శనివారం 27 ఫిబ్రవరి 2021
Hyderabad - Oct 24, 2020 , 06:58:34

రెండో రోజూ కేంద్ర బృందం పర్యటన

రెండో రోజూ కేంద్ర బృందం పర్యటన

నగరంలోని ముంపు ప్రాంతాల్లో రెండోరోజూ కేంద్ర బృందం పర్యటించింది. ఎల్బీనగర్‌, ఖైరతాబాద్‌ జోన్లలో ఉప్పొంగిన చెరువులు, నాలాలు, దెబ్బతిన్న ఇండ్లను హోం శాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్‌ వశిష్ఠ నేతృత్వంలో శుక్రవారం పరిశీలించింది. బాధిత కుటుంబాలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నది. వరద సమస్యకు శాశ్వత పరిష్కారంగా మూసీకి అనుసంధానంగా ఉన్న నాలాల విస్తరణకు డిజైన్లు రూపొందించే బాధ్యతను కన్సల్టెన్సీకి అప్పగించనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు వివరించారు.

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగరంలోని ముంపు ప్రాంతాల్లో రెండోరోజు శుక్రవారం ఎల్బీనగర్‌, ఖైరతాబాద్‌ జోన్లలోని వివిధ ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. చెరువులు, నాలాలు పొంగిపొర్లి జనావాసాలను ముంచెత్తిన తీరును పరిశీలించింది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్‌ వశిష్ఠ నేతృత్వంలో కేంద్ర జన వనరుల విభాగం సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ ఎం. రఘురామ్‌, కేంద్ర రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ విభాగం సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ ఎస్‌.కె. కుష్వారా నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి వివరాలు సేకరించారు.  ఈ సందర్భంగా ముంపు నష్టాన్ని బాధితులు ఏకరువు పెట్టగా, ప్రజలకు జరిగిన ఆస్తి నష్టంతోపాటు దెబ్బతిన్న రోడ్లు, చెరువు కట్టల వివరాలను అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. నాగోలు, బండ్లగూడ ప్రాంతాలను సందర్శించి ముంపు వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించారు. కొట్టుకుపోయిన రోడ్లు, పేరుకున్న బురద, ఇండ్లకు జరిగిన నష్టాన్ని స్వయంగా చూసిన కేంద్ర బృందం సభ్యులు..ఎల్బీనగర్‌ జోన్‌ హయాత్‌నగర్‌ సర్కిల్‌ నాగోల్‌ రాజరాజేశ్వరి కాలనీలో ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించారు. కర్మన్‌ఘాట్‌ మేఘా ఫంక్షన్‌హాల్‌ సమీపంలో పక్క నుంచి వెళ్తున్న మీర్‌పేట్‌ నాలాను, బైరామల్‌గూడ నాలా నుంచి వచ్చిన వరద నీటితో ముంపునకు గురైన కాలనీలను పరిశీలించి, స్థానికులతో మాట్లాడారు. అనంతరం సరూర్‌నగర్‌ చెరువును పరిశీలించారు. టోలిచౌకీలోని విరాసత్‌నగర్‌, బాల్‌రెడ్డి నగర్‌, నదీంకాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి సాతం చెరువు నీటి ఉధృతితో ముంపునకు గురైన కాలనీలు, రోడ్లను చూశారు. తుక్కుగూడ, రావిర్యాల తదితర ప్రాంతాల్లో  కొట్టుకుపోయిన రోడ్లను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి ఆస్తినష్టం గురించి ఆరా తీశారు. బల్దియా చీఫ్‌ ఇంజినీర్‌ జియావుద్దీన్‌, జోనల్‌ కమిషనర్లు ఉపేందర్‌రెడ్డి, ప్రావీణ్య తదితరులు కేంద్ర బృందం సభ్యులతో పాటు పర్యటించి వరద పరిస్థితి, ప్రభుత్వపరంగా చేపట్టిన సహాయ, పునరావాస, పునరుద్ధరణ చర్యలను వారికి వివరించారు. వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం మూసీకి అనుసంధానంగా ఉన్న నాలాల విస్తరణ కోసం అనువైన డిజైన్లు రూపొందించేందుకు కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిపారు. మీర్‌పేట్‌, బైరామల్‌గూడ చెరువుల నాలాలు ఉధృతంగా ప్రవహించడంతో ఉదయ్‌నగర్‌, మల్‌రెడ్డి రంగారెడ్డి నగర్‌, తపోవన్‌కాలనీ తదితర చోట్ల దాదాపు రెండు వేల ఇండ్లు ముంపునకు గురైనట్లు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో నాలాలు ఇంకా ఉధృతంగా ప్రవహిస్తున్నందున చెరువు కట్టల పటిష్టతకు, నాలాల విస్తరణకు చేపడుతున్న చర్యలను కేంద్ర బృందానికి అధికారులు వివరించారు. నాగోలు, బండ్లగూడ, బైరామల్‌గూడ చెరువుల నాలాల నుంచి వచ్చే వరద నీటిని మూసీలో కలిపేందుకు శాశ్వత ప్రాతిపదికన నాలాలను అభివృద్ధి చేయనున్నట్లు నీటి పారుదల, బల్దియా అధికారులు వివరించారు. 


VIDEOS

logo