బుధవారం 30 సెప్టెంబర్ 2020
Hyderabad - Sep 16, 2020 , 01:10:42

అన్నింటా బెస్ట్‌.. మనమే ఫస్ట్‌

అన్నింటా బెస్ట్‌.. మనమే ఫస్ట్‌

అనువైన జీవనానికి ఉత్తమ రాజధాని

వినోదం.. పర్యాటకం... పసందైన వంటకాలు..   

ఉత్తమ పర్యాటక కేంద్రంగా గుర్తింపు

హాలిడిఫై తాజా సర్వేలో దేశంలోనే నంబర్‌ 1 

దక్షిణ భారతంలో న్యూయార్క్‌ సిటీగా కితాబు


  ప్రకృతి రమణీయ దృశ్యాలు.. ఆహ్లాదాన్ని అందించే సమతుల వాతావరణం.. అందాల బృందావనాలు... వందల ఏండ్ల చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే చెక్కుచెదరని చారిత్రక కట్టడాలు.. అలరించే అద్భుత వారసత్వ సంపద కలిగిన పాతనగరం.. టెక్నాలజీకి కేంద్రంగా గుర్తింపు పొందిన ఐటీ కారిడార్‌.. ఆధునిక సొబగులతో తళుక్కుమంటున్న కొత్త నగరాల కలయికతో భిన్నసంస్కృతులకు నిలయమైన హైదరాబాద్‌ అన్ని వర్గాల జన జీవనానికి అనువైన నగరంగా పేరొందింది. 

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ మరోసారి ఉత్తమ నగరంగా నిలిచింది. చారిత్రక గొప్పదనంతోపాటు మెరుగైన మౌలిక వసతులు, సుస్థిర అభివృద్ధి, ఆర్థిక ప్రగతిలో హైదరాబాద్‌ ఉత్తమ పర్యాటక నగరం స్థానాన్ని దక్కించుకుంది. పలు అంశాల  ప్రాతిపదికగా ‘హాలిడిఫై ’ సంస్థ దేశంలోని 34 ఉత్తమ పర్యాటక నగరాల జాబితాను రూపొందించింది.అందులో హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలవడం విశేషం. సాధారణంగా హాలిడిఫై.కామ్‌ పర్యాటకులు తమ ప్రాధాన్యతలను ఎంపిక చేసుకోవడానికి ఇబ్బందులు లేకుండా సర్వేల ఆధారంగా సమాచారం పొందుపరుస్తుంది. భాగ్యనగరం జీవనానికి అనువైనదిగా, పర్యాటకంగా  ఆహ్లాదకరమైనదిగా పేర్కొన్నది. ఐటీ, ఫార్మా, యాపిల్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌, మైక్రో సాఫ్ట్‌ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలకు నెలవుగా, అంతర్జాతీయ విమానాశ్రయంతో గ్లోబల్‌ సిటీగా మారుతున్న హైదరాబాద్‌ దక్షిణ భారతంలో న్యూయార్క్‌ సిటీగా అభివృద్ధి చెందుతున్నట్లు అభివర్ణించింది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు వంటి మహానగరాల కంటే హైదరాబాద్‌కు మంచి రేటింగ్‌ ఇచ్చింది. హైదరాబాద్‌ నగరం  అభివృద్ధి చెందుతుండటం, ప్రణాళిక బద్ధంగా వికేంద్రీకరణ వల్ల జనజీవనం సాఫీగా సాగిపోతున్నదని తాజాగా హాలిడిఫై అనే సంస్థ పేర్కొన్నది. 

సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నైట్‌ బజార్‌లు.. ముత్యాల మురిపాలు... రత్నాలను తలపించేలా రంగురంగుల కాంతులతో తళుకులీనే గాజుల బజార్‌లు...చార్మినార్‌ నుంచి మొదలుకుని హైటెక్‌ సిటీ వరకు తళతళమనే అభివృద్ధి అందాలు.. ఇలా అన్ని రకాల చారిత్రక వారసత్వ సంపద, కళలు, అందాలను కలబోసుకున్న భాగ్యనగరానికి ప్రపంచంలోనే ‘బెస్ట్‌ లివెబుల్‌ సిటీ’గా గుర్తింపు దక్కింది. అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ఆధునిక మౌలిక సదుపాయాలతో గ్లోబల్‌ సిటీగా ప్రపంచ పటంలో స్థానం సంపాదించుకుంటున్న హైదరాబాద్‌ మరోసారి జీవనానికి సౌకర్యంగా, పర్యాటకులకు మంచి టూరిజం స్పాట్‌గా విలసిల్లుతున్నదని  తాజాగా  ‘హాలిడిఫై డాట్‌ కామ్‌' అనే వెబ్‌సైట్‌ నిర్వహించిన సర్వేలో తేలింది. ఆ సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో ప్రముఖ నగరాల జాబితాలో అగ్ర స్థానాన్ని సంపాదించుకున్నది మన సిటీ.

బెస్ట్‌ లివబుల్‌ సిటీగా...

గతంలో కూడా ఇంతకు ముందు ప్రపంచ ప్రముఖ సంస్థలు హైదరాబాద్‌కు మంచి రేటింగ్‌ ఇచ్చాయి. ‘మెర్సర్స్‌' అనే ప్రపంచ ప్రఖ్యాత వెబ్‌సైట్‌ రేటింగ్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రపంచంలో బెస్ట్‌ లివబుల్‌ సిటీలలో హైదరాబాద్‌కు ప్రముఖ స్థానం దక్కింది. దీనికి హైదరాబాద్‌లో శాంతిభద్రతలు పటిష్టంగా ఉండటం, ఎటువంటి విధ్వంసకర, విచ్ఛిన్నకర కార్యకలాపాలకు ఆస్కారమివ్వకపోవడం, అన్ని వర్గాల ప్రజలకు భద్రత ఉండటం కూడా ప్రధాన కారణమని విశ్లేషించింది. దీనికి తెలంగాణ ప్రభుత్వాన్ని సంస్థ ప్రశంసించింది. హైదరాబాద్‌లో జీవన ప్రమాణం బాగా పెరుగుతుందని విశ్లేషించింది. 

80కిపైగా పర్యాటక కేంద్రాలు...

ఇతర మెట్రో నగరాలలో మాదిరిగా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ కష్టాలు అంతగా లేవని తేల్చింది. పాత, కొత్త నగరాల కలయిక, భిన్న సంస్కృతుల సమ్మేళనం, సంయమన జీవనాన్ని  ఇక్కడి ప్రత్యేకతగా పేర్కొన్నది. హైదరాబాద్‌ బిర్యానీ అత్యంత ప్రత్యేకమైనదని పేర్కొన్నది. హైదరాబాద్‌లో 80కి పైగా పర్యాటక కేంద్రాలు ఉన్నట్లుగా ‘హాలిడిఫై’ వెల్లడించింది. సిటీ ఆఫ్‌ నిజామ్స్‌గా, సిటీ ఆఫ్‌ పెరల్‌గా పేరున్న హైదరాబాద్‌కు... చార్మినార్‌, గోల్గొండ, హుస్సేన్‌సాగర్‌, సాలర్‌జంగ్‌ మ్యూజియం, బిర్లామందిర్‌, పురానా హవేళి, చౌమహల్లా ప్యాలెస్‌, లుంబినీ పార్క్‌, బిర్లా ప్లానిటోరియం, ఫలక్‌నుమా ప్యాలెస్‌, లాడ్‌ బజార్‌, జూపార్క్‌, కుతుబ్‌షాహీ టూంబ్స్‌, దుర్గం చెరువు, చిలుకూరు బాలాజీ మందిరం, తారామతి-బారాదరి, పైగా టూంబ్స్‌, మక్కా మసీదు, బొటానికల్‌ గార్డెన్‌ ప్రత్యేక ఆకర్షణలని తెలిపింది. దీంతో పాటు 23కు పైగా అంతర్జాతీయ స్థాయిలో స్టార్‌ హోటల్స్‌, శివార్లలో పలు రిసార్ట్‌లు స్వదేశీ, విదేశీ పర్యాటకులకు అనువుగా ఉంటాయని పేర్కొన్నది.
logo