మంగళవారం 01 డిసెంబర్ 2020
Hyderabad - Oct 31, 2020 , 06:32:01

ఉయ్యాలే.. ఉరితాడయ్యింది

ఉయ్యాలే.. ఉరితాడయ్యింది

  • ఇద్దరు కొడుకులను ఇంట్లో ఉంచి దవాఖానకు తల్లిదండ్రులు
  • ఆడుకుంటూ.. ఉయ్యాల కట్టిన పెద్దకొడుకు
  • ఊగుతూ.. మెడకు చుట్టుకుని మృతి

 బంజారాహిల్స్‌: సరదాగా ఆడుకోవడానికి కట్టిన ఉయ్యాలే.. ఉరితాడయ్యింది. దవాఖానకు వెళ్లే క్రమంలో ఇద్దరు కొడుకులను ఇంట్లో ఉంచి తాళం వేసుకొని వెళ్లగా.. ఉయ్యాలలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మెడకు చుట్టుకుని బాలుడు మృతి చెందాడు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.  మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట మండలం, ఎల్లాసకి చెందిన జెట్టా పల్లెం నర్సింహ, అంజలి దంపతులు బతుకు దెరువుకోసం నగరానికి వచ్చారు.  యూసుఫ్‌గూడ సమీపంలోని యాదగిరి నగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు మల్లికార్జున్‌(7) మూడో తరగతి చదువుతున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటున్నాడు.   భర్త నర్సింహతో కలిసి దవాఖానకు వెళ్లే క్రమంలో పెద్దకొడుకుతో పాటు నాలుగేండ్ల చిన్నకొడుకును ఇంట్లోనే ఉంచి బయటనుంచి తాళం వేసింది. ఇదిలా ఉండగా.. తమ్ముడితో కలిసి అడుకున్న మల్లికార్జున్‌ మంచానికి, కిటికీకి చున్నీతో ఉయ్యాల కట్టాడు. ఉయ్యాలలో ఊగుతుండగా అది వడితిరిగి మల్లికార్జున్‌ మెడకు చుట్టుకుంది. దాంతో ఊపిరి ఆడక మృతి చెందాడు. దీంతో తమ్ముడు కేకలు పెట్టగా.. పక్కింట్లో కూడా ఎవరూ లేకపోవడంతో అతడి కేకలు ఎవరూ వినిపించుకోలేదు. సుమారు రెండు గంటల తర్వాత దవాఖాన నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులకు చున్నీలో చిక్కుకుపోయి మృతి చెందిన కొడుకు కనిపించాడు. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు