బుధవారం 28 అక్టోబర్ 2020
Hyderabad - Sep 26, 2020 , 00:44:02

సిటీ.. బిజీ బిజీ

సిటీ.. బిజీ బిజీ

నగరవాసులను వీడుతున్న కరోనా టెన్షన్‌

సాధారణ స్థితికి జనజీవనం.. పాతరోజులు మళ్లీ పునరావృతం 

రహదారులపై వాహనాల కిటకిట.. పూర్వస్థితికి వ్యాపారాలు

జాగ్రత్తలు పాటిస్తూ.. పనులపై దృష్టి 

జీవనంలో భాగమైన మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరాలు 


కరోనా పేరు చెబితేనే.. ఏదో తెలియని భయం.. ఆందోళన.. స్నేహితులు, ఆప్తులు ఇలా ఎవరికైనా పాజిటివ్‌ వచ్చిందంటే చాలు.. గుండె దడ రెట్టింపయ్యేది.. పల్స్‌ రేటు పెరిగిపోయేది.  అయ్యో.. అతనితో మాట్లాడానే.. ఇక నాకూ వైరస్‌ సోకుతుందేమోనన్న టెన్షన్‌..  ఎవరి నోట విన్నా... క్వారంటైన్‌..హోం ఐసొలేషన్‌ అనే పదాలే కదలాడేవి.. ఎక్కడ చూసినా.. కొవిడ్‌పై చర్చలే జరిగేవి.. కానీ ఇప్పుడు ఆ భయాలు వీడుతున్నాయి. కనిపించని శత్రువుతో ఎలా పోరాడాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నగరవాసులు అవగాహన పెంచుకున్నారు. ధైర్యంగా వైరస్‌పై యుద్ధం చేస్తున్నారు. మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరాలు జీవనంలో భాగం చేసుకున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు జాగ్రత్తలు పాటిస్తూ.. ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్నారు. మళ్లీ రహదారులపై ట్రాఫిక్‌ రద్దీ పెరిగింది. టిఫిన్‌ సెంటర్లు.. హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. ఇక ఐటీ కారిడార్‌లోనూ సందడి మొదలైంది. కొవిడ్‌కు ముందున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్యోగుల రాకపోకలతో హైటెక్‌సిటీ, రాయదుర్గం, సైబరాబాద్‌, గచ్చిబౌలి తదితర ప్రాంతాలన్నీ కళకళలాడుతున్నాయి. రోడ్లన్నీ ఆటోలు, క్యాబ్‌లు, బస్సులతో రద్దీని తలపిస్తున్నాయి. పల్లెకు వెళ్లిన వారు సైతం మళ్లీ ఉపాధి కోసం పట్నం బాటపడుతున్నారు. మొత్తంగా ‘జయము నిశ్చయమ్మురా.. భయమ్ము లేదురా’..అంటూ.. ముందుకు సాగిపోతున్నారు. 


తెరుచుకున్న విద్యాసంస్థలు.. 

కరోనా, లాక్‌డౌన్‌తో మూతబడ్డ విద్యాసంస్థలు ఇటీవలే తిరిగి తెరుచుకున్నాయి. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, కోచింగ్‌ సహా, నైపుణ్యశిక్షణా సంస్థలన్నీ తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. ప్రవేశ పరీక్షలు, కౌన్సెలింగ్‌లు, ఆన్‌లైన్‌ తరగతులు, డిజిటల్‌ క్లాసులు కొనసాగుతున్నాయి. పాఠ్యపుస్తకాల పంపిణీ సైతం పూర్తయింది. ఉపాధ్యాయుల్లో 50 శాతం మంది ప్రతిరోజూ విధులకు హాజరవుతున్నారు. ఆన్‌లైన్‌/డిజిటల్‌ తరగతులను పర్యవేక్షిస్తున్నారు. ఏకంగా విద్యార్థుల ఇండ్లకు వెళ్లి పర్యవేక్షణ జరుపుతున్నారు. మరికొందరు టీచర్లు ప్రత్యేక చొరవ తీసుకుని వాట్సాప్‌, జూమ్‌ యాప్‌ల ద్వారా బోధిస్తున్నారు. 

రోడ్లపై సాధారణ స్థితి..

లాక్‌డౌన్‌తో బోసిపోయి.. కరోనాతో వెలవెలబోయిన నగరం.. ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకుంది. ఇంట్లో కూర్చుంటే.. కుదరదని.. భయం వీడిన నగరవాసులు... ధైర్యం పెంచుకొని.. కరోనాతో సహజీవనం చేస్తూనే.. రోజు వారి కార్యకలపాలు చేసుకుంటున్నారు.  దీంతో రోడ్లపై ట్రాఫిక్‌ రద్దీ పెరుగుతున్నది. దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌.. హోటళ్ల వద్ద సందడి కనిపిస్తున్నది. కరోనాకు ముందు పనిదినాల్లో గంటకు 4 లక్షల వాహనాలు వెళ్లేవి. లాక్‌డౌన్‌ సమయంలో ప్రతి రోజూ 45 వేల వరకు తిరిగేవి. ప్రస్తుతం 3.3 లక్షల వాహనాల వరకు రాకపోకలు సాగిస్తున్నాయి. కొన్ని ప్రైవేట్‌ సంస్థలు వర్క్‌ ఫ్రం హోం అమలు చేస్తుండటం, విద్యాసంస్థలు ఇంకా పూర్తిస్థాయిలో తెరుచుకోకపోవడంతో అప్పటి కంటే కొద్దిమేరకు ట్రాఫిక్‌ తగ్గింది. కాగా, గత నెల 17న రోడ్లపై 1.60 లక్ష వాహనాలు తిరిగితే.. ఈనెల 3వ తేదీ నాటికి అది 2.4 లక్షలకు చేరింది. 25వ తేదీ నాటికి 3.3 లక్షల వెహికిల్స్‌ రోడ్లపైకి వచ్చేశాయి. 

ఐటీ కళకళ..

 టీటా నిర్వహించిన సర్వే ప్రకారం.. ఒక్క  ఐటీ ఉద్యోగిపై ఆధారపడి ముగ్గురు ఉపాధి పొందుతారు. ఆ లెక్కన హైదరాబాద్‌లో ఉన్న ఐటీ ఉద్యోగులు సుమారు 6 లక్షల మంది. వారిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నది సుమారు 18 లక్షల మంది అని సర్వే వెల్లడించింది. కరోనా కారణంగా లక్షల మందికి ఉపాధి దూరమైంది. పూర్వ పరిస్థితులు ఎప్పుడొస్తాయా? అని ఎదురుచూసిన వారికి కొన్ని రోజులుగా వ్యాపారాలు తిరిగి ప్రారంభం కావడం, ఆఫీసులు తెరుచుకోవడం, వాహనాల రాకపోకలతో బతుకుపై ఆశలు మొదలయ్యాయి. దుకాణాలు, హోటళ్లు, ఫుడ్‌ కోర్డులు, చాయ్‌ బండ్లు, షాపింగ్‌ మాల్స్‌ జనంతో కళకళలాడుతున్నాయి. క్యాబ్స్‌, ఆటోలు ప్రయాణికులతో సందడిని తలపిస్తున్నాయి. చాయ్‌ బండ్ల దగ్గర స్నేహితుల మాటామంతి మళ్లీ  మొదలైంది.మధ్యాహ్నం రోడ్ల పక్కన భోజనం అందించే వాళ్లు తమ కార్యకలాపాలు మొదలుపెట్టారు. రాత్రి వేళ టిఫిన్స్‌ అందించే వెహికిల్‌ ఫుడ్‌ కోర్టులు కస్టమర్లతో సందడిగా మారాయి. మరోవైపు డిసెంబర్‌ వరకు వర్క్‌ ఫ్రం హోం ఇవ్వాలని భావించిన కొన్ని కంపెనీలు తాజా పరిస్థితుల కారణంగా  పునరాలోచన చేస్తున్నాయి. 

పట్నం దారి..

వర్క్‌ ఫ్రం హోంతో సొంతూళ్లకు వెళ్లిన వాళ్లు తిరిగి పట్నం దారి పడుతున్నారు. కరోనా కేసులు తగ్గుతుండటంతో ఉద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఆఫీసుల నుంచి విధులకు హాజరవ్వాలని సందేశాలు రావడంతో పల్లెలకు వెళ్లిన వారు కుటుంబాలతో తిరిగి పట్నానికి వస్తున్నారు. ఇన్నాళ్లు హైదరాబాద్‌ను మిస్సయ్యామంటూ.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రవి శంకర్‌ తెలిపారు. ఆఫీసు నుంచి విధులకు హాజరవ్వాలని ఆదేశం వచ్చిందని సోమవారం నుంచి డ్యూటీ ఉంటుందని చెప్పారు. డిసెంబర్‌ వరకు వర్క్‌ ఫ్రం హోం అని ప్రకటించిన కంపెనీ సోమవారం నుంచి కార్యకలాపాలకు హాజరవ్వాలని మెయిల్‌ చేసిందని మరో ఉద్యోగి శ్రీధర్‌ తెలిపారు. 

జోరందుకున్న మెట్రో..

కరోనాతో మార్చి నుంచి సెప్టెంబర్‌ 6 వరకు మెట్రోకు బ్రేకులు పడిన విషయం తెలిసిందే. ఈనెల 7న తిరిగి ప్రారంభమైన సేవలు.. కొవిడ్‌ జాగ్రత్తలతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నది. ఒక్కో కారిడార్‌లో ప్రయాణికుల సంఖ్య 40 వేలు దాటుతున్నదని అధికారులు చెబుతున్నారు. కాగా, మియాపూర్‌- ఎల్బీనగర్‌, నాగోల్‌ నుంచి రాయదుర్గం, ఎంబీజీబీఎస్‌ నుంచి జేబీఎస్‌ కారిడార్‌లోని రైల్వే స్టేషన్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. కరోనా నిబంధనలు పటిష్టంగా అమలు చేయడంతో ప్రయాణికులు ధైర్యంగా ప్రయాణం చేసేందుకు ముందుకొస్తున్నారు.

30 శాతం పెరిగిన ఓపీ..

కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుండటంతో గ్రేటర్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఓపీ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. మొన్నటి వరకు ఉస్మానియా దవాఖానలో రోజుకు 300 నుంచి 500 వరకు వచ్చిన ఓపీ రోగుల సంఖ్య.. శుక్రవారానికి 1300కు చేరుకుందని, ప్రతిరోజూ అత్యవసర కేసులు 100 నుంచి 150 వస్తున్నట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ తెలిపారు. సాధారణ రోజుల్లో ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌ వంటి దవాఖానలకు ప్రతిరోజూ 2000-2500 మంది ఓపీ రోగులు వచ్చే వారని కరోనాతో ఆ సంఖ్య 200 నుంచి 300 పడిపోయినట్లు వివరించారు.

logo