గురువారం 21 జనవరి 2021
Hyderabad - Nov 27, 2020 , 07:34:09

రాజకీయ లబ్ధికే.. బీజేపీ, ఎంఐఎం మాయమాటలు

రాజకీయ లబ్ధికే.. బీజేపీ, ఎంఐఎం మాయమాటలు

చిక్కడపల్లి/కవాడిగూడ: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ, ఎంఐఎం నాయకులు మాయ మాటలు చెపుతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.  నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో కవిత పాల్గొని, మాట్లాడారు. ముషీరాబాద్‌ ఆర్యవైశ్య భవన్‌లో గాంధీనగర్‌ డివిజన్‌ ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఐదేండ్లలో రూ.67 వేల కోట్లతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నగరాన్ని అభివృద్ధి చేసిందనీ, కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో బీజేపీ నాయకులు చెప్పాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో వరదలతో ప్రజలు ఇబ్బందులు పడ్డా పరామర్శించని ప్రధాని ఇప్పుడు గ్రేటర్‌ ఎన్నికల్లో ఓట్ల  కోసం వస్తున్నారని విమర్శించారు.  

తెలంగాణ జాగృతి లీగల్‌ సెల్‌ ఆధ్వర్యంలో జరిగిన  జాతీయ రాజ్యాంగ దినోత్సవంలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గత ఆరేండ్లుగా ఎన్నో రాజ్యంగ ఉల్లంఘనలకు పాల్పడిందనీ, వీటిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని కవిత అన్నారు. అంతకుముందు గాంధీనగర్‌ డివిజన్‌ అభ్యర్థి ముఠా పద్మానరేశ్‌ తరఫున ఎమ్మెల్సీ కవిత ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా తమ కాలనీలకు వచ్చిన కవితకు మహిళలు మంగళహారుతులు పట్టి విజయ తిలకం దిద్దారు. ఆయా సమావేశాల్లో ఎమ్మెల్సీలు బుగ్గారావు, దయానంద్‌ గుప్తా, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్‌, కృష్ణమోహన్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

ఆర్టీసీకి అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నది. ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించింది. సమ్మె కాలంలోని జీతాలను ఏకమొత్తంలో రూ.235 కోట్లు విడుదల చేసింది. ప్రభుత్వ సంస్థలను కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్‌లాంటి ప్రభుత్వ సంస్థలను అమ్మకానికి పెట్టింది. టీఆర్‌ఎస్‌కు  ఆర్టీసీ కార్మికులు ఓటేసి గెలిపించాలి. - కార్మికుల సమావేశంలో కవిత


logo