e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home హైదరాబాద్‌ పిల్లల విషయంలో నిర్లక్ష్యం తగదు

పిల్లల విషయంలో నిర్లక్ష్యం తగదు

పిల్లల విషయంలో నిర్లక్ష్యం తగదు
  • వారిని కాపాడటం పెద్దల బాధ్యత
  • స్వల్ప జాగ్రత్తలతో కరోనాకు దూరం
  • నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో పీడియాట్రిక్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శ్రీలత

హైదరాబాద్‌ సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో చిన్నారులను కాపాడుకునేందుకు తల్లిదండ్రులు దృష్టిపెట్టాలని నిలోఫర్‌ చిన్నపిల్లల ప్రభుత్వ దవాఖాన పిడియాట్రిక్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శ్రీలత మార్త సూచించారు. పిల్లలకు అంతగా వైరస్‌ సోకడం లేదు కాబట్టి.. వచ్చినా వ్యాధి తీవ్రత అంతంత మాత్రమే అనే నిర్లక్ష్య ధోరణి వీడాలని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కరోనా బారిన పడకుండా తల్లిదండ్రులు అనుసరించాల్సిన విధానాలను ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో డాక్టర్‌ శ్రీలత వివరించారు. ఇవీ వివరాలు..

పిల్లలను నిత్యం గమనిస్తుండాలి..

పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా నాలుగేండ్లలోపు పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. ఆపై వయసు పిల్లలకు జాగ్రత్తలు చెప్తే కొంతమేర పాటిస్తారు. పిల్లలు ఒకచోట కుదురుగా ఉండరు. ఇండ్లకే పరిమితమైనా వారు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి. పిల్లలు తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. నాలుగేండ్లు పైబడిన పిల్లలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించేలా చూడాలి. నవజాత శిశువుల్లో.. తల్లికి కరోనా ఉంటే బిడ్డను కొంచెం దూరంగా ఉంచి జాగ్రత్తలు పాటిస్తూ తల్లి పాలివ్వాలి. తల్లిపాల నుంచి కరోనా సోకదు.

నోరు, ముక్కు ద్వారానే..

కరోనా వైరస్‌ నోరు, ముక్కు, కండ్ల ద్వారా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఆ వైరస్‌ సోకిన వారు తుమ్మినా, దగ్గినా, మాట్లాడినా నోటి తుంపర్ల ద్వారా ఎదుటివారికి సోకే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల్లో ఎక్కువగా నోట్లో, ముక్కులో వేలు పెట్టుకోవడం, కండ్లను తుడుచుకోవడం, ముఖాన్ని తడుముకోవడం వంటి అలవాట్లు ఉంటాయి. ఇంట్లో ఇలాంటివి చేయకుండా పిల్లలను చూడాలి. ప్రస్తుతం పెద్దవాళ్లు, పిల్లల్లో వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్నది. పెద్దవారిలో దగ్గు, జలుబు, ఆయాసం వంటివి ఉంటే.. పిల్లలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే.. పిల్లల్లో అంటువ్యాధులు వేగంగా ప్రవేశిస్తాయి. లాక్‌డౌన్‌ వెసులుబాటు సమయంలో పెద్దలు బయటకు వెళ్లి వస్తే.. భౌతికదూరం పాటించాలి.. ఇంటికి రాగానే చేతులు శుభ్రం చేసుకోవాలి.

పేరెంట్స్‌ రోల్‌మోడల్‌గా ఉండాలి

ప్రస్తుత పరిస్థితుల్లో తమ పిల్లలకు పేరెంట్స్‌ రోల్‌మోడల్‌గా ఉండాలి. స్కూళ్లు లేకపోవడం, ఇంటికే పరిమితం కావడం వల్ల పిల్లలు మానసికంగా, శారీరకంగా అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితిలో చిన్నారులకు ఇంట్లోనే వారికి నచ్చిన అంశంలో ఎంగేజ్‌ అయ్యేలా చూడాలి. స్కూల్‌కు వెళ్లి చదవడం.. ఆన్‌లైన్‌ చదువులను పోల్చకూడదు. లాక్‌డౌన్‌ వల్ల ఇంటికే పరిమితమైన పిల్లలు ఫిజికల్‌, మెంటల్‌గా ఎఫెక్ట్‌ కాకుండా తగిన ప్రిపరేషన్‌ ఉండాలి. జంక్‌, ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ కాకుండా ఇంట్లో వేడిగా ఎప్పటికప్పుడు ఆహారం అందించి ఇమ్యునిటీ పెంచేలా దృష్టిపెట్టాలి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పిల్లల విషయంలో నిర్లక్ష్యం తగదు

ట్రెండింగ్‌

Advertisement