గురువారం 03 డిసెంబర్ 2020
Hyderabad - Oct 23, 2020 , 07:22:55

పాత నగరంలో కేంద్ర బృందం పర్యటన

పాత నగరంలో కేంద్ర బృందం పర్యటన

వరద ఉధృతి, నష్టాన్ని వివరించిన స్థానికులు

కేంద్రం సహాయం అందించాలని ఒవైసీ విజ్ఞప్తి

చెరువు కట్టలు పటిష్టం చేయాలన్న బృందం సభ్యులు

నష్టాన్ని కేంద్రానికి నివేదిస్తామని హామీ

వరద పరిస్థితిని అధ్యయనం చేసేందుకు నియమించిన కేంద్ర బృందం గురువారం నగరానికి చేరుకుంది. పాతనగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించింది.  మొదటిరోజు ముంపునకు గురైన కాలనీలు, ఇండ్లు, దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జీలు, చెరువులతోపాటు పునరుద్ధరణ పనులను పరిశీలించింది. వరద మిగిల్చిన విషాదాన్ని స్థానికులు ఈ సందర్భంగా కేంద్ర బృందానికి వివరించారు. చెరువు కట్టలు పటిష్ఠ పర్చాల్సిన అవసరం ఉందని, నష్టంపై కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని కేంద్ర బృందం సభ్యులు ప్రజలకు హామీ ఇచ్చారు. 

నగర పర్యటనలో భాగంగా చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా వద్ద దెబ్బతిన్న ఆర్‌వోబీ, ముంపునకు గురైన ప్రాంతాలను కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి  ప్రవీణ్‌ వశిష్ఠ నేతృత్వంలోని కేంద్ర బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు వరద బాధితులతో మాట్లాడారు. ఆర్‌వోబీకి రెండు వైపులా చేపట్టిన పునరుద్ధరణ, నాలా పూడికతీత పనులను పరిశీలించారు. భారీ వర్షాలు, వరదలతో తమ ఇండ్ల గ్రౌండ్‌ఫ్లోర్‌తోపాటు మొదటి అంతస్తులోకి కూడా నీరు వచ్చినట్లు బాధితులు కేంద్ర బృందానికి వివరించారు. 10 రోజులపాటు నీటిలో నానడంతో ఇంటి గోడలు దెబ్బతిన్నాయని తెలిపారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, చీఫ్‌ ఇంజినీర్‌ జియావుద్దీన్‌ మాట్లాడుతూ ఫలక్‌నుమా ఆర్‌వోబీ 40ఏండ్ల క్రితం నిర్మించినట్లు చెప్పారు. ఈ ఆర్‌వోబీ ద్వారా ఇన్నర్‌ రింగురోడ్డు, చార్మినార్‌ ప్రాంతాలకు రోడ్డు సదుపాయం అనుసంధానం అయినట్లు వివరించారు. పల్లె చెరువు కట్ట తెగిపోవడంతో వరదతో ఈ ప్రాంతానికి అపార నష్టం జరిగిందని వివరించారు. కాలనీల ముంపుతోపాటు రైల్వే ఓవర్‌ బ్రిడ్జి రీటెయినింగ్‌ వాల్‌ దెబ్బతిన్నట్లు చెప్పారు. రోడ్డుపై ఐదు మీటర్ల ఎత్తువరకు నీరు నిలిచినట్లు తెలిపారు.
అనంతరం కేంద్ర బృందం కందికల్‌గేట్‌ వద్ద ఉన్న నాలా పునరుద్ధరణ పనులను పరిశీలించింది. ఆ తరువాత చాంద్రాయణగుట్ట ఫూల్‌బాగ్‌లోని వరద ముంపు ప్రాంతాల ప్రజలతో బృందం సభ్యులు మాట్లాడారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు అసదుద్దీన్‌ ఒవైసీ వరదతో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించారు. నష్టపోయిన ప్రజలను కేంద్రం ఆదుకోవాలని కోరారు.  అనంతరం బాలాపూర్‌ హఫీజ్‌బాబా నగర్‌లో కేంద్ర బృందం పర్యటించింది. పల్లె చెరువు, గుర్రం చెరువు కట్టలు తెగిపోవడంతో స్థానిక బస్తీలు, కాలనీలు ముంపునకు గురైనట్లు స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ వశిష్ఠ మాట్లాడుతూ ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చెరువు కట్టల పటిష్ఠతపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నారు. చెరువుల నిర్వహణ చూస్తున్న నీటి పారుదల శాఖ పనితీరును వారు వాకబు చేశారు. పల్లె చెరువుకు పడిన గండి, కట్ట పునరుద్ధరణ, పటిష్ఠతకు చేపడుతున్న చర్యలను పరిశీలించారు. చెరువుకట్ట లోపల నిర్మించిన కృష్ణా వాటర్‌ పైప్‌లైన్‌కు నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని తాగునీటి సరఫరాను కొనసాగిస్తున్నట్లు నీటి పారుదలశాఖ ఎస్‌ఈ భీమ్‌ప్రసాద్‌ కేంద్ర బృందానికి వివరించారు. సెంట్రల్‌ విజిలెన్స్‌ విభాగం ఆమోదించిన ప్రతిపాదనల ప్రకారమే చెరువు కట్టకు శాశ్వత మరమ్మతులు చేపట్టినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ పల్లెచెరువుకు గండి పడడంతో వచ్చిన వరదతోపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు బాలాపూర్‌, హఫీజ్‌బాబా నగర్‌పై తీవ్ర ప్రభావం చూపాయన్నారు. అధికార యంత్రాంగం మూడురోజులు శ్రమించి వరద ప్రభావాన్ని తగ్గించినట్లు తెలిపారు. సాయంత్రం అప్పాచెరువు, గగన్‌పహాడ్‌ వద్ద కేంద్ర బృందం సభ్యులు నాలాను పరిశీలించారు. గండి పూడ్చివేతకు చేస్తున్న మరమ్మతు పనులను పర్యవేక్షించారు. అప్పా చెరువుకు పడిన గండి, నాలా పొంగిపొర్లడంతో పలు కాలనీలు ముంపునకు గురయ్యాయని, వాహనాలు వరదలో కొట్టుకుపోయినట్లు అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. కేంద్ర బృందం సభ్యులు జలవనరుల విభాగం సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ ఎం. రఘురాం, రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, హైవేస్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ ఎస్‌.కె. కుష్వారా, రాష్ట్ర డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేత మహంతి ఉన్నారు.