శనివారం 05 డిసెంబర్ 2020
Hyderabad - Sep 03, 2020 , 23:10:40

హవాలా ద్వారా.. సొమ్ము బదిలీ

హవాలా ద్వారా.. సొమ్ము బదిలీ

ఎగుమతి వ్యాపారులే లక్ష్యంగా దందా..!

కలర్‌ ప్రిడిక్షన్‌ గేమ్‌ డబ్బులు.. వ్యాపారుల ఖాతాల్లోకి..

తెలుగు రాష్ర్టాల వ్యాపారుల ఖాతాల్లో రూ.11 కోట్లు..

హైదరాబాద్‌ కురుల వ్యాపారిని విచారించిన సైబర్‌క్రైమ్‌ పోలీస్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కలర్‌ ప్రిడిక్షన్‌ పేరుతో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహించిన చైనా సంస్థలు .. హవాలా ద్వారా దేశ వ్యాప్తంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్లు వెల్లడవుతున్నది. రెండు తెలుగు రాష్ర్టాల నుంచి చైనాతో వ్యాపారం నిర్వహించే కొందరికి రూ. 11 కోట్ల వరకు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ద్వారా సేకరించిన సొమ్మును పంపిణీ చేసినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. దర్యాప్తులో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ఇందులో హైదరాబాద్‌లోని కురుల(వెంట్రుకల) వ్యాపారి ఖాతాలో ఒకసారి రూ. 85 లక్షలు డిపాజిట్‌ కాగా 8 నెలల్లో మొత్తం రూ. 2.5 కోట్ల వరకు డిపాజిట్‌ అయినట్లు తేలింది. దీంతో ఈ వ్యాపారిని గురువారం సీసీఎస్‌ సైబర్‌క్రైమ్స్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ మదన్‌గౌడ్‌ బృందం విచారించింది. తాను వెంట్రులను మయన్మార్‌ నుంచి చైనాకు పంపిస్తానని, తనకు రావాల్సిన డబ్బు తన ఖాతాలో డిపాజిట్‌ అయ్యిందంటూ విచారణ అధికారుల ముందు సదరు వ్యాపారి వెల్లడించినట్లు తెలిసింది. అయితే .. అతడిని పూర్తిస్థాయిలో విచారించాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్‌తో పాటు విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళంలోని వ్యాపారుల ఖాతాల్లో సంవత్సర కాలంలో రూ.11 కోట్లు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ సంస్థల నిర్వాహకుల నుంచి వచ్చినట్లు వెల్లడయ్యింది. ఇప్పటికే సైబర్‌క్రైమ్‌ పోలీసులు పేటీఎం పేమెంట్‌ గేట్‌ వే ప్రతినిధులను విచారించారు. గురువారం క్యాష్‌ఫ్రీ ప్రతినిధులు కూడా విచారణకు హాజరయ్యారు. రోజర్‌పే గేట్‌వే ప్రతినిధులు ఇంకా విచారణకు రావాల్సి ఉంది. హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌తో పాటు నగరంలో సంతోష్‌నగర్‌, ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్లలోనూ ఈ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై కేసులు నమోదయ్యాయి. ఆయా పోలీసులు వాళ్లకు కావాల్సిన సమాచారం కోసం కోర్టు అనుమతితో నిందితులను కస్టడీకి తీసుకోనున్నారు. ఒక పక్క పేమెంట్‌ గేట్‌వేల ద్వారా రూ. 1800 కోట్లకుపై బెట్టింగ్‌ ద్వార చైనీయులు డబ్బు వసూలు చేశారు. దానిలో అధికారికంగా కొంత మాత్రమే తమ దేశానికి తరలించారు. మిగతాది ఏమి చేశారనే దానిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు హవాలా వ్యవహారం తెలిసింది. దీనిపై లోతైన దర్యాప్తు చేస్తున్న క్రమంలో హవాలా ద్వారా చైనా సంస్థలు డబ్బు ఎక్కడికి పంపించారనే విషయాలు నెమ్మదిగా బయటపడుతున్నాయి. భారతదేశం నుంచి వివిధ రకాలైన వస్తువులను చైనాకు ఎగుమతి చేసే వ్యాపారులే లక్ష్యంగా ఈ హవాలా దందా సాగినట్లు పోలీసులు గుర్తించారు. తెలుగు రాష్ర్టాల్లోని వ్యాపారులను సైబర్‌క్రైమ్‌ పోలీసులు విచారించనున్నారు. విచారణలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశాలున్నాయి.