్రి ప్రధానరోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు, షాపులు కోల్పోతున్న బాధితులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దాదాపుగా గంట పాటు చర్చలు జరిపారు. తమ తాతల నాటి నుంచి ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నామని, తమకు షాపులు కోల్పోతే తీవ్రంగా నష్టపోతామని బాధితులు వేడుకున్నారు. తమకు సంపూర్ణ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయగా స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాధితులపై వరాల జల్లులు కురిపించారు. ఒక్కో బాధితుడికి 200 గజాల ఇండ్ల స్థలం, నూతనంగా నిర్మిస్తున్న ఆర్టీసీ డిపో వద్ద షాపింగ్‌ కాంప్లెక్స్‌లో షాపును కేటాయిస్తామని హామీనిచ్చారు. 

మెరుగ్గా ఉండాలి

ప్రధాన ఆలయానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ నేపథ్యంలోనే యాదాద్రి గుడి అన్నింటికన్నా మెరుగ్గా ఉండాలి. అందుకోసం దేశంలోని వివిధ ఆలయాల్లో శిల్ప సంపద ఎలా ఉందో(అధికారులు…) చూసి రండి. చైనాలో ఏడు కిలోమీటర్ల పొడవునా వెలుగులీనే దీపాలతో నిర్మించిన మాల్‌ మనల్ని ఆకట్టుకుంటుంది. రిటైర్డ్‌ పూజారులకు జీవన భృతి కల్పించేందుకు వీలుగా ఒడిశాలోని పూరి జగన్నాథ్‌ ఆలయంలో నిర్మించిన మండపాన్ని సందర్శించి రండి 

మెట్ల దారిలో  సౌకర్యాలు

వచ్చే రోజుల్లో దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. రద్దీ పెరుగుతది. అందుకు తగ్గట్టుగా మనం ఏర్పాట్లు చేయాలె. మెట్ల దారిలో వచ్చే భక్తులు ఆయాసపడకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి. వారు నడుచుకుంటూ వచ్చి నేరుగా క్యూలైన్‌ కాంప్లెక్స్‌ చేరేలా నిర్మాణాలు ఉండాలి

క్యూలైన్లు బావున్నాయి

ఇండోర్‌ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన ఇత్తడి క్యూలైన్లు బావున్నాయి. అత్యద్భుతంగా కనువిందు చేస్తున్నాయి. వీటిని ప్రహరీకి పక్కన ఏర్పాటు చేయండి. రాకపోకల సమయంలో భక్తులకు తగినంత వెలుగునిచ్చేలా విశాలంగా అమర్చాలి. 

ఇంటి స్థలాలిస్తాం

యాదాద్రి ప్రధాన రోడ్డు విస్తరణలో దుకాణాలు కోల్పోతున్న బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటాం. కోల్పోతున్న దాని కంటే గొప్పగా అన్ని వసతులతో షోరూంలను తలదన్నే రీతిలో దుకాణాలు నిర్మించి ఇస్తాం. ఉచితంగా ఇంటి స్థలాలు కూడా కేటాయిస్తాం. 

అనుభూతి కలగాలి

యాదాద్రి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మికత కలిగేలా ఏర్పాట్లు ఉండాలి. వైకుంఠంలో అడుగిడిన అనుభూతి కలగాలి. పచ్చదనం పెంపునకు అవసరమైన చర్యలు చేపట్టాలి. క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉండే భక్తులకు శ్లోకాలు, భక్తి గీతాలు శ్రావ్యంగా వినిపించేలా ఏర్పాట్లు చేయాలి. 

ఆకట్టుకున్న పెయింటింగ్‌

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో తంజావూరు పెయింటింగ్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పరిశీలించారు.  యాదాద్రి పర్యటనలో భాగంగా కేసీఆర్‌ ప్రధానాలయంలో స్వామివారి గర్భాలయంలో  శ్రీలక్ష్మీనారసింహుడి కల్యాణంతో తయారు చేసిన తంజావూరు చిత్రాన్ని తిలకించారు. సుమారు 3నిమిషాల పాటు సీఎం కేసీఆర్‌ చిత్రాన్ని తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. పెయింటింగ్‌ భక్తులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారని కితాబు ఇచ్చారు. గత పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ తంజావూర్‌ చిత్రాన్ని ఏర్పాటు చేయాలని ఆలయ స్థపతులకు సూచించారు. తమిళనాడుకు చెందిన ఓ దాత సహకారంతో తంజావూర్‌ పెయింటింగ్‌ను  గర్భాలయానికి అమర్చారు.  

Advertisement
ఇలవైకుంఠపురిలో..

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement