సోమవారం 30 నవంబర్ 2020
Hyderabad - Oct 22, 2020 , 08:37:15

తక్కువ ధరకు బంగారమంటూ మోసం

తక్కువ ధరకు బంగారమంటూ మోసం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మోసగాడిని హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. డీసీపీ అవినాష్‌ మహంతి కథనం ప్రకారం.. అమీర్‌పేట్‌కు చెందిన కోటేశ్వరరావు గుప్తా వద్ద నుంచి గుంటూర్‌ జిల్లాకు చెందిన కోట రాకేశ్‌ అనే వ్యక్తి తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానంటూ నమ్మించి రూ.1.7కోట్లు తీసుకొని మోసం చేశాడని గత ఏడాది సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అప్పటినుంచి పరారీలో ఉన్న నిందితుడు కోట రాకేశ్‌ అలియాస్‌ కొమరవెళ్లి హరిశంకర్‌ అలియాస్‌ జంపన్న సురేశ్‌ను కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబల్లాపూర్‌ జిల్లాలో అరెస్ట్‌ చేసి, హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఇతని వద్ద నుంచి ఆరు ఓటరు కార్డులు, ఐదు పాన్‌కార్డులు, ఒక ఆర్‌సీ, మూడు డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, 8 ఆధార్‌ కార్డులు, ఐదు మొబైల్‌ ఫోను,్ల  8 నకిలీ బంగారు బిస్కెట్లు, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఏసీపీ రామ్‌కుమార్‌ నేతృత్వంలో ఎస్సై లక్ష్మీనారాయణ బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తూ,  నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు.