శుక్రవారం 03 జూలై 2020
Hyderabad - May 25, 2020 , 01:49:33

తుదిదశకు.. బాటసింగారం లాజిస్టిక్‌ పార్కు

తుదిదశకు.. బాటసింగారం లాజిస్టిక్‌ పార్కు

హైదరాబాద్  :  ఔటర్‌ రింగు రోడ్డు సమీపంలో 40 ఎకరాల విస్తీర్ణంలో సకల సదుపాయాలతో బాట సింగారం లాజిస్టిక్‌ పార్కు అందుబాటులోకి రానున్నది. వస్తువుల రవాణాకు ఎగుమతి, దిగుమతులకు అనుకూలంగా ఉన్న ఔటర్‌ చుట్టూ లాజిస్టిక్‌ పార్కుల ఏర్పాటు ద్వారా నగరంపై పడుతున్న ట్రాఫిక్‌ ఒత్తిడిని నివారించడం, మెరుగైన ప్రయాణ సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఈ క్రమంలోనే బాటాసింగారంలో రూ. 35 కోట్లలో చేపట్టిన పనులు తుదిదశకు చేరాయి. ఈ లాజిస్టిక్‌  కమర్షియల్‌ సేవలను త్వరలోనే ప్రారంభించేందుకు హెచ్‌ఎండీఏ సన్నాహాలు చేస్తున్నది. అయితే రూ.20 కోట్లతో 22 ఎకరాల్లో మంగళ్‌పల్లి లాజిస్టిక్‌ సేవలను ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చారు. 

ప్రత్యేకతలతో లాజిస్టిక్‌ హబ్‌

విశాలమైన గోదాం (వేర్‌హౌస్‌) నిర్మాణాన్ని ఆధునిక సౌకర్యాలతో పూర్తి చేశారు. ఎండకాలంలో కూడా వేడిమిని తట్టుకుని చల్లదనాన్ని ఇచ్చేలా ఇన్సులేషన్‌ను ఏర్పాటు చేశారు. లక్షల టన్నుల సరుకులు ఇక్కడ నిల్వ ఉండేలా భారీ గోడౌన్‌ నిర్మాణం పూర్తి చేశారు. వందల సంఖ్యలో డ్రైవర్లు ఒకేసారి విశ్రాంతి తీసుకునేందుకు నాలుగు విశాలమైన గదులను నిర్మించారు. డ్రైవర్లుకు మౌలిక వసతుల్లో భాగంగా టాయిలెట్లు నిర్మించారు. సామాన్లను భద్రపరచు కోవడానికి ప్రత్యేకంగా లాకర్లను సౌకర్యాన్ని కల్పించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ట్రక్కులు, లారీల డ్రైవర్లు సేద తీరేందుకు కూడా విశ్రాంతి భవనంలో సకల సౌకర్యాలను కల్పించారు. 

నిర్మాణ పనులివే.. 

రవాణా సేవలకు వీలుగా 500 ట్రక్కులు నిలిపేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. రెండు లక్షల చదరపు అడుగులు, 10 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణం, పదివేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆటోమొబైల్‌ సర్వీస్‌ సెంటర్‌, కార్యాలయ నిర్వహణకు 10 వేల చదరపు అడుగులు, ఒకటి వెహికల్‌ టెస్టింగ్‌ సెంటర్‌, 200 మందికి వీలుగా విశాంత్రి గదులు నిర్మాణం చేపట్టారు. ఐదు వేల అడుగుల విస్తీర్ణంలో రెస్టారెంట్స్‌/దాబాలు, ఒక షేల్‌ కంపెనీకి చెందిన పెట్రోల్‌ బంక్‌ అందుబాటులో ఉంచారు. వీటితో పాటు ఎలక్ట్రానిక్‌ వేయింగ్‌ బ్రిడ్జి, ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ నిర్మాణాలు పూర్తి చేశారు. ఎలక్ట్రానిక్‌ వేబ్రిడ్జి, ట్రాన్స్‌పోర్టు కార్యాలయం సేవలు ఏర్పాటు చేశారు. 


logo