శుక్రవారం 04 డిసెంబర్ 2020
Hyderabad - Nov 01, 2020 , 06:00:08

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డుకు కేంద్రం మొండిచేయి

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డుకు కేంద్రం మొండిచేయి

  • బకాయిల చెల్లింపులో వెనుకడుగు
  • బోర్డుకు రావాల్సిన రూ. 600కోట్ల నిధుల విడుదలకు మంగళం..
  • అభివృద్ధికి అండగా నిలుస్తున్న రాష్ట్ర సర్కారు

కంటోన్మెంట్‌ : దేశంలోనే అతిపెద్ద కంటోన్మెంట్‌ బోర్డుగా ఉన్న సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌పై కేంద్రప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది. బోర్డు అభివృద్ధికి ఏ మాత్రం సహకరించకపోవడంతో పాటు రావాల్సిన నిధులను సైతం విడుదల చేయకపోవడంతో అభివృద్ధిలో కూనరిల్లుతుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, మిలటరీ స్థావరాలు, కార్యాలయాల నుంచి బోర్డుకు రావాల్సిన సర్వీస్‌ చార్జీలను చెల్లించడం లేదు. సర్వీస్‌ చార్జీల రూపేణా కేంద్ర ప్రభుత్వం నుంచి బోర్డుకు సుమారు రూ. 600కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది. కనీసం వీటిలో రూ. 100కోట్లు అయినా చెల్లించాలని కేంద్రం ముందు బోర్డు సభ్యులు ఎన్నిసార్లు విన్నవించినా కనీసం కణికరించకపోవడం గమనార్హం. బకాయిలు పూర్తి స్థాయిలో ఇవ్వలేని పరిస్థితుల్లో కేంద్ర అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం రూ. 99కోట్లు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఇవ్వాలని బోర్డు సభ్యులు రెండున్నరేళ్లుగా అడుగుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికే నిధులులేక బోర్డు పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని, వాస్తవం చెప్పాలంటే ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొందని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానిస్తున్నారు. 

దశల వారీగా రాష్ట్ర సర్కారు నిధుల విడుదల

కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు ఇవ్వకపోయినా రాష్ట్ర సర్కారు మాత్రం బోర్డుకు దశల వారీగా నిధులను విడుదల చేస్తూ అభివృద్ధికి సహకరిస్తున్నది. కంటోన్మెంట్‌లోని ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ట్రాన్స్‌ ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీ ట్యాక్స్‌ (టీపీటీ) నిధులను రాష్ట్ర ప్రభుత్వం బోర్డుకు ఇప్పటికే రెండు దఫాల్లో విడుదల చేసింది. అదే విధంగా కేంద్రం ఇచ్చే 13,14,15వ ఆర్థిక సంఘం నిధుల్లో బోర్డుకు చెల్లించాల్సిన వాటాను ప్రభుత్వం ఈ మధ్యనే బోర్డు ఖాతాలో జమచేయడం జరిగింది. జీఎస్టీ, వినోద పన్ను, వృత్తి పన్నులాంటి ఇతరాత్ర మార్గాల ద్వారా రావాల్సిన బకాయిలను ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం కనిపిస్తున్నది. బోర్డు ఆదాయానికి వేరే మార్గాలు లేవని ఇలాంటి గ్రాంట్లు, సర్వీస్‌ చార్జీల ద్వారానే మనుగడ సాగిస్తున్నదని పలుమార్లు స్థానిక ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, చామకూర మల్లారెడ్డిలకు సూచించారు. దీంతో మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకొని జూలై 2న బోర్డు పాలక మండలి సభ్యులు, అధికారులను తీసుకెళ్లి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుతో సమావేశమయ్యారు. బోర్డుకు సంబంధించిన బకాయిలను నెల నెలా రూ. 10కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇవ్వడమే కాకుండా ఇప్పటికే రెండు దఫాలుగా నిధులను సైతం విడుదల చేశారు. దీంతో ప్రస్తుతం ఎనిమిది వార్డుల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి నిధుల విడుదలతో మార్గం సుగుమమైంది. 

కేంద్ర బకాయిలపై నోరుమెదపని బీజేపీ శ్రేణులు

నిత్యం నిద్రలేచిన దగ్గరి నుంచి కేంద్ర ప్రభుత్వం అది చేస్తున్నది... ఇది చేస్తున్నది అని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు బోర్డుకు కేంద్ర నుంచి రావాల్సిన నిధులపై నోరు ఎందుకు మెదపడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కాలంలో వరద ముంపు కారణంగా ఇండ్లల్లోకి నీళ్లు చేరుకుని బ్బందులు పడుతున్న వారిని ఆదుకోవాలన్న కనీస బాధ్యత బీజేపీకి లేదా అని మండిపడుతున్నారు. 

బోర్డుకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

రాజకీయాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభు త్వం సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తోంది. దేశంలో మరే కంటోన్మెంట్‌కు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందించని విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కంటోన్మెంట్‌ సమగ్రాభివృద్ధికి పాటుపడుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కంటోన్మెంట్‌ అంటే ప్రత్యేకమైన అభిమానం. అందుకే రాష్ట్రవ్యాప్తంగా, జీహెచ్‌ఎంసీలో అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలను కంటోన్మెంట్‌ ప్రజలకు కూడా అందించాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నాం. పికెట్‌నాలా, హస్మత్‌పేట్‌ నాలాలు పొంగి కాలనీలు, బస్తీలను ముంపు బారిన పడకుండా చూస్తున్నాం. రామన్నకుంట చెరువు ప్రక్షాళనకు ప్రత్యేక నిధులు కేటాయించాం. ఈ విషయంలో మంత్రి కేటీఆర్‌ చూపిన చొరవ అపారం. ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం సత్ఫలితాలను ఇస్తోంది. త్వరలోనే బకాయిలు చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. - జక్కుల మహేశ్వర్‌రెడ్డి, ఒకటో వార్డు సభ్యుడు, కంటోన్మెంట్‌ బోర్డు