గురువారం 26 నవంబర్ 2020
Hyderabad - Jul 29, 2020 , 23:47:12

బకాయిలపై బంపర్‌ ఆఫర్‌

బకాయిలపై బంపర్‌ ఆఫర్‌

ఆస్తిపన్నుపై 90శాతం వడ్డీమాఫీ

వాటర్‌ సెస్‌పై వడ్డీ లేకుండా పెండింగ్‌ బిల్లులు వసూలు

ప్రకటించిన జీహెచ్‌ఎంసీ, జలమండలి  

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగరవాసులకు జీహెచ్‌ఎంసీ, జలమండలి బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించాయి. ఎన్నోఏండ్లుగా పేరుకుపోయిన ఆస్తిపన్ను, నీటిబిల్లుల బకాయిలపై వడ్డీని మాఫీ చేసి వసూలు చేయాలని నిర్ణయించాయి. ఆస్తిపన్ను వడ్డీలను 90శాతం మాఫీ చేయడంతో 5.64లక్షలమంది యజమానులకు రూ. 900 కోట్లకుపైగా లాభం చేకూరనుంది. దీనివల్ల జీహెచ్‌ఎంసీకి వడ్డీ ద్వారా రావాల్సిన రూ. 900కోట్ల ఆదాయం పోతున్నప్పటికీ రూ. 1477కోట్లమేర పన్ను బకాయిలు వసూలయ్యే అవకాశం కలిగింది. అంతేకాదు వడ్డీమాఫీ నిర్ణయంతో ఎంతోకాలంగా పెండింగులో ఉన్న పన్ను వివాదాలు సైతం పరిష్కారమయ్యే ఆస్కారం ఏర్పడింది. అలాగే జలమండలి వన్‌ టైం సెటిల్‌మెంట్‌ స్కీంలో భాగంగా వడ్డీ భారం లేకుండా వినియోగదారులు బిల్లు చెల్లించుకునే వెసులుబాటును కల్పించింది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 15 వరకు బకాయిలు చెల్లించేందుకు మరో అవకాశం కల్పిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బకాయిలు చెల్లించేవారికి వాటర్‌ సెస్‌పై వడ్డీ రాయితీ లభించనుంది. 

వాటర్‌ బిల్‌.. వన్‌టైం సెటిల్‌మెంట్‌..

ఇప్పటికే జలమండలిలో దాదాపుగా ప్రభుత్వ రంగ సంస్థలు రూ. 1000కోట్లు, ఇతర గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలకు సంబంధించి రూ. 700 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. దీంతో సంస్థ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. అందుకే మరోసారి ఓటీఎస్‌ పథకాన్ని అమలు చేస్తున్నది. 45 రోజుల గడువులో వెయ్యికోట్ల రాబడి అంచనాపై అధికారులు ఆశలు పెట్టుకున్నారు. వచ్చే నెల 1 నుంచి 45 రోజుల పాటు అమలయ్యే ఓటీఎస్‌ పథకానికి సంబంధించి జలమండలి మార్గదర్శకాలను రూపొందించింది. 2వేల వరకు వడ్డీమాఫీ అధికారం క్షేత్రస్థాయి మేనేజర్లకు, రూ. 2001 నుంచి రూ.10వేల వరకు డీజీఎం స్థాయిలో, రూ.10వేలకు పైగా మాఫీపై జనరల్‌ మేనేజర్‌కు అప్పగించే అధికారాన్ని బోర్డు ఎండీకి కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బకాయిలను పారదర్శకంగా వసూలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎండీ దానకిశోర్‌ తెలిపారు. ఓటీఎస్‌ పథకాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

చెల్లింపుదారులకు రూ.900 కోట్లు ప్రయోజనంజీహెచ్‌ఎంసీ ఆస్తిపన్ను జాబితాలో 16,05,556 ఆస్తులుండగా, వాటిపై ఏటా రూ. 1410.83 కోట్లమేరకు పన్ను డిమాండ్‌ఉంది. అసెస్‌మెంట్లలో హెచ్చుతగ్గులు, ఖాళీ భవనాలు, శిథిలావస్థకు చేరిన భవనాలు, కుటుంబ సభ్యుల తగాదాలు, యజమానులు, అద్దెదారుల వివాదాలు తదితర కారణాలతో దాదాపు 5.64లక్షల మంది ఇండ్ల యజమానులు 15-20ఏండ్లుగా పన్నులు సరిగా చెల్లించడం లేదు. దీంతో 2019-20 ముగిసేనాటికి రూ.1477.86 కోట్ల మేర అసలు పన్ను బకాయి, అలాగే, వీటిపై రూ.1017.76కోట్ల వడ్డీ పేరుకుపోయింది. బకాయిదారులకు నోటీసులు జారీచేయడమే కాకుండా మార్చి నెలలో ఏటా ఆస్తిపన్ను పరిష్కారం పేరుతో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ పెండింగ్‌ బిల్లులు మాత్రం వసూలు కావడం లేదు. ఈ నేపథ్యంలో పేరుకుపోయిన ఆస్తిపన్ను వసూలుకు తగిన చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ గత ఆర్థిక సంవత్సరం చివరలో ప్రభుత్వానికి లేఖ రాశారు. జీహెచ్‌ఎంసీ యాక్టులోని సెక్షన్‌ 679-ఈ ప్రకారం బకాయిల వసూలు కోసం వన్‌ టైమ్‌ అమ్నెస్టీ స్కీమ్‌(ఓటీఏఎస్‌)ను ప్రవేశపెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రభుత్వం ఈనెల 28వ తేదీన ఆస్తిపన్ను బకాయిలపై పేరుకుపోయిన వడ్డీలను 90 శాతం మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు ఒకటి నుంచి 45 రోజుల్లోగా పన్నులు చెల్లించే వారికి ఈ పథకం వర్తిస్తుంది. దీనివల్ల బల్దియాకు రూ. 1017.76 కోట్ల వడ్డీల్లో పదిశాతం పోగా, దాదాపు రూ.900 కోట్లకుపైగా పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరనుంది. పాత బకాయిలు వసూలైతే జీహెచ్‌ఎంసీకి రూ.1477.86 కోట్ల మేరకు ఆదాయం సమకూరుతుంది. ఈ పథకం ఇటు పన్ను చెల్లింపుదారులకు, అటు బల్దియాకు పరస్పరం ప్రయోజనం చేకూర్చుతుందని చెప్పవచ్చు.