సోమవారం 06 జూలై 2020
Hyderabad - Jun 30, 2020 , 01:50:40

యూవీతో కరోనాకు చెక్‌

యూవీతో కరోనాకు చెక్‌

శానిటైజ్‌ చేయలేని వస్తువుల కోసం కృత్రిమ పరికరం 

రూపొందించిన ఉస్మానియా యూనివర్సిటీ 

అతినీలలోహిత కిరణాలతో మహమ్మారిపై పోరు

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తున్నది. శానిటైజర్లు, మాస్కులు వాడుతూ జాగ్రత్త పడుతున్నా.. ప్రతిరోజూ ఎన్నో నిత్యావసర వస్తువులను తాకే క్రమంలో ప్రమాదం పొంచి ఉంది. దీనికి పరిష్కారాన్ని కనిపెట్టింది ఉస్మానియా యూనివర్సిటీ. ఫోన్‌, లాప్‌టాప్‌, సోఫాలు, టేబుల్స్‌, కార్లు, ఆఫీస్‌ ఫైల్స్‌.. ఇలా శానిటైజ్‌ చేయలేని వాటిపై ఉండే వైరస్‌ను అంతమొందించే పరికరాన్ని అభివృద్ధి చేసింది. ఈ పరికరాన్ని యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొ.ఎం.కుమార్‌, ఎలక్ట్రికల్‌ విభాగం హెడ్‌ ప్రొ.జి.మల్లేశం, ఇండస్ట్రీ నిపుణులు డా. ఏఎం. కృష్ణ తదితరులు ఆవిష్కరించారు.

యంత్రం పనితీరు..

ఈ పరికరం అరచేతిలో పట్టే పరిమాణంలో ఉంటుంది. విద్యుత్‌కు అనుసంధానం చేసినప్పుడు దీని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు 220 ఏఎం వేగంతో అరమీటరు పైనే ప్రసరిస్తాయి. కిరణాలను మనం వాడే వస్తువులపై ప్రసరింపజేస్తే వైరస్‌ పూర్తిగా నశించే అవకాశం ఉంటుంది. ఈ పరికరం సుమారు ఐదున్నరేండ్ల (50 వేల పని గంటలు)వరకు పని చేస్తుంది. సమయం అయిపోయాక కూడా ఒక బల్బులాంటి పరికరాన్ని అమర్చి తిరిగి వాడే అవకాశం ఉంటుందని ప్రొ. మల్లేశం తెలిపారు.

ఓయూలో ఆవిష్కరణ..

ఓయూలోని ఇంజినీరింగ్‌ కళాశాల ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం హెడ్‌ ప్రొ.డా.మల్లేశంతో పాటు ఇండస్ట్రీ నిపుణులు డా.ఏఎం కృష్ణ ఆధ్వర్యంలో యూవీ-సీ అనే కృత్రిమ ఎలక్ట్రికల్‌ పరికరాన్ని కనుగొన్నారు. వస్తువులపై ఉన్న వైరస్‌ను అతినీలలోహిత కిరణాల ద్వారా ఇది నశింపజేస్తుందని ప్రయోగాత్మకంగా రుజువు చేశారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ పరిశోధనల్లో 220 నానో మీటర్ల తరంగ దైర్ఘ్యం గల యూవీ కిరణాలు ఎలాంటి బ్యాక్టీరియానైనా నశింపచేస్తాయని వెల్లడైంది. 250 నానో మీటర్ల సామర్థ్యం కంటే అధికంగా ఉంటే చర్మం కాలిపోవడం, ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని తేలింది. ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో రూపొందించిన ఈ పరికరం ద్వారా మనిషి చర్మం, కళ్లకు ఎలాంటి హాని లేకుండా కిరణాలు ప్రమాదకరమైన వైరస్‌ను అంతం చేస్తాయని ప్రొ.డా.మల్లేశం వివరించారు.

త్వరలో మరో పరికరాన్ని రూపొందిస్తా..

నా స్నేహితుడు కారు ఎక్కే సమయంలో చేతులకు శానిటైజర్‌ పెట్టుకోవడం చూసి నాకు ఓ ఆలోచన వచ్చింది. శానిటైజర్‌ పెట్టుకున్నాక మనం పట్టుకునే పరికరాలపై ఉండే వైరస్‌ను ఏ విధంగా అంతం చేయాలనే దానిపై అధ్యయనం చేసి ఈ పరికరాన్ని రూపొందించాం. త్వరలో మరో అధునాతన పరికరాన్ని తయారు చేసే ఆలోచనలో ఉన్నాను. ఇంటి డోర్‌కు పరికరాన్ని అమర్చితే స్కానింగ్‌ ద్వారా వైరస్‌ను అంతం చేసేలా పరికరాన్ని అభివృద్ధి చేస్తా.

- ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాల ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం హెడ్‌ ప్రొ.డా.మల్లేశంlogo