గురువారం 09 జూలై 2020
Hyderabad - May 25, 2020 , 01:43:49

కూతురికి సంతానం లేక బాలుడి కిడ్నాప్‌

కూతురికి సంతానం లేక బాలుడి కిడ్నాప్‌

చార్మినార్‌ : కూతురికి సంతానం లేక తల్లడిల్లుతుందని ఎలాగైనా అధిగమించాలని తలచిన ఓ తల్లి ఏకంగా ఓ బాలుడిని కిడ్నాప్‌ చేసింది. ఈ ఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. దూద్‌బౌలీ ప్రాంతానికి చెందిన సమ్రీన్‌ భిక్షాటన చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు. తొమ్మిది ఏండ్లక్రితం  పెద్దకుమార్తెకు వివాహం జరిగింది. కానీ ఆమెకు సంతానం కలుగక పోవడంతో  భర్త  వేధింపులకు పాల్పడేవాడు. ఈ క్రమంలో కుమార్తెకు ఎలాగైనా ఓ బాబును అప్పగించాలని పథకం  వేసింది.  ఫారుఖ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన షేక్‌ అబ్దుల్‌ సలాం, రఫియా సుల్తానా భార్యభర్తలు. 

ఈ నెల 22న షమాటాకీస్‌ సమీపంలోని గరీబ్‌ నవాజ్‌ దవాఖానకు నాలుగేండ్ల కుమారుడు షేక్‌ అబ్దుల్‌ వాహబ్‌ను తీసుకుని చికిత్స కోసం వచ్చారు.  వైద్యం కోసం నిరీక్షిస్తున్న సమయంలో చిన్నారి ఆడుకుంటూ తల్లి ఒడిలో నుంచి దవాఖాన బయటకు వచ్చాడు. అదే సమయంలో  భిక్షాటన చేస్తున్న సమ్రీన్‌ చిన్నారిని చేతుల్లోకి తీసుకుని అక్కడి నుంచి పారిపోయింది. చుట్టూ వెతికినా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో  తల్లిదండ్రులు ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు  సీసీ కెమెరాలను పరిశీలించారు. దూద్‌బౌలీ ప్రాంతానికి చెందిన సమ్రీన్‌ చిన్నారిని కిడ్నాప్‌ చేసినట్లు గుర్తించారు. ఆదివారం నిందితురాలి ఇంటిపై దాడి చేసి అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం ఫలక్‌నుమా పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో ఎస్సైలు శ్రీశైలం, తఖీయుద్దీన్‌తోపాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 


logo