సోమవారం 03 ఆగస్టు 2020
Hyderabad - Jul 15, 2020 , 23:02:41

బంజారాహిల్స్‌లో రౌడీల వీరంగం

బంజారాహిల్స్‌లో రౌడీల వీరంగం

-అకారణంగా ఇద్దరు జర్నలిస్టులపై దాడి

బంజారాహిల్స్‌, నమస్తే తెలంగాణ : బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో వీధిరౌడీలు వీరంగం సృష్టించారు. రోడ్డుపై వెళ్తున్నవారితో అకారణంగా గొడవపడడంతో పాటు మద్యం బాటిళ్లతో తలపై కొట్టడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 14లోని నందినగర్‌లో నివాసం ఉంటున్న అరుణ్‌కుమార్‌ ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడు. అతడి సోదరుడు దిలీప్‌ కూడా అదే పత్రికలో సబ్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం సాయంత్రం నందినగర్‌ గ్రౌండ్స్‌ను ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో కొంతమంది రౌడీలు తిష్టవేసి మద్యం తాగుతూ రోడ్డుపై వెళ్తున్నవారిని అటకాయిస్తుండడంతో పాటు దుర్భాషలాడుతున్నారు. అదే సమయంలో ఆఫీసుకు ఆ దారిలో వెళ్తున్న అరుణ్‌, దిలీప్‌లతో వారు గొడవకు దిగారు. దుర్భాషలాడుతుండడంతో ఇదేంటని ప్రశ్నించగా చేతికందిన మద్యం బాటిళ్లతో దాడి చేశారు. పిడిగుద్దులతో విరుచుకుపడడంతో దిలీప్‌, అరుణ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అక్కడకు రావడంతో దాడికి పాల్పడ్డ ఐదుగురు వ్యక్తులు పారిపోయారు. బాధితులు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలించి, ఇద్దరు నిందితులు శేఖర్‌, అరుణ్‌లను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ప్రాంతంలో తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, ఒంటరిగా వెళ్లేవారిపై దాడులు చేస్తూ దుండగులు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని స్థానికులు పేర్కొన్నారు. పోలీసులు కఠినచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


logo