శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Hyderabad - Jul 04, 2020 , 00:43:01

చిట్టీల పేరుతో చీటింగ్‌

చిట్టీల పేరుతో చీటింగ్‌

అమాయకులకు వల.. సుమారు రూ. 10 కోట్ల వరకు మోసం

నిందితుడి ఆస్తులు అటాచ్‌ చేయాలని ఆదేశించిన ప్రభుత్వం

చర్యలకు ఉపక్రమించిన సీసీఎస్‌ పోలీసులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: చిట్టీల పేరుతో అమాయకులను ముంచిన ఓ ఘరానా మోసగాడి ఆస్తులను సీసీఎస్‌ పోలీసులు అటాచ్‌ చేశారు. తార్నాకకు చెందిన మామిడి మాణిక్‌రెడ్డి చిరు వ్యాపారాల నుంచి చిట్టీలు కట్టించుకోవడమే కాకుండా అధిక వడ్డీలు ఇస్తానంటూ..  రూ. 10 కోట్ల వరకు డబ్బులు వసూలు చేసి మోసం చేశాడని.. పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై 2017లో సీసీఎస్‌ పోలీసులు  కేసు(203/2017 ) నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితులు ఇచ్చిన సమాచారంతో ఎంత మొత్తం మోసం జరిగిందనే విషయంపై పోలీసులు నిర్ధారించి, ఈ కేసులో కోర్టుకు చార్జిషీట్‌ను కూడా దాఖలు చేశారు. ఈ క్రమంలో డిపాజిటర్స్‌ యాక్ట్‌ ప్రకారం ఈ కేసులో ప్రధాన నిందితుడైన మామిడి మాణిక్‌రెడ్డితో పాటు మామిడి రేణుక,  రాజేశ్‌రెడ్డి, చందన కసిరెడ్డి పేర్లపై ఉన్న ఆస్తులను అటాచ్‌ చేయాలంటూ మార్చిలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వచ్చిన వెంటనే లాక్‌డౌన్‌ ప్రారంభం కావడంతో పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఈ ఉత్తర్వులపై తాజాగా సీసీఎస్‌ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు.  తార్నాకలో ఉన్న ఇల్లుతో పాటు వనస్థలిపురం, ల్యాంకో హిల్స్‌, బాలాపూర్‌, కొత్తూరు మండలం పెంజర్లలో ఉన్న వ్యవసాయ భూమిని అటాచ్‌ చేశారు. ప్రధాన నిందితుడితో పాటు కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఇండ్లలో ఉన్న కిరాయి దారులకు కూడా నోటీసులు అందించారు. ప్రత్యేకంగా ఒక ఖాతాను తెరిచి, ఇంటి కిరాయిలు అందులో డిపాజిట్‌ చేయాలని సూచించామని కేసు దర్యాప్తు చేస్తున్న సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ గోవిందారెడ్డి తెలిపారు.  ప్రధాన నిందితుడైన మాణిక్‌రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా పెంజర్ల. అతడు కుటుంబసభ్యులతో వచ్చి తార్నాకలో స్థిరపడ్డాడు. ఈ క్రమంలోనే స్థానికులతో పాటు వివిధ కూరగాయల మార్కెట్లలో పనిచేసే వారిని లక్ష్యంగా చేసుకొని చిట్టీలు కట్టించుకొని..పక్కా ప్లాన్‌గా అమాయకులను మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 


logo