సోమవారం 30 నవంబర్ 2020
Hyderabad - Sep 19, 2020 , 00:16:48

ఊపిరి పోస్తున్నారు

ఊపిరి పోస్తున్నారు

ఇక గ్రేటర్‌లో ఆక్సిజన్‌ ఫుల్‌

సిలిండర్లు అమర్చే విధానంలో ఇబ్బందులకు చెక్‌

టిమ్స్‌ సహా నాలుగు వైద్యశాలల్లో ఎల్‌ఓటీ.. పడకపడకకూ ఏర్పాటు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వ పరిపాలనలో ఎల్‌ఓటీల ఏర్పాటుతో దవాఖానల్లో ఆక్సిజన్‌ అందించే వ్యవస్థ అత్యంత సులువైంది. ఆక్సిజన్‌ కొరతకు స్వస్తి పలికింది. ఒకప్పుడు శ్వాస సరిగ్గా తీసుకోలేని క్లిష్టమైన రోగులకు అత్యవసర సమయంలో ఆక్సిజన్‌ ఇవ్వాలంటే ఇబ్బందులు తలెత్తేవి. సిలిండర్లను రోగి వద్దకు తెచ్చి అమర్చడంలో కొంత జాప్యం జరిగేది. ప్రస్తుత కరోనా కాలంలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడకుండా.. పడక పడకకూ ఆక్సిజన్‌ అందేలా సిలిండర్ల వ్యవస్థకు స్వస్తి చెబుతూ ఆక్సిజన్‌ ప్లాంట్స్‌ అంటే లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంక్‌లను ఏర్పాటు చేసింది తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ. 

కరోనా రోగులే కాకుండా సాధారణ రోగుల ఊపిరి నిలిపేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్‌ ట్యాంకులను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా నగరంలోని నాలుగు ప్రధాన దవాఖానల్లో ఎల్‌ఓటీ ట్యాంకులను ఏర్పాటు చేసింది. కరోనా దవాఖాన గచ్చిబౌలి టిమ్స్‌లో 1200 పడకలకు ఏకకాలంలో ఆక్సిజన్‌ను సరఫరా చేసేలా 21 కేఎల్‌ సామర్థ్యం గల లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంక్‌ను ఇటీవలే ప్రభుత్వం ఏర్పాటు చేయించింది. ఫలితంగా ప్రతి రెండు గంటలకోసారి ఆక్సిజన్‌ సిలిండర్లను మార్చే ప్రయాస తప్పడంతో రోగికి కూడా ఇబ్బందులు తప్పినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌ తదితర ట్రెషరీ దవాఖానల్లో ఎల్‌ఓటీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

కొత్తగా ఏర్పాటు చేసిన ఎల్‌ఓటీలు..

ప్రస్తుతం కరోనా నేపథ్యంలో రోగులకు ఆక్సిజన్‌ అవసరం పెరుగడంతో ముందుజాగ్రత్త చర్యగా ఇప్పటికే గాంధీలో ప్రతి పడకకు ఆక్సిజన్‌ సరఫరాను ఏర్పాటు చేసిన తెలంగాణ సర్కార్‌ అన్ని కొవిడ్‌ దవాఖానల్లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకులను ఏర్పాటు చేసింది. ఇటీవల మరో నాలుగు కరోనా కేంద్రాలైన గచ్చిబౌలిలోని టిమ్స్‌, కింగ్‌కోఠి జిల్లా దవాఖాన, ఎర్రగడ్డ ఛాతి దవాఖానల్లో వీటిని ఏర్పాటు చేసింది. నల్లకుంట ఫీవర్‌ దవాఖానలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. 

దవాఖాన పేరు సామర్థ్యం

గచ్చిబౌలిలోని టిమ్స్‌ 21కేఎల్‌ (1500 పడకల సామర్థ్యం)

ఎర్రగడ్డ ఛాతి దవాఖాన 13కేఎల్‌ (వెయ్యి పడకల సామర్థ్యం)

కింగ్‌కోఠి దవాఖాన 500 పడకల సామర్థ్యం

నల్లకుంట ఫీవర్‌ దవాఖాన 500 పడకల సామర్థ్యం (ఏర్పాట్లు జరుగుతున్నాయి)

గతంలో ఉన్న దవాఖానల వివరాలు

ఉస్మానియా 1500 పడకలకు ఆక్సిజన్‌ సామర్థ్యం

గాంధీ 1500 పడకలకు ఆక్సిజన్‌ సామర్థ్యం

నిమ్స్‌ 1500 పడకలకు ఆక్సిజన్‌ సామర్థ్యం

నిలోఫర్‌ 1000 పడకలకు ఆక్సిజన్‌ సామర్థ్యం