మంగళవారం 27 అక్టోబర్ 2020
Hyderabad - Sep 20, 2020 , 01:27:04

కబ్జా.. ఉపేక్షించరు

కబ్జా.. ఉపేక్షించరు

ఆక్రమణలపై ‘అసెట్స్‌ ప్రొటెక్షన్‌ సెల్‌' ఉక్కుపాదం

ప్రభుత్వ ఆస్తులకు రక్షణ ఏపీసీ

శివార్లలోనే కబ్జాలు.. అధికంగా వస్తున్న ఫిర్యాదులు

రెండున్నర నెలల్లోనే వందకు పైగా ఆక్రమణల తొలగింపు

ఆక్రమణలపై ఆస్తుల పరిరక్షణ విభాగం (ఏపీసీ) పంజా విసురుతున్నది. గడిచిన రెండున్నర నెలల్లోనే 100కుపైగా ఆక్రమణలు తొలగించింది. ముఖ్యంగా శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌ ప్రాంతాల నుంచే కాక జీహెచ్‌ఎంసీ పరిధి వెలుపల కూడా ఆక్రమణలపై ప్రజలనుంచి అత్యధికంగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఇందులో భాగంగానే నగరంలో చెరువులు, లేఔట్‌ ఖాళీ స్థలాలు, పార్కులు కబ్జాకు గురికాకుండా ఈవీడీఎం (డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏపీసీ (అసెట్స్‌ ప్రొటెక్షన్‌ సెల్‌) విభాగాన్ని ఈ ఏడాది జూలైలో ఏర్పాటుచేసి... టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800-599-0099 సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఫిర్యాదుదారుల వివరాలు తెలిసే అవకాశం లేకుండా గోప్యత పాటిస్తున్నారు.  

  ఆక్రమణలు కొనసాగించే ప్రసక్తేలేదు 

ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీకి సంబంధించి 300పైచిలుకు ఫిర్యాదులు రాగా,  100కుపైగా ఆక్రమణలను తొలగించారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి తదితర జోన్‌లల్లో కొన్నిచోట్ల పక్కగా నిర్మించిన ప్రహరీ, భవనాలను నేలమట్టం చేశారు. చాలావరకు నకిలీపత్రాలు చూపుతూ ప్రభుత్వ స్థలాలను కబ్జాచేసేందుకు యత్నిస్తున్నట్లు ఈవీడీఎం విభాగం డైరెక్టర్‌ విశ్వజీత్‌ కంపాటి తెలిపారు. నకిలీ పత్రాలు.. నిజమైనవో, కావో తెలుసుకునేందుకు సమయం పడుతున్నదని, పత్రాలు పరిశీలించకుండా చర్యలు తీసుకోవడం సాధ్యం కాదన్నారు. కానీ ఆక్రమణలు మాత్రం కొనసాగించే ప్రసక్తిలేదని ఆయన వివరించారు.

    ఏపీసీ పరిధి పెంచితే మేలు..

ఏపీసీ సెల్‌కు వస్తున్న ఫిర్యాదులు అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధికి వెలుపల ఉన్నవే. జీహెచ్‌ఎంసీ ఫిర్యాదులతో పోల్చుకుంటే... శివార్లలోని మున్సిపాలిటీల పరిధిలోవే  ఐదారు రెట్లు అధికంగా ఉండడం గమనార్హం. ఉదాహరణకు ఇటీవల బోడుప్పల్‌ పరిధిలోని చెరువు కబ్జాచేస్తున్న అంశంపై ఏపీసీకి ఫిర్యాదు అందగా.... తమ పరిధి కాదని వదిలేశారు. 

రెవెన్యూశాఖ, జీహెచ్‌ఎంసీ రెండూ తమ పరిధి కాదని వదిలేయడం... స్థానిక మున్సిపల్‌ అధికారులు పట్టించుకోకపోవడంతో దర్జాగా కబ్జాలకు దారి చూపినట్లవుతున్నది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీలోని ఏపీసీ పరిధిని మరింత విస్తరించాలని ప్రజలు, ఫిర్యాదుదారులు వేడుకొంటున్నారు. 

జూలై నుంచి ఇప్పటివరకు 

ఏపీసీకి వచ్చిన ఫిర్యాదులు

అంశం                   ఫిర్యాదులు

చెరువులు    71

పార్కులు   108

ఖాళీ స్థలాలు   142

మొత్తం   321

జీహెచ్‌ఎంసీ 

వెలుపల ఫిర్యాదులు 1954

మొత్తం 2275

జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఫిర్యాదులు జోన్లవారీగా..

జోన్‌ ఫిర్యాదులు

ఎల్బీనగర్‌ 73

చార్మినార్‌ 37

సికింద్రాబాద్‌ 31

ఖైరతాబాద్‌ 41

కూకట్‌పల్లి 58

శేరిలింగంపల్లి 81

మొత్తం 321
logo