బుధవారం 28 అక్టోబర్ 2020
Hyderabad - Sep 29, 2020 , 00:17:49

హక్కులు కల్పించి.. శాశ్వత పరిష్కారం చూపుతాం

హక్కులు కల్పించి.. శాశ్వత పరిష్కారం చూపుతాం

మూడు జిల్లాల ప్రజలకు మంత్రి కేటీఆర్‌ భరోసా 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని ప్రజలు తమ నివాసిత ఇండ్ల హక్కులపై దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలపై శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం నడుం బిగించింది. వివిధ కారణాలతో ఆస్తులపైన హక్కులు దక్కలేదని బాధ పడుతున్న వారికి సర్వహక్కులు కల్పించి భరోసానిచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ మున్సిపాలిటీల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలతో సుదీర్ఘ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాల పరిధిలో పేరుకుపోయిన ఆపరిష్కృత సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ భరోసా ఇచ్చారు..

శుభపరిణామం

జిల్లాలోని పేదల ఇండ్ల సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం శుభ పరిణామం. తరతరాలుగా పేదలు, మధ్య తరగతి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను పట్టించుకొని శాశ్వత పరిష్కారం చూపించడం వల్ల ఎంతో మందికి మేలు జరుగుతుంది. రాజేంద్రనగర్‌లోని హన్‌మాన్‌ నగర్‌, సిక్‌ శావని, మహేశ్వరం, జల్‌పల్లి ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించాను.      

- మంత్రి సబితారెడ్డి

సమస్యలన్నీ తీరుస్తాం 

ప్రజలకు తమ ఆస్తులపై ఉన్న టైటిట్‌ హక్కుల సంబంధిత సమస్యలు తీర్చడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. గ్రేటర్‌లో స్థిరపడిన వారంతా అధికారికంగా పొజిషన్‌ సర్టిఫికెట్స్‌ లేక అల్లాడిపోతున్నారు. ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసముంటున్న వారికి ఇప్పటికే 58, 59 జీవోల ద్వారా ఉపశమనం కలిగించాం. తొమ్మిది చోట్ల ఉన్న ఎంసీహెచ్‌ క్వార్టర్స్‌ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాను.

-మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

క్రమబద్ధీకరణ ఫలాలు అందిద్దాం

పేదలకు ప్రభుత్వం అందిస్తున్న క్రమబద్ధీకరణ ఫలాలు దక్కేలా చూస్తాం. మేడ్చల్‌ జిల్లా జవహనగర్‌లో ఎన్నో ఏండ్లుగా పేదలు నివాసం ఉంటున్న స్థలాలను జీవో-58 కింద క్రమబద్ధీకరించాలి. పీర్జాదిగూడలో 15 ఎకరాల్లో, బోడుప్పల్‌లో సర్వే నంబర్‌ 63లో, ఘట్‌కేసర్‌తో పాటు మేడ్చల్‌ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న పేద ప్రజల స్థలాలను క్రమబద్ధీకరించాల్సిన అవసరమున్నది.

-మంత్రి మల్లారెడ్డి


logo