శనివారం 08 ఆగస్టు 2020
Hyderabad - Jul 13, 2020 , 00:12:58

నిరాడంబరంగా బోనాలు..

నిరాడంబరంగా బోనాలు..

19న అమ్మవారి ఉత్సవాలు భక్తులు లేకుండా నిర్వహిస్తామని ఆలయ కమిటీ వెల్లడి 

20న రంగం    

అంబర్‌పేట/ గోల్నాక : ప్రతి ఏటా ఆషాఢంలో నిర్వహించే అంబర్‌పేట మ హంకాళి అమ్మవారి బోనాలు ఈ ఏడు నిరాడంబరంగా జరుగనున్నాయి.  ఆరు దశాబ్దాలకు పైగా ఈ ఆలయంలో ప్రతి ఏటా ఆశాఢంలో పది రోజుల పాటు బోనాల ఉత్సవాలు  నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది కరో నా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అనుసరించి భక్తులు లేకుండా ఉత్సవాలు నిర్వహించేందుకు  దేవస్థాన సేవా సమితి సిద్ధమవుతోంది.

 19న అమ్మవారి బోనాలు..   

12న ఆదివారం సాయంత్రం కేవలం పదిమంది ఆలయ కమిటీ ప్రతినిధులు, అమ్మవారి ఘటం ఊరేగింపుతో బోనాల ఉత్సవాలు  ప్రారంభమయ్యాయి.  ఈ ఊరేగింపు గ్రామ పొలిమేరలో ఉన్న పోత లింగన్న బొడ్రాయి వద్దకు చేరుకొని అక్కడ పూజలు నిర్వహించి అనంతరం ఆలయానికి చేరుకుంటారు. ఈనెల 19న ఆదివారం బోనాల జాతరను నిర్వహిస్తారు. 20న అమ్మవారు రంగం(భవిష్యవాణి) వినిపిస్తారు. ఈ ఉత్సవాల్లో  భక్తులకు అనుమతి లేకుండా కేవలం పూజారులు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొని కొవిడ్‌-19 నిబంధనల ప్రకారం అమ్మవారి జాతర నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు అంబర్‌పేట దేవస్థాన సేవాసమితి ప్రధాన కార్యదర్శి మోర శ్రీరాములు ముదిరాజ్‌ తెలిపారు. ఇక  పండుగ రోజు మాత్రం ఎవరి ఇండ్లలో వారే అమ్మవారికి బోనాలు సమర్పించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయ పరిసరాల్లోకి అనుమతించమని తెలిపారు.

 శాకాంబరిగా అమ్మవారు..

అంబర్‌పేట :  ఆదివారం బోనాలను పురస్కరించుకొని అంబర్‌పేట మహంకాళి అమ్మవారు భక్తులకు శాకాంబరిగా దర్శనమిచ్చారు. ఈ నెల 19, 20 తేదీల్లో జరిగే బోనాలకు భక్తులకు ప్రవేశం లేకపోవడంతో ఆదివారం అధిక సంఖ్యలో స్థానికులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి అమ్మవారి దర్శనానికి వచ్చారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అంబర్‌పేట దేవస్థాన సేవా సమితి అధ్యక్షుడు జె.సత్తిబాబుగౌడ్‌, ఉపాధ్యక్షుడు పి.చంద్రశేఖర్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీరాములుముదిరాజ్‌, కార్యదర్శి చెంగలి సుధాకర్‌, కార్యనిర్వాహక కార్యదర్శి గడ్డం శ్రీధర్‌గౌడ్‌, కోశాధికారి వి.మహేందర్‌రెడ్డి తదితరులు ఏర్పాట్లు చేశారు. బాగ్‌అంబర్‌పేట కార్పొరేటర్‌ కె.పద్మావతి, కె.దుర్గాప్రసాద్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. 


logo