బుధవారం 02 డిసెంబర్ 2020
Hyderabad - Sep 21, 2020 , 00:44:52

నిమిషాల్లో క్లూ.. గంటల్లో ఛేజింగ్‌

నిమిషాల్లో క్లూ.. గంటల్లో ఛేజింగ్‌

కేసుల వివరాలు ఆయా రాష్ట్రాలకు అందించడంలో సహకారం

సిటీ కమిషనరేట్‌కు గుండెకాయగా ‘టాస్క్‌ఫోర్స్‌'

అత్యాధునిక సాంకేతికత బృందంతో  నేరస్తుల ముఠాలపై నిరంతరం నిఘా

నగరంలోకి ప్రవేశించకుండా పకడ్బందీగా ఏర్పాట్లు

తెలంగాణ పరిపాలనలో పటిష్టమైన పోలీసింగ్‌ వ్యవస్థ

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నగర కమిషనరేట్‌కు నాలుగు స్తంభాలుంటే అందులో టాస్క్‌ఫోర్స్‌ ఒకటి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సంచలనాత్మక కేసులను గంటల వ్యవధిలో ఛేదిస్తూ కీలకంగా మారింది. సంఘటన ఏదైనా.. ఎక్కడైనా క్షణంలో రంగంలోకి దిగి ఆ టాస్క్‌ను ఛేదించేందుకు అవసరమయ్యే సమాచారాన్ని సంబంధిత రాష్ట్రాల పోలీసులకు చేరవేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది. నేరస్తులను పట్టుకోవడంలోనే కాదు.. ప్రశాంత వాతావరణంలో పండుగలు, వేడుకలు, సభలు, సమావేశాలు జరిగేలా.... ఆందోళన చేస్తే శాంతిభద్రతల పోలీసులను సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తూ పటిష్టమైన చర్యలు చేపడుతున్నది.

ఘటన ఎక్కడైనా.. సమాచారమందిస్తాం..

హైదరాబాద్‌లో జరిగే కేసులే కాకుండా, రాచకొండ, సైబరాబాద్‌, ఇతర జిల్లాలు, ఇతర కమిషనరేట్ల పరిధిలో అంతరాష్ట్ర దోపిడీ దొంగలు, హవాల, నకిలీనోట్ల చలామణి ముఠాలు, డ్రగ్స్‌ గ్యాంగ్‌లు నగరంలోకి ప్రవేశించకుండా ఎక్కడికక్కడే కట్టడి చేస్తున్నది టాస్క్‌ఫోర్స్‌. ఇతర రాష్ర్టాల్లో నేర ముఠాల కదలికలు, అక్కడ సంచలనాత్మక కేసులకు సంబంధించిన సమాచారాన్ని చేరవేయడం, ఇతర రాష్ర్టాల పోలీసులు ఇక్కడకు వచ్చినప్పుడు వాళ్లకు కావాల్సిన సమాచారం అందజేస్తూ సహకారమందిస్తున్నది. 

అన్ని అంశాలలో సాంకేతిక విశ్లేషణ..

తెలంగాణ ఏర్పడిన తరువాత హైదరాబాద్‌ పోలీసింగ్‌ వ్యవస్థ పటిష్టంగా ఏర్పాటైంది. రెండేండ్ల కాలంలో నగర టాస్క్‌ఫోర్స్‌ వ్యవస్థ సాంకేతికపరంగా మరింత బలంగా తయారైంది. నగర కమిషనరేట్‌లో ఐదు జోన్లకు టాస్క్‌ఫోర్స్‌ బృందాలుండగా... ఇవి నేరుగా నగర పోలీస్‌ కమిషనర్‌ పర్యవేక్షణలో కొనసాగుతుంటాయి. ఒక జోన్‌కు ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి బాధ్యుడుగా, వారిపైన వెస్ట్‌, సెంట్రల్‌, నార్త్‌ జోన్లకు డీసీపీ స్థాయి అధికారి, ఈస్ట్‌, సౌత్‌ జోన్లకు అదనపు డీసీపీ స్థాయి అధికారులు ఇన్‌చార్జీలుగా కొనసాగుతున్నారు. ఒక సంఘటన జరిగితే ఈ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు రంగంలోకి దిగి ఆ కేసులో నేరస్తులెవరు, నేరం జరిగేందుకు గల కారణాలను విశ్లేషించి ఆ కేసును ఛేదించేందుకు అవసరమయ్యే సమాచారాన్ని సంబంధిత పోలీసులకు చేరవేయడం వీటి విధి. ఇందుకు టాస్క్‌ఫోర్స్‌ తమ వద్ద ఉన్న ప్రత్యేకమైన సాంకేతిక బృందం సహాయంతో సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్‌ కాల్‌డాటా, ఈమెయిల్స్‌, సోషల్‌మీడియా విశ్లేషణలను వేగంగా చేపడుతూ... కావాల్సిన సమాచారాన్ని దర్యాప్తు అధికారులకు అందిస్తున్నది. ఈ ఏడాది 8 నెలల కాలంలో టాస్క్‌ఫోర్స్‌ ఇలా ఎన్నో కేసులను గంటల వ్యవధిలో ఛేదించి పోలీసింగ్‌ వ్యవస్థ పటిష్టంగా ఉందని నిరూపించింది.

నేరస్తులు తప్పించుకోలేరు

హైదరాబాద్‌కు పటిష్టమైన టాస్క్‌ఫోర్స్‌ వ్యవస్థ ఉంది. ఏ కేసైనా గంటల వ్యవధిలోనే ఛేదించే సత్తా టాస్క్‌ఫోర్స్‌కు ఉంది. ఇది కేవలం హైదరాబాద్‌కే కాకుంగా రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, కమిషనరేట్లకు సంబంధించిన సహకారాన్ని కూడా అందించడంలో ముందుంటుంది. అంతరాష్ట్ర ముఠాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆయా రాష్ర్టాల పోలీసులకు చేరవేయడం, అలాంటి ముఠా హైదరాబాద్‌లోకి రాకుండా కట్టడి చేయడంలో టాస్క్‌ఫోర్స్‌ విశేషమైన సేవలను అందిస్తున్నది. పటిష్టమైన హైదరాబాద్‌ పోలీసింగ్‌లో నేరస్తులు తప్పించుకునే అవకాశముండదు.

- హైదరాబాద్‌

పోలీస్‌ కమిషనర్‌

అంజనీకుమార్‌

టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఛేదించిన కేసుల వివరాలు

రూ. 17 కోట్ల హవాల డబ్బు స్వాధీనం 

21 టన్నుల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

వివిధ కేసుల్లో  21 మంది విదేశీయులు అరెస్ట్‌.

5 బందిపోటు ముఠాలు, 7 దోపిడీ ముఠాలు, 2 బలవంతపు వసూళ్ల గ్యాంగ్‌లు, ఖరీదైన హైహెండ్‌ కార్లను దొంగిలించే ఆరు ముఠాలను అరెస్ట్‌ చేశారు.

19 హత్య కేసుల ఛేదన, 9 డ్రగ్స్‌ కేసుల్లో 28 మంది అరెస్ట్‌, క్రికెట్‌ బెట్టింగ్‌లో 10 మంది, నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసే 4 గ్యాంగ్‌ల్లో  11 మంది, నకిలీ భూ పత్రాలు తయారు చేసే 11 మందితో పాటు వీఓఐపీ (వాయిస్‌ ఓవర్‌ ఇంటర్‌నెట్‌ ప్రోటోకాల్‌) కాల్స్‌ నిర్వహిస్తున్న ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. 

శాంతిభద్రతలకు విఘా కల్పించడం, బెట్టింగ్‌, ఇతరాత్ర నేరాలు చేసిన 782 మందిని అరెస్ట్‌ చేశారు. 

ఇతర జిల్లాలు, రాష్ర్టాలకు చెందిన 82 కేసుల ఛేదనలో సహకారం అందించారు.