e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 27, 2021
Home హైదరాబాద్‌ కనుపాపల్ని కాపాడుకుందాం..!

కనుపాపల్ని కాపాడుకుందాం..!

 • పక్కింటోళ్లు ఎలాంటి వారో తెలుసుకోవాలి
 • కామాంధుల నుంచి చిట్టి తల్లులను రక్షించుకోవాలి
 • గుడ్‌టచ్‌, బ్యాడ్‌ టచ్‌లపై పిల్లలకు అవగాహన కల్పించాలి
 • అసభ్యంగా ప్రవర్తిస్తే బిగ్గరగా అరవాలనే విషయం తెలుపాలి
 • పేరెంట్స్‌కు మానసిక నిపుణుల సూచనలు

సిటీబ్యూరో, సెప్టెంబర్‌ 16(నమస్తే తెలంగాణ) : మీ చిన్నారులు బయటికి వెళ్తే అనుక్షణం ఓ కన్నేసి ఉంచండి. ఏమరుపాటు పనికిరాదు.. అప్రమత్తంగా లేకపోతే.. పెను ప్రమాదం తప్పదు. అది ఇంటి పక్క నుంచే కావొచ్చు. ఇందుకు సైదాబాద్‌ చిన్నారి ఘటనే ఉదాహరణ. ఈ ఘటన సభ్యసమాజాన్ని కదలించివేసింది. తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి దాపురించింది. చిన్నారులను కామాంధుల కంట పడకుండా కాపాడుకోవాల్సిన స్థితి ఏర్పడింది. ఒక్కటే మార్గం.. తమ పిల్లలకు జాగ్రత్తలు నేర్పించడం ఎంతో అవసరం. వారికి గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌లపై అవగాహన కల్పించాలి. ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే.. బిగ్గరగా అరవాలని సూచించాలి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారు తమ పిల్లల పట్ల మరింత అలర్ట్‌గా ఉండాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

సైకో మెట్రిక్‌ టెస్టులు చేయించాలి

పిల్లలను ఒంటరిగా వదలడం ప్రమాదకరం. ఎంత దగ్గరివాైళ్లెనా సరే వారిని నమ్మకపోవడమే ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచిది. ఏదైనా అత్యవసర పనిమీద బయటకు వెళ్లాలనుకునే పేరెంట్స్‌ తమ పిల్లలను వెంట తీసుకెళ్లాలి. ఎవరూ అపరిచితులు? ఎవరు దగ్గరివాళ్లు? అనే విషయాలపై చిన్నారులకు స్పష్టత ఇవ్వాలి. ఎవరైనా పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటే.. వెంటనే అరవాలనే విషయాన్ని తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సైకోమెట్రిక్‌ టెస్టులు చేయించాల్సిన అవసరం ఉంది. స్కూళ్లు, కాలేజీలు, ఇతర అన్నీ ఆర్గనైజేషన్‌లలో దీనిని చేపట్టాలి. తద్వారా ఎలాంటి మానసిక రుగ్మతలతో ఎవరెవరూ బాధపడుతున్నారో తెలుస్తుంది. వారిని సైకియాట్రిస్టు దగ్గరకు పంపిస్తారు. నేరాలు చేసి జైలుకు వెళ్లిన వారి ప్రవర్తన ఎలా ఉందో జైళ్ల శాఖ వారి ప్రొఫైల్‌ రెడీ చేయాలి. ఇలాంటి ఆటిట్యూడ్‌ ఉన్నవారు ఏ తరహా నేరాలకు పాల్పడుతున్నారో గుర్తించి మేల్కోవచ్చు. – డాక్టర్‌ సి.వీరేందర్‌, సైకాలజిస్టు

మానసిక పరిస్థితిపై ఆరా తీయాలి

- Advertisement -

ఎదుటి వారు ఏ ఆలోచనలతో ఉంటున్నారో గుర్తించడం కష్టం. అలాంటప్పుడు పిల్లలను అంటిపెట్టుకుని ఉండాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. చుట్టుపక్కల వాళ్లు ఎలాంటి వాళ్లో ఓ అవగాహన ఉండాలి. వారి మానసిక పరిస్థితి ఆరా తీయాలి. పిల్లలను అన్ని విషయాల్లో గమనించాలి. వారి ప్రవర్తనపై దృష్టి పెట్టాలి. ఎవరైనా అవకాశం కోసం ఎదురు చూస్తుంటారనే విషయం గుర్తుంచుకోవాలి. ఉద్యోగులు తమ పిల్లలను ఇంట్లో వదిలి వెళ్లిపోతారు. అలాంటి వారు మరింతగా అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు ఎవరిని కలుస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? తెలుసుకోవాలి. -మోత్కూరి రాంచందర్‌, కౌన్సెలింగ్‌ సైకాలజిస్టు

ఈ విషయాలపై అవగాహన పెంచుకోండి

 • మీ పిల్లల రోజు వారీ కార్యకలాపాలపై దృష్టి పెట్టండి.
 • ఎవరిని కలుస్తున్నారు? ఎవరి ఇంటికి వెళుతున్నారు? ఎంత సమయం ఉంటున్నారు? వారి ఇంట్లో అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారా? తదితర విషయాలపై పూర్తి స్పష్టత కలిగి ఉండాలి.
 • చిన్నారులకు గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌పై అవగాహన కల్పించాలి.
 • ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితుల ఇంటికి పంపించకూడదు. పక్కింటి వారే కదా అని విడిచిపెట్టకూడదు.
 • ఉద్యోగాలు చేసే వాళ్లు తమ పిల్లల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి.
 • ఎవరి ఇంట్లోకైనా వెళ్లొస్తే..ఆ కుటుంబీకులు పిల్లలతో ఎలా మాట్లాడుతున్నారు? ఎలా వ్యవహరిస్తున్నారో తదితర విషయాలు అడిగి తెలుసుకోవాలి.
 • చాక్లెట్స్‌, బిస్కట్స్‌ తదితర తినుబండారాల జోలికి వెళ్లకూడదని వారికి తెలియజేయాలి. ఎవరిచ్చినా తినకూడదనే షరతులు విధించాలి.
 • అద్దె ఇండ్లల్లో ఉంటున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. చుట్టు పక్కల వాళ్ల గురించి పెద్దగా అవగాహన ఉండదు. అలాంటి సమయంలో చిన్న పిల్లలు ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి.
 • ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరినీ నమ్మి పిల్లలను అప్పజెప్పకూడదు.
 • పిల్లలకు తల్లిదండ్రుల మొబైల్‌ నంబర్‌, డయల్‌ 100 నంబర్లను కచ్చితంగా కంఠస్థం చేయించాలి.
 • తెలిసిన వారైనా సరే మద్యపానం అలవాటు ఉన్న వారి వద్దకు పిల్లలను పంపించకూడదు.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement