e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home యాదాద్రి దేవుడే.. మా వాడకొచ్చిండు

దేవుడే.. మా వాడకొచ్చిండు

  • సీఎం పర్యటనపై వాసాల మర్రి దళితవాడ వాసుల సంతోషం
  • తమ గ్రామం నుంచే దళిత బంధు అమలు చేయడంపై ఆనందం
  • మూడు గంటల పాటు ఇంటింటికీ వెళ్లి పేరుపేరునా అప్యాయంగా పలకరించిన సీఎం కేసీఆర్‌
  • తమ కష్టాలు తీర్చేందుకు వచ్చిండంటూ ప్రేమానురాగాలు పంచిన గ్రామస్తులు

యాదాద్రి భువనగిరి, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/తుర్కపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాకతో వాసాల మర్రి ఉబ్చితబ్బిబ్బయ్యింది. ఇచ్చిన హామీ మేరకు రెండోసారి వచ్చి తమ వాడలో పర్యటించడంతో దళితవాసులందరూ సీఎంను కొనియాడారు. తమ కష్టాలు తీర్చేందుకు దేవుడే స్వయంగా దళిత వాడకు వచ్చాడంటూ ఆనందం వ్యక్తం చేశారు. స్వచ్ఛమైన ఆప్యాయతలు, పలకరింపుల మధ్య సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో బుధవారం జరిగిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది. తొలి పర్యటనలో ఊరి జనంతో సహపంక్తి భోజనాలు, ముచ్చట్లు, కుశల ప్రశ్నలతో సీఎం కేసీఆర్‌ ఆకట్టుకోగా, బుధవారం రెండోసారి వాసాలమర్రికి వచ్చిన ఆయన అదే తరహాలో ఆత్మీయత పంచారు.

మధ్యాహ్నం 12.30 గంటలకు వాసాలమర్రికి చేరుకున్న సీఎం కేసీఆర్‌ 3 గంటలపాటు నాలుగు కిలోమీటర్లు కాలి నడకన గ్రామమంతా కలియతిరిగారు. ప్రతి ఇంటి వద్ద ఆగి ఒక్కొక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ ముందుకు సాగారు. వర్షానికి కూడా వెరవక తన పర్యటనను సాగించారు. తొలుత దళితవాడల్లో శిథిలావస్థకు చేరి కూలిపోయే దశలో ఉన్న ఇండ్లను చూసి చలించిపోయారు. గ్రామ పర్యటన అనంతరం స్థానిక రైతు వేదికలో దళితులతో సమావేశం నిర్వహించి దళితబంధు పథకం ఉద్దేశాలను వివరించడంతో పాటు ఈ పథకంపై దళితుల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామం మొత్తాన్ని దత్తత తీసుకున్నందున ఆర్థికంగా అన్ని కుటుంబాలు నిలదొక్కుకునేలా సాయం అందించడంతోపాటు ఇండ్లు లేని పేదలందరికీ గృహాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

గ్రామంలో పటిష్ట బందోబస్తు

- Advertisement -

సీఎం కేసీఆర్‌ వాసాలమర్రి పర్యటన సందర్భంగా గ్రామంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాచకొండ కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ పర్యవేక్షణలో యాదాద్రి భువనగిరి జోన్‌ డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మొత్తం 1,250 మంది పోలీస్‌ సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్‌ రసమయి బాలకిషన్‌, రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారీ, డీసీపీ నారాయణరెడ్డి, డీఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి, ఆర్డీవో భూపాల్‌రెడ్డి, డీపీవో సాయిబాబా, డీఎల్‌పీవో యాదగిరి, యాదాద్రి ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి, ఎంపీటీసీ పలుగుల నవీన్‌కుమార్‌, ఉపసర్పంచ్‌ మధు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

దళితుల జీవితాల్లో వెలుగులు

దళితుల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా వారి కాళ్లపై వారు నిలబడి ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఆలేరులో అమలు కావడం మా అదృష్టం. దత్తత గ్రామమైన వాసాలమర్రిలో సీఎం కేసీఆర్‌ అమలు చేసిన దళితబంధుతో దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు
ఉపయోగపడుతుంది. – గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి,ప్రభుత్వ విప్‌

కొత్త ఇండ్లు కట్టిస్తాం…

వాసాలమర్రి గ్రామ అభివృద్ధి పరంగా బాగాలేదని, ఎర్రవల్లి మాదిరిగా వాసాలమర్రి రూపురేఖలను ఆరు నెలల్లో మార్చేద్దామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. గ్రామం మొత్తం కలియతిరిగిన సందర్భంలో ఒక్క ఇటుకల ఇల్లూ కనబడక మట్టితో కూలిపోయే దశలో ఉన్న ఇండ్లను చూసి చలించిపోయానని అన్నారు. మొత్తం ఊరిని కూలగొట్టి కొత్త ఇండ్లు కట్టించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎర్రవల్లి గ్రామం కూడా ఒకప్పుడు వాసాలమర్రిలాగే ఉండేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆరు నెలల్లో రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీలతోపాటు వీధి దీపాలను ఏర్పాటు చేసుకొని ఊరుని బాగు చేసుకుంటామన్నారు.

చక్కని అవకాశం

సీఎం కేసీఆర్‌ సారు దళితులపై ఉన్న ప్రేమతో దళత బంధు పథకం పెట్టడమే కాకుండా మా గ్రామానికి వచ్చి దళిత కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించడం ఎంతో మేలు చేకూరుతుంది. దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు ఒక చక్కని అవకాశం వచ్చింది. కుటుంబమంతా చర్చించుకుని వచ్చే డబ్బుతో ఏ వ్యాపారం చేయాలో నిర్ణయించుకుంటాం. -చిన్నూరి మమత, బీటెక్‌ విద్యార్థిని, వాసాలమర్రి గ్రామం

సీఎం కేసీఆర్‌కు ఆత్మీయ స్వాగతం

రెండో సారి వాసాలమర్రికి సీఎం కేసీఆర్‌కు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. సీఎం కేసీఆర్‌కు వెల్‌కం అంటూ ముగ్గులు వేయడంతోపాటు తోరణాలు కట్టి దళితవాడలను ముస్తాబు చేశారు. దళిత కుటుంబాల మహిళలు సీఎం కేసీఆర్‌కు తిలకం దిద్ది హారతులతో స్వాగతం పలికారు. గత పర్యటన సందర్భంగా సర్పంచ్‌ పోగుల ఆంజనేయులు ఇంట్లో భోజనం చేస్తానని మాట ఇచ్చిన సీఎం.. తాజా పర్యటనలో ఆయన ఇంట్లో భోజనం చేశారు. తొలి పర్యటనలో తన దోస్తులుగా ప్రకటించిన ఆకుల ఆగమ్మ, చిన్నూరి లక్ష్మిల ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

సరికొత్త చరిత్ర సృష్టించాలి..

మొదటగా దళితవాడల్లో పర్యటించిన సీఎం కేసీఆర్‌… అనంతరం స్థానిక రైతువేదికలో గ్రామంలోని దళిత కుటుంబాలతో ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ వాసాలమర్రిలో 612 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని, మరో 100 ఎకరాల మిగులు భూములతోపాటు కబ్జాలో ఉన్న భూముల లెక్కలు తేల్చి దళిత కుటుంబాలకు పంపిణీ చేస్తామని ప్రకటించారు. వాసాలమర్రి అన్ని రంగాల్లో సరికొత్త చరిత్ర సృష్టించాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. పట్టబట్టి జట్టుకట్టి బంగారు వాసాలమర్రిగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.

వర్షంలోనూ కొనసాగిన పర్యటన

సీఎం కేసీఆర్‌ వాసాలమర్రి దళితవాడల్లో, గ్రామంలోని అన్ని వీధుల్లోనూ 3 గంటలపాటు పర్యటించారు. ప్రతి ఇంటి వద్ద ఆగి ఒక్కొక్కరిని ఆత్మీయంగా పలకరించి కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. దళితవాడ సందర్శించిన సందర్భంగా సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకం గురించి తెలుసా? అంటూ దళిత కుటుంబాలను
ప్రశ్నించారు. ఇంటికి రూ.10 లక్షలు ఇస్తే ఏం చేస్తారని అడిగి తెలుసుకున్నారు. కొంత మంది మిల్క్‌ డెయిరీ ఫాం పెట్టుకుంటామని, మరికొందరు ట్రాక్టర్లు కొంటామని సీఎంకు తెలిపారు. పింఛన్‌ రావడం లేదని కొందరు సీఎం దృష్టికి తీసుకురాగా, అర్హులైన వారు ఉంటే వెంటనే పెన్షన్‌ మంజూరు చేయాలని కలెక్టర్‌ పమేలాసత్పతిని ఆదేశించారు. తమకు కూడా పింఛన్‌ రావడం లేదని బీడీ మహిళా కార్మికులు సీఎం కేసీఆర్‌కు విన్నవించుకోగా, రెండు రోజుల్లో వారికి పింఛన్‌ మంజూరు చేయాలని కలెక్టర్‌కు సూచించారు. వర్షం పడినప్పటికీ సీఎం పర్యటన నిరాటంకంగా కొనసాగించారు.

సీఎం కేసీఆర్‌ పర్యటన సాగిందిలా..

  • 12.30 గంటలకు సీఎం కేసీఆర్‌ వాసాలమర్రికి వచ్చారు.
  • 12.33 గంటలకు దళితవాడలకు చేరుకున్నారు.
  • 2.45 గంటల వరకు దళితవాడతో పాటు గ్రామంలో కాలి నడకన పర్యటించారు
  • 2.50 గంటలకు సర్పంచ్‌ పోగుల ఆంజనేయులు ఇంటికి చేరుకుని భోజనం చేశారు
  • 4.30 గంటలకు సర్పంచ్‌ ఇంటి నుంచి బయలుదేరి రైతు వేదిక వద్దకు చేరుకుని దళితులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.
  • 6 :00 గంటలకు రైతు వేదిక నుంచి సీఎం కేసీఆర్‌ బయలుదేరి వెళ్లిపోయారు

బట్టల దుకాణం పెట్టుకుంటాం…

కూలి పని చేసుకుంటూ జీవించే మా కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారు దళిత బంధు కింద రూ. 10లక్షలు మంజూరు చేయడం ఎంతో సంతోషంగా ఉంది. నాకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు డిగ్రీ పూర్తయింది. వ్యాపారం చేయాలన్నా.. ఆర్థిక ఇబ్బందులతో ఎలాంటి పని చేయలేకపోయాం. సీఎం కేసీఆర్‌ దేవుడిలా మా కుటుంబానికి రూ. 10లక్షలు ప్రకటించారు.
బట్టల దుకాణం పెట్టుకుంటా. -జెర్రిపోతుల శోభ, వాసాలమర్రి గ్రామస్తురాలు

పాడి ఆవులను కొనుగోలు చేస్తా

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారు మా గ్రామానికి రెండోసారి రావడమే కాకుండా దళితులందరితో సమావేశాన్ని నిర్వహించారు. దళిత బంధు పథకం కింద కుటుంబానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ డబ్బులను సద్వినియోగం చేసుకుని పాడి ఆవులను కొనుగోలు చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందుతా. -జెర్రిపోతుల సంజీవ, దళితుడు, వాసాలమర్రి, తుర్కపల్లి మండలం

దేవుడే మా దళిత వాడకు వచ్చినట్లుంది..

సీఎం కేసీఆర్‌ దళితవాడకు వచ్చి ఇంటింటికీ తిరుగుతూ.. ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడగడం చూస్తే ఆ దేవుడే మా వాడకు వచ్చినంత సంతోషంగా ఉంది. గ్రామానికి వచ్చిన సీఎం కేసీఆర్‌ సారు దళిత బంధు పథకం ఇక్కడి నుంచే ప్రారంభించడం చాలా ఆనందం కలిగింది. మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాం. దళిత బంధును ప్రకటిస్తారని ఉహించలేదు. మా కుటుంబం మొత్తం కూలి పనిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. రూ.10లక్షలతో మాకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటు పాడి ఆవులను కొనుక్కొని సీఎం కేసీఆర్‌ సారు ఆకాంక్షించిన విధంగా ఆర్థికంగా ఎదుగుతాం. – జెర్రిపోతుల పోశమ్మ, గ్రామస్తురాలు, వాసాలమర్రి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana