ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Hyderabad - Dec 05, 2020 , 02:31:43

కూకట్‌పల్లిలో క్లీన్‌ స్వీప్‌

కూకట్‌పల్లిలో క్లీన్‌ స్వీప్‌

జంట సర్కిళ్ల గులాబీ గుబాళింపు 

కూకట్‌పల్లిలో ఆరింటికి ఆరు.. మూసాపేటలో ఐదింటికి నాలుగు సొంతం

కేపీహెచ్‌బీకాలనీలో తొలిసారిగా టీఆర్‌ఎస్‌ విజయం

కాంగ్రెస్‌, టీడీపీ డిపాజిట్లు మాయం

కేపీహెచ్‌బీ కాలనీ : కూకట్‌పల్లి, మూసాపేట జంట సర్కిళ్ల పరిధిలో గులాబీ జెండా రెపరెపలాడింది. కూకట్‌పల్లి సర్కిల్‌లోని ఆరు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మూసాపేట సర్కిల్‌లో నాలుగు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకోగా, ఒకటి మాత్రం బీజేపీకి దక్కింది. టీడీపీ కంచుకోట కేపీహెచ్‌బీకాలనీలో తొలిసారిగా టీఆర్‌ఎస్‌ జెండా ఎగిరింది. రాష్ట్ర ప్రభుత్వ సుపరిపాలన, సీఎం కేసీఆర్‌ పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, మంత్రి కేటీఆర్‌ పరిపాలనా దక్షత, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పనితీరును హర్షిస్తూ కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఏడు వార్డుల్లో, శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మూడు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ను ప్రజలు ఆదరించారు. ప్రతిపక్షాలు చేసిన అసత్య ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టి, అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌కే జై కొట్టారు. ఊహించిన విధంగానే కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజలు ఏకపక్ష తీర్పును వెలవరించడంతో పార్టీ అభ్యర్థులు విజయ ఢంకాను మోగించారు. 

ప్రతీ రౌండ్‌లో ఆధిక్యం..

జేఎన్టీయూ యూనివర్సిటీ ఆవరణలో మూసాపేట సర్కిల్‌కు చెందిన ఐదు వార్డుల ఓట్లను లెక్కించగా, హైదర్‌నగర్‌ రిషీ ఇంజినీరింగ్‌ కళాశాలలో కూకట్‌పల్లి సర్కిల్‌లోని ఆరు వార్డుల ఓట్లను లెక్కించారు. రెండు రౌండ్లుగా సాగిన ఓట్ల లెక్కింపులో ప్రతీ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఆధిక్యత ప్రదర్శించారు. అన్ని వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించగా మూసాపేట వార్డులో మాత్రం బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తర్వాత రెండోసారి జరుగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించడంతో శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసిన వెంటనే, విజేతలకు ధ్రువీకరణ పత్రాలు అందజేయగా, అభ్యర్థులంతా ఆనందోత్సవాల్లో మునిగితేలారు. అనంతరం ఆయా వార్డుల్లో బాణాసంచాలు పేలుస్తూ, స్వీట్లు పంచుతూ సంబురాలు చేసుకున్నారు.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కృతజ్ఞతలు

కూకట్‌పల్లి : కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలో ఏడు డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్‌ కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ఆదరించిన ప్రజలు కార్పొరేటర్‌ అభ్యర్థులను మళ్లీ ఒకసారి తమ ఓట్లతో ఆశీర్వదించారన్నారు. కూకట్‌పల్లి నియోజవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి మరింత బల చేకూరిందన్నారు. 

అత్యధికం.. అత్యల్పం..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గ్రేటర్‌ పోరులో తలపడ్డ కొందరు నల్లేరుపై విజయతీరాలకు చేరుకోగా, మరికొంత మంది మాత్రం అతికష్టం మీద బటయపడ్డారు. ప్రత్యర్థులను చిత్తుచేస్తూ సులభంగా విజయతీరాలకు చేరుకున్నారు. కొందరు అత్యధిక మెజార్టీతో గెలుపొందగా, మరికొందరు అత్య ల్ప మెజార్టీతో గట్టెక్కారు. 

అత్యధిక మెజార్టీలు..

నానల్‌నగర్‌లో నసీరుద్దీన్‌(ఎంఐఎం) 18,864ఓట్లు, తలాబ్‌ చంచలలో సమీనా బేగం(ఎంఐఎం) 17,454 ఓట్లు, ఫలక్‌కుమాలో తారాబాయి(ఎంఐఎం) 17,284 ఓట్లు, గోల్కొండ సమీనా యాస్మీన్‌(ఎంఐఎం) 17,250, జహనుమాలో ఎండీ అబ్దుల్‌ ముక్తదార్‌(ఎంఐఎం) 16,864 ఓట్లు, టోలిచౌకిలో అయేషా ఉమేరా(ఎంఐఎం) 16,517, నవాబ్‌సాహెబ్‌కుంటలో మహ్మద్‌ సలీం(ఎంఐఎం)  15,620, సులేమాన్‌ నగర్‌లో అబిదా సుల్తానా 12, 792 మెజార్టీలో విజయం సాధించారు.

అత్యల్ప మెజార్టీలు..

బీఎన్‌రెడ్డినగర్‌లో లక్ష్మీప్రసన్నగౌడ్‌(టీఆర్‌ఎస్‌)పై మొద్దు లచ్చిరెడ్డి(బీజేపీ) 32 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మచ్చబొల్లారంలో రాజ్‌ జితేంద్రనాథ్‌(టీఆర్‌ఎస్‌) 43 ఓట్లతో మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి శ్రవణ్‌కుమార్‌ 178 ఓట్లతో అడిక్‌మెట్‌లో సునీతా ప్రకాశ్‌గౌడ్‌ 227 ఓట్లతో హస్తినాపురంలో సుజాత(బీజేపీ ) 279 ఓట్లతేడాతో గెలిచారు.

రెండు, మూడు చోట్ల మినహా పదిలంగా పతంగి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మజ్లిస్‌కు కంచుకోటగా ఉన్న పాతబస్తీలో రెండు మూడు మినహా మిగిలిన అన్ని డివిజన్లలో పదిలంగా ఎగిరింది పతంగి పార్టీ. రెండు, మూడు  డివిజన్లు మినహా ఇతర అన్ని డివిజన్లలో ప్రత్యర్థుల పోరు లేకుండా ఏకఛక్రాదిపత్యాన్ని చాటుకున్నది. ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఎన్నికల ప్రచారంలో మైనార్టీ వర్గం ప్రజలు ఓవైసీ బ్రదర్స్‌ను తమ సమస్యలపై నిలదీయడం కనిపించింది. ఈ క్రమంలో దక్షిణ, పశ్చిమ మండలాల పరిధిలోని పాతబస్తీలో ఫిక్డ్స్‌ డిపాజిట్‌గా ఉన్న ఓటు బ్యాంకుకు కొంత గండిపడినప్పటికీ, చివరి గంటలో ఆ వెలితిని పతంగి వర్గాలు పూడ్చినట్లు ఆరోపణలొచ్చాయి. ఎన్నికలకు రెండు రోజుల ముందు నుంచి ఓట్ల లెక్కింపు వరకు పలు చోట్ల టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంబీటీ తదితర పార్టీల నాయకులు, కార్యకర్తలతో వాగ్వాదాలు, గలాటల నడుమ జరిపిన ఈ ఎన్నికల పేచీలో ఒక సీటు కట్‌ అయిపోగా, మిగిలిన 44సీట్లు పదిలంగా కాపాడుకోగలిగింది. పతంగి ఎగిరిన దాదాపు అన్ని డివిజన్‌లలో అత్యధిక మెజార్టీతోనే ఎంఐఎం వార్‌ వన్‌సైడ్‌ అన్నట్లుగానే దూసుకుపోయింది.

జోన్లవారీగా పార్టీలు గెలుచుకున్న స్థానాలు

జోన్‌ టీఆర్‌ఎస్‌ బీజేపీ ఎంఐఎం కాంగ్రెస్‌ మొత్తం

ఎల్బీనగర్‌ 6 15 0 2 23

చార్మినార్‌ 0 7 29 0 36

ఖైరతాబాద్‌ 5 9 13 0 27

శేరిలింగంపల్లి 13 1 0 0 15

కూకట్‌పల్లి 20 2 0 0 22

సికింద్రాబాద్‌ 11 14 1 0 26

మొత్తం 55 48 44 2 149


VIDEOS

logo