సోమవారం 30 నవంబర్ 2020
Hyderabad - Aug 31, 2020 , 23:35:45

పేదలకు వరం సీఎం సహాయనిధి

పేదలకు వరం సీఎం సహాయనిధి

ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌

గోల్నాక, ఆగస్టు 31: ఆపత్కాలంలో నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. సోమవారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి మంజూరైన చెక్కులను ఆయన బాధితులకు అందజేశారు. అంబర్‌పేట బాపునగర్‌కు చెందిన జె. భాస్కర్‌కు రూ.40 వేలు, బాగ్‌అంబర్‌పేట సీఈ కాలనీలో ఉండే బి.వెంకటేశ్‌కు రూ.40 వేలు, అంబర్‌పేట చెన్నారెడ్డినగర్‌కు చెందిన పావనికి రూ.60వేలు, అదే ప్రాంతానికి  చెందిన విజయ్‌కు రూ. 16వేలు, అంబర్‌పేట ప్రేమ్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ ఆరిఫొద్దీన్‌కు రూ. 35 వేలు గల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఆపదలో ఉన్న బాధితులకు విరివిగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి నిధులు మంజూరు చేయిస్తున్నామన్నారు.  పభుత్వ పథకాలను  సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. 


దిశా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే 

అంబర్‌పేట:  నగరంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి ఇతర అంశాలపై దిశా(డిస్ట్రిక్ట్‌ డెవలప్‌మెంట్‌ కో ఆర్డినేషన్‌ అండ్‌ ప్లానింగ్‌ మీటింగ్‌) చైర్మన్‌, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ ఆన్‌లైన్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి. జనరిక్‌ మెడిసిన్‌ దుకాణాలు ప్రభుత్వ ద వాఖానల వద్ద అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల కోసం శానిటరీ ప్యాడ్స్‌  ఉంచాలని. బస్తీ దవాఖానలను వెల్‌నెస్‌ సెంటర్లకు అనుసంధానం చేయాలని చర్చించారు. పీఎం ఆత్మ నిర్భర్‌ స్ట్రీట్‌ వెండర్‌ సన్మాన్‌ నిధి ప్రయోజనాలు ప్రతి వీధి వ్యాపారికి అందాలని, కేంద్ర పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అందించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. ఎమ్మెల్యే వాటిపై తన అభిప్రాయాలను వెల్లడించారు.